మన సనాతన ధర్మానికి సహనం మూలస్తంభం. మన వేద పురాణేతిహాసాలు సహన ప్రాశస్త్యాన్ని వేనోళ్ల ప్రస్తుతించాయి. క్షమ, తితీక్ష– ఇవి సహనానికి సంస్కృత పర్యాయపదాలు. ఓరిమి, ఓర్పు, ఓపిక, తాలిమి, సైరణ– సహనానికి ఇవి తెలుగు పర్యాయపదాలు. సహనం సనాతన ధర్మానికి మూలస్తంభం మాత్రమే కాదు, అత్యంత మౌలికమైన ప్రజాస్వామిక విలువ కూడా!‘తితిక్షవః కారుణికాః సుహృదః సర్వదేహినామ్/ అజాతశత్రవః శాంతాః సాధవః సాధుభూషణాః’ అని శ్రీమద్భాగవతం చెబుతోంది. సజ్జనులు ఎల్లప్పుడూ సహనం కలిగి ఉంటారు. వారికి శత్రువులు ఉండరు. వారికి అందరూ మిత్రులే! వారు శాంత స్వభావులు. సద్గుణాలే వారికి ఆభరణాలు. ‘క్షమా బలమశక్తానాం శక్తానాం భూషణం క్షమా/ క్షమా వశీకృతిర్లోకే క్షమయా కిం న సాధ్యతే’ అని మహాభారతం చెబుతోంది.
అంటే, బలహీనులకు సహనమే బలం. బలవంతులకు సహనం ఒక ఆభరణం.సహనంతో అందరినీ వశం చేసుకోవచ్చు. సహనంతో సాధించలేనిది ఏదీ లేదు.పురాణేతిహాసాల కంటే మునుపటివైన వేదాలు కూడా సహన శక్తిని ప్రస్తుతించాయి. ‘దృతే దృంహ మా మిత్రస్య మా చక్షుషా సర్వాణి భూతాని సమీక్షన్తామ్/ మిత్రస్యాహం చక్షుషా సర్వాణి భూతాని సమీక్షే/ మిత్రస్య చక్షుషా సమీక్షామహే!’ అని యజుర్వేదం చెబుతోంది. శుక్ల యజుర్వేదంలోని ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే, ‘ఓ భగవంతుడా! నన్ను దృఢంగా, సహనశీలిగా ఉంచు. సమస్త ప్రాణులు నన్ను మిత్రదృష్టితో చూడాలి. సమస్త జీవులను మిత్రదృష్టితో చూసే ఓర్పును నాకు కూడా ప్రసాదించు.’
ప్రపంచవ్యాప్తంగా పలు మతాలు సహనాన్ని ఉన్నత విలువగా ఉద్బోధిస్తున్నాయి. ‘ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపును’ అని బైబిల్ చెబుతోంది. ప్రేమకు పునాది సహనమేనని బైబిల్ సారాంశం. ‘నిశ్చయంగా అల్లాహ్ సహనం వహించే వారితోనే ఉంటాడు’ అని ఖురాన్ చెబుతోంది. సహనవంతులకు భగవంతుడి తోడుఉంటుందని ఖురాన్ సారాంశం. ‘ఖంతి పరమం తపో తితిక్ఖా’ అని బౌద్ధం చెబుతోంది. అంటే, సహనానికి మించిన తపస్సు లేదు. ‘క్షమా వీరస్య భూషణం’ అని జైనం చెబుతోంది.
పాశ్చాత్య తత్త్వవేత్తలు కూడా సహనం గురించి విపులంగా చెప్పారు. సహనాన్ని ‘ప్రకృతి తొలి సూత్రం’గా అభివర్ణించాడు ఫ్రెంచ్ తత్త్వవేత్త వోల్టేర్. ‘సహనమంటే ఏమిటి? అది మానవత్వ పరిణామం. మనమంతా బలహీనతలతోను, లోపాలతోను పుట్టాం. ఒకరి లోపాలను మరొకరం పరస్పరం క్షమించుకుందాం– అదే ప్రకృతితొలి సూత్రం’ అన్నాడాయన. లోకంలో సహనాన్ని ప్రబోధించేవారు చాలామందేఉంటారు గాని, ఆచరణలో సహనాన్ని పాటించేవారే అరుదు. చరిత్రలో ఇందుకు ఉదాహరణలకు కొదువ లేదు. ‘సహనానికి మద్దతుగా తీవ్రమైన అసహనాన్ని చూశాను’ అన్నాడు ఇంగ్లిష్ కవి, తత్త్వవేత్త శామ్యూల్ టేలర్ కోల్‌రిడ్జ్. లోకంలో ఇదొక అనాది విరోధాభాస!
అనాదిగా మనది సనాతనం దేశం. స్వాతంత్య్రం వచ్చాక ప్రజాస్వామిక దేశం కూడా! మన దేశాధినేతలను చూస్తే, పాపం వారందరూ సనాతనధర్మ ప్రవాచకులే! విచిత్ర మేమిటంటే, సనాతనధర్మ ప్రవాచకుల నేతృత్వంలో నడుస్తున్న మన ప్రజాస్వామికదేశంలో సహనమే కరవవుతోంది. ప్రశ్నలపై అసహనం; వాస్తవాలపై అసహనం; భావ ప్రకటనపై అసహనం దేశంలో అగ్గిసెగలా రాజుకుంటోంది. మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం. కాని, పత్రికా స్వేచ్ఛా సూచిలో మనది 157వ స్థానం. సనాతన దేశంలో సహన సాంద్రత ఎంతటిదో అర్థం చేసుకోవడానికి ఇదొక్కటి చాలు.
ప్రపంచ స్థాయిలో మన ఘనతను తెలిపే ఇలాంటి మచ్చుతునకలు మరిన్ని ఉన్నాయి కాని, ప్రస్తుతానికి అవన్నీ అప్రస్తుతం. మన సనాతన పాలకుల సహన తీవ్రత ఎంతటి దంటే, ప్రశ్నిస్తుందేమోననే భయంతో ఒక విదేశీ పాత్రికేయురాలికి దేశంలోకి అడుగు పెట్టేందుకు అనుమతి నిరాకరించేటంత! మన ప్రవచనాలన్నీ సనాతన సూక్తులు; ఆచరణలోని మన ఘనతలన్నీ అసహనానికి పరాకాష్ఠలు. ఇప్పుడిదంతా ఎందుకంటే, నేడు అంతర్జాతీయ సహన దినోత్సవం. సహనమేవ జయతే!


