చరిత్రపై చెరగని అఘాయిత్యం! | Sakshi editorial on AP government announces to celebrate Ramoji Rao Jayanti as a state festival | Sakshi
Sakshi News home page

చరిత్రపై చెరగని అఘాయిత్యం!

Nov 22 2026 3:54 AM | Updated on Nov 22 2026 3:54 AM

Sakshi editorial on AP government announces to celebrate Ramoji Rao Jayanti as a state festival

జనతంత్రం

కళ్లముందు కదలాడిన చరిత్రనే దారి మళ్లిస్తున్న దౌర్భాగ్యాన్ని చూడవలసి వచ్చింది. చరిత్ర వక్రీకరణ అనే సాదాసీదా పదబంధం ఈ వైపరీత్యానికి సరిపోదు. ఇది చరిత్రపై జరిగిన అత్యాచారం. పాలకులే పూనుకొని ఈ పాపానికి ఒడిగట్టడం భరింపరాని మహాదుష్కృతం. రామోజీరావు జయంతిని రాష్ట్ర వేడుకగా జరపాలని ఏపీ ప్రభుత్వం చేసిన ప్రకటనను కొంత మంది సమర్థిస్తున్నారు. ఆయన పత్రికలు పెట్టారు, పచ్చళ్లు అమ్మారు. ప్రజలకు పొదుపు నేర్పడానికి ఊరూరా మార్గదర్శి హుండీలు పెట్టారు. సినిమాలు తీశారు. భారీ స్టూడియోను నిర్మించారు. ఇన్ని చేసిన ఘనత కలిగిన వ్యక్తికి ఆ గౌరవాన్ని కల్పిస్తే తప్పేమిటని వీరి వాదన.

ఈ ఘనతల వెనుక దాగివున్న ‘గాడ్‌ఫాదర్‌’ నవలా సూక్తి గురించి వీరందరికీ తెలియకపోవచ్చు. తెలిసినా దాటవేసే సమర్థకులు కూడా ఉండవచ్చు. ‘బిహైండ్‌ ఎవ్రీ గ్రేట్‌ ఫార్చూన్‌ దేర్‌ ఈజ్‌ ఏ క్రైమ్‌’ అనే నవలా వాక్యం రామోజీ ‘విజయా’లకు అచ్చుగుద్దినట్టు ఉంటుందని తెలియజెప్పే ఉదంతాలు ఇప్పటికే బయటపడ్డాయి. నిజమే, రామోజీరావు ఈనాడు పత్రికను పెట్టారు. తనకు గిట్టని ప్రభుత్వాలను గద్దె దించేందుకూ, సలాం కొట్టే పార్టీలను గద్దె ఎక్కించేందుకూ పత్రికను ఆయుధంగా వాడుకున్నారు. కింగ్‌ మేకర్‌ కుర్చీలో కూర్చోగలిగారు. రాజగురువుగా చలామణి అయ్యారు. వ్యాపార సామ్రాజ్యాన్ని వృద్ధి చేసుకున్నారు.

మరి పాఠకులకు ఏం ఒరగబెట్టారు? ‘స్కైలాబ్‌’ పడి పోతుంది, ఇక బతికేది కొద్దిరోజులేనంటూ జనాన్ని బెదరగొట్టి సర్క్యులేషన్‌ ప్రమోషన్‌కు వాడుకున్నారు. చిన్న చిన్న చిట్‌ఫండ్‌ కంపెనీల మీద పరిశోధక జర్నలిజాన్ని ప్రయోగించి, వాటిని చిత్తుచిత్తుగా ఓడించి మార్గదర్శి రథయాత్రకు మార్గాన్ని సుగమం చేశారు. పోటీగా ఎదిగే పత్రిక ఆర్థిక పునాదుల్ని దెబ్బతీయటానికి సారా ఉద్యమ శంఖారావం వినిపించారు. పని పూర్తి కాగానే మద్యనిషేదం విఫలమైందనే సన్నాయి రాగాలు పలికించి దాన్ని ఎత్తి వేయించారు. ఎన్టీ రామారావుపై అభ్యంతరకరమైన కార్టూన్లు గీయించి, రాతలు రాయించి చంద్ర బాబు వెన్నుపోటుకు వెన్నుదన్నుగా నిలబడ్డారు.
వ్యాపార దృష్టితో కాకుండా స్వాతంత్య్రోద్యమానికి ప్రజ లను సమాయత్తం చేయడం కోసం పత్రికలను నడిపించిన దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, ముట్నూరికృష్ణారావు పంతులు తదితరులు ఇటువంటి గౌరవానికి పాత్రులు కాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. 

