పెళ్లంటే అందరినీ కలిపేది. పెళ్లంటే ఒకరి జీవితంలోకి మరొకరు రావడం మాత్రమే కాదు.. ఒకరి సంతోషంలో మరొకరు పాలుపంచుకోవడం. ముఖ్యంగా విడిపోయిన కుటుంబ సభ్యులను కూడా ఒక్కటి చేస్తుంది పెళ్లి. కుటుంబంలో నీకు నేనున్నానంటూ ధైర్యం చెప్పే మనిషిని మరింత దగ్గర చేస్తుంది. అటువంటి పెళ్లిని రాజకీయానికి వేదికగా మార్చుకోవడం షర్మిలకే చెల్లింది.
జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. కలలు చెదిరిపోవచ్చు. ఆ సమయాల్లో ఒకరినొకరు నిందించుకోకుండా.. కలిసి నిలబడటమే అసలైన గొప్పదనం. ఒకరిపై మరొకరు ఆధిపత్యం చెలాయించడానికి చేసే ప్రయత్నాలు సరికాదు. అటువంటిది చంద్రబాబు సలహాలతో.. చంద్రబాబు కోసం అన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అవమానించేందుకు షర్మిల సిద్ధమయ్యారు. వైఎస్ జగన్ నివాసం ముందు ఆందోళన పేరుతో హైడ్రామాకు తెరతీశారు షర్మిల. కేవలం మరో మూడు రోజుల్లో కుమార్తె పెళ్లి పెట్టుకుని అన్న ఇంటి ముందు డ్రామా ఆడడానికి సిద్ధమయ్యారు.
షర్మిల ప్లాన్ ఇదే?
షర్మిల కూతురి నిశ్చితార్థానికి ముందు నుంచి ఈ డ్రామా మొదలైంది. కూతురి పెళ్లిని తన రాజకీయ అవసరాల కోసం వాడుకునేందుకు షర్మిల ప్లాన్ వేశారు. ఇదే క్రమంలో తనది కాని యలహంక ఆస్తిపై రచ్చ చేశారు. వైఎస్ జగన్‌ను రాజకీయంగా దెబ్బతీసే కుట్రలో ఆమె పావుగా మారారు. రాజకీయ పోరాటంలో షర్మిలను చంద్రబాబు పావుగా ఉపయోగించుకుంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
షర్మిలకు చెందని, ఆమెకు హక్కులేని బెంగళూరు యలహంక ఆస్తిని వివాదంలోకి తీసుకురావడం వెనుక ఆస్తి సమస్య మాత్రమే కాదు, రాజకీయ ఆకాంక్ష కూడా ఉంది. చంద్రబాబు, టీడీపీతో షర్మిల అంతర్గత రాజకీయ అవగాహనతో వైఎస్ జగన్‌ను వ్యక్తిగతంగా, రాజకీయంగా లక్ష్యంగా చేసుకుంటున్నారు. కుమార్తె వివాహాన్ని కూడా రాజకీయ వివాదంగా మార్చి, వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరో 3 రోజుల్లో కుమార్తె వివాహం ఉండగా..
మరో మూడు రోజుల్లో కుమార్తె వివాహం ఉండగా, బెంగళూరులో జగన్ నివాసం ముందు ధర్నాకు షర్మిల సిద్ధమయ్యారు. నవంబర్ 21న చంద్రబాబు ప్రెస్‌మీట్, ఆ తర్వాత షర్మిల బెంగళూరు ధర్నాపై ఎల్లోమీడియా ప్రచారం ఒకే రాజకీయ ప్రణాళికలో భాగం. చంద్రబాబు ప్రెస్‌మీట్ ముగిసిన వెంటనే షర్మిల బెంగళూరు పర్యటనకు సిద్ధమవడం యాదృచ్ఛికం కాదు. నవంబర్ 21 మధ్యాహ్నం 3 గంటలకు ఏబీఎన్‌లో ‘బెంగళూరులో అన్నాచెల్లెళ్ల బిగ్‌ఫైట్’ అంటూ బ్రేకింగ్‌లు రావడం, మరుసటి రోజు షర్మిల ధర్నా చేస్తారంటూ ముందుగానే ప్రచారం చేయడం వెనుక రాజకీయ సమన్వయం స్పష్టంగా కనిపిస్తోంది.
వైఎస్ జగన్ అనుమతి లేకుండా, భద్రతాపరమైన అభ్యంతరాలను పట్టించుకోకుండా ఆయన బెంగళూరు నివాసంలోనే కుమార్తె వివాహం నిర్వహిస్తానని షర్మిల ఏకపక్షంగా ప్రకటించారు. సాక్షి వార్తా కథనంలో వచ్చిన ‘చెట్టపట్టాల్’ అనే సాధారణ పదాన్ని తన వ్యక్తిత్వంపై దాడిగా చిత్రీకరించి, మరో వివాదానికి తెరతీశారు. షర్మిల కుమార్తె వివాహంపై జగన్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. వివాదరహితంగా వివాహం నిర్వహిస్తానని షర్మిల స్వయంగా చెప్పారు. అయినా ఇప్పుడు మరోసారి వివాదానికి సిద్ధమవుతున్నారు.
చంద్రబాబు డైరెక్షన్, ఎల్లోమీడియా స్క్రీన్‌ప్లే ప్రకారం బెంగళూరు ధర్నా వ్యవహారం నడుస్తోంది. జగన్‌ను వ్యక్తిగతంగా బద్నాం చేయడమే దీని లక్ష్యం. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల సందర్భంగా జరుగుతున్న హింస, అక్రమాలు, నారా లోకేశ్ రెడ్‌బుక్ పాలనపై చర్చ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు బెంగళూరు వివాదాన్ని ముందుకు తెస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో జరుగుతున్న పరిణామాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడం చంద్రబాబు రాజకీయ అవసరం. వైఎస్ జగన్‌ను రాజకీయంగా దెబ్బతీయడం చంద్రబాబు, షర్మిల ఉమ్మడి లక్ష్యం. ఈ రెండు ప్రయోజనాల కోసమే బెంగళూరు వివాదాన్ని తెరపైకి తెచ్చారు.
ఇదీ చదవండి: చంద్రబాబు చేతిలో పావులా మారిపోయిన షర్మిల