ఆంధ్ర పత్రిక, కృష్ణా పత్రికలు స్వాతంత్య్రోద్యమంలో పోషించిన పాత్ర చరిత్ర చదువుకున్న వారికి బాగా తెలుసు. సామాజిక రుగ్మతలపై, అధికారపు దౌష్ట్యంపై, పెత్తందారీతనపు జులుంపై ఆయుధాలు సంధించిన ఉదయం పత్రికను దాసరి నారాయణరావు స్థాపించారు. వందకు పైగా సినిమాలకు ఆయన దర్శకుడు కూడా. కారంచేడు కండకావరం ఘటన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో దళిత ఉద్యమం కొత్తమలుపును తీసుకున్నది. ఆ మలుపులో ఒక దారి దివిటీగా నిలబడిన ఘనత ఆ పత్రికకున్నది. ఈనాడుకు ఉన్న నంబర్‌వన్‌ టైటిల్‌ను సాక్షి పత్రిక ఆరంభంలోనే సవాల్‌ చేసింది. అత్యధిక సర్క్యులేషన్‌ గల పత్రికగా ఏబీసీ గుర్తింపు లభించా ల్సిన తరుణంలో వంచనాశిల్పంతో, నక్కజిత్తులతో ఈనాడు అడ్డుపుల్లలు వేయగలిగింది.

హైదరాబాద్‌లో ఒక పెద్ద సినిమా స్టూడియోను నిర్మించారు కనుక రామోజీ ఈ గౌరవానికి యోగ్యుడేననే అభిప్రాయం కొందరికి ఉండవచ్చు. ఆంధ్ర ప్రాంతం మద్రాసు రాష్ట్రంలో ఉన్న సమయంలోనే రాయలసీమ బిడ్డలైన మూల నారాయణ స్వామి, బీఎన్‌ రెడ్డి కలిసి అప్పట్లో దేశంలోనే పెద్దదైన వాహిని స్టూడియోను స్థాపించారు. విఖ్యాత సినీ దర్శకుడు సత్యజిత్‌ రే తీసిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘పథేర్‌ పాంచాలి’తో జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు కోసం చివరిదాకా పోటీపడిన ‘బంగారు పాప’ అనే తెలుగు చిత్రాన్ని తీసిన దర్శకుడు బీఎన్‌ రెడ్డి. వాహిని స్టూడియోను విజయ–వాహినిగా మార్చి తెలుగు సినిమా స్వర్ణ యుగాన్ని డిక్లేర్‌ చేసినవారు బి.నాగిరెడ్డి–చక్రపాణి. ఆ స్వర్ణ యుగపు దర్శకుడు కేవీరెడ్డి. మైనారిటీ వయసు తీరని ఇంటర్‌ చదివే విద్యార్థుల మధ్య శృంగారాన్ని చూపెట్టి కాసులు పిండు కున్న ‘చిత్రం’ రామోజీ ప్రొడక్షన్‌ హౌస్‌ నుంచే వెలువడింది.

ఇక ఆ ఫిలిం సిటీకి వేసిన పునాదుల్లోనే అవినీతి, అక్ర మాలు కోకొల్లలుగా ఉన్నాయనే వార్తలు ఎప్పటినుంచో వినిపి స్తున్నాయి. వినిపించడమే కాదు, చాలావరకు రుజువయ్యాయి కూడా. ఫిలిం సిటీ ఏర్పాటు కోసం సీలింగ్‌ చట్టాలనూ, అసైన్డ్‌ చట్టాలనూ యాజమాన్యం ఉల్లంఘించిందని అధికారులు చేసిన సర్వేల్లో వెల్లడైంది. అరకొరగా జరిగిన సర్వేల్లోనే 60 ఎకరాల ప్రభుత్వ భూమిని ఫిలిం సిటీ ఆక్రమించినట్టు తేలింది. సీలింగ్‌ నిబంధనలను దాటి కుటుంబ సభ్యుల పేర్లతో భూములు రిజిస్ట రయ్యాయి. వైఎస్‌ ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన 14.30 ఎకరాల భూమిని లబ్ధిదారులు స్వాధీనం చేసుకోకుండా పందొమ్మిదేళ్లుగా అడ్డుకుంటున్నారు. సీపీఎం ఆధ్వర్యంలో అడపాదడపా ఆందోళనలు చేయడం తప్ప బాధిత పేదలు ఇప్పటిదాకా తమ పట్టా స్థలాలను స్వాధీనం చేసుకోలేక పోయారు. ఇది స్పష్టమైన మానవ హక్కుల ఉల్లంఘన కాదా? ఇటువంటి ‘ఉల్లంఘనులకు’ ప్రభుత్వ నిధులతో స్మారక వేడుకలు నిర్వహించడం ఉచితమేనా?

శంషాబాద్‌లో కొత్త ఎయిర్‌పోర్టు నిర్మించాలనే ఆలోచన చంద్రబాబు హయాంలోనే మొదలైంది. దేశంలో ఉదారవాద ఆర్థిక విధానాలు ప్రవేశించడం, దాని వెన్నంటే ఐటీ రంగం విస్తృతమవడం వల్ల ఎయిర్‌ ట్రాఫిక్‌ పెరగడం మొదలైంది. దేశమంతటా కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణం లేదా పాతవాటి విస్తరణ వంటి ఆలోచనలు ప్రారంభమైన దశ అది. అయితే హైదరా బాద్‌ ఎయిర్‌పోర్టు ఆలోచన వైఎస్‌ హయాంలోనే ఆచరణ రూపం తీసుకున్నది. ఆలోచన దశలోనే విషయం గ్రహించిన రామోజీరావు ఎయిర్‌పోర్టు సమీపంలోని పాలమాకులగ్రామంలో 450 ఎకరాల భూమిని బినామీల పేర్లతో సేకరించారు. అడ్డుగా ఉన్న పట్టా భూముల్నీ, ప్రభుత్వ భూముల్నీ కూడా అందులో మడతపెట్టేశారన్న ఆరోపణలు వచ్చాయి.కొందరు బాధితుల ఫిర్యాదు మేరకు సర్వే చేసిన అధికారులు అందులో పది ఎకరాలను స్వాధీనపరచుకున్నారు. అధికారుల చర్యలు అంతటితో ఆగిపోయాయి.

విశాఖపట్నంలో ఈనాడు పేపర్‌ పెట్టుకోవడానికి మంతెన ఆదిత్యవర్మ అనే ఆయన 2.78 ఎకరాల భూమినీ, అందులోని భవనాలనూ 33 ఏళ్ల కాలపరిమితికి నెలకు 3 వేల రూపాయల అద్దె చొప్పున లీజుకు ఇచ్చారు. ఈ లీజు స్థలంలో కొంత భాగాన్ని రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వానికి ఇచ్చి బదులుగా మరోపక్కన ప్రభుత్వం ఇచ్చిన భూమిని తన కొడుకు పేరుమీద రిజిస్టర్‌ చేయించుకున్నారు. దీనిపై ఆదిత్యవర్మ క్రిమినల్‌ కేసు పెట్టడంతో రామోజీ ప్లేటు మార్చారు. అక్కడ కొత్త రోడ్డే వేయ లేదనీ, ఎప్పటినుంచో రోడ్డు ఉన్నదనీ ఫోర్జరీ చేసిన మాస్టర్‌ ప్లాన్‌తో కోర్టును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. దీంతో ఆయన మీద ఫోర్జరీ కేసు నమోదు చేయాలని సాక్షాత్తూ న్యాయస్థానమే ఆదేశించవలసి వచ్చింది. విజయవాడ ఈనాడు స్థలయజమాని డాల్ఫిన్‌ అప్పారావు స్వయానా రామోజీ తోడల్లుడు. తనను రామోజీ ఎన్నిరకాలుగా ముప్పతిప్పలు పెట్టాడో స్వయంగా ఆయనే మీడియా ముందు చెప్పుకోవలసి వచ్చింది.

ఇక మార్గదర్శి ఫైనాన్సియర్స్, మార్గదర్శి చిట్‌ఫండ్‌ వ్యవ హారాల్లో రామోజీ సంస్థలు చేసిన చట్ట ఉల్లంఘనల గురించి కొత్తగా చెప్పేదేమీలేదు. ఫైనాన్సియర్స్‌ పేరుతో 2,600 కోట్లను సేకరించడం నిబంధనలకు విరుద్ధమని రిజర్వ్‌ బ్యాంకు ప్రకటించింది. ఉన్నత న్యాయస్థానం దాన్నే నిర్ధారించింది. భారత పార్ల మెంట్‌ కూడా అదే విషయాన్ని ధ్రువీకరించింది. చేసింది తప్పు కనుకనే టీవీ చానళ్లను అమ్మేసుకొని డిపాజిట్లు తిరిగి చెల్లించేశానని రామోజీ చెప్పుకున్నారు. కానీ, ఆర్‌బీఐ చట్టం ప్రకారం చేసిన తప్పుకు రెట్టింపు జరిమానా చెల్లించవలసి ఉంటుంది. అయితే, రామోజీ చనిపోయారు కాబట్టి క్రిమినల్‌ కేసును మూసివేసి ఉండవచ్చు. కానీ జరిమానా చెల్లించవలసిందే కదా! సంస్మరణ వేడుకను డిక్లేర్‌ చేసినవారు ఆ జరిమానాను ఎప్పుడు వసూలు చేయించగలరో చెప్పగలరా?

చిట్‌ఫండ్స్‌ పేరుతో కూడా రామోజీ చట్టాన్ని ఉల్లంఘించారని సందేహాతీతంగా సీఐడీ దర్యాప్తులో రుజువైంది. చిట్టీ పాడుకున్న వాళ్లను నానాయాతనలు పెట్టడమే కాకుండా పాడు కున్న సొమ్ములో కొంత ‘పెట్టుబడి’గా ఆ సంస్థకు సమర్పించా లట. 4 శాతం వడ్డీ చెల్లిస్తారట. ఈ సొమ్ముతో వాళ్లు వ్యాపారాలు చేసుకుంటారు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం. అయినా మార్గదర్శి సంస్థ ఈ చట్ట విరుద్ధ కార్యక్రమాన్ని యథేచ్ఛగా నిర్వహించింది. ఫోర్జరీ కేసు, చీటింగ్‌ కేసు, క్రిమినల్‌ కేసులతో పాటు చట్ట ఉల్లంఘనలపై న్యాయస్థానాలు, దర్యాప్తు సంస్థలు నిర్ధారణ చేసిన వ్యక్తి పేరుతో సంస్మరణ వేడుకను నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచ ప్రఖ్యాత తెలుగు శాస్త్ర వేత్తలు ఎల్లాప్రగడ సుబ్బారావు, యలవర్తి నాయుడమ్మల వంటి వారిని గౌరవించుకుంటే ఈ ప్రభుత్వానికి ఏం ఒరుగుతుంది? రామోజీని గౌరవించుకుంటే రోజూ పద్నాలుగు పేజీల కరపత్రం భజన కీర్తనలు పాడుతుంది.
 


వర్ధెల్లి మురళి 
vardhelli1959@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement