ఇటీవల వెల్లడైన మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లు దారుణంగా దెబ్బతిన్నా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహారశైలి మారిన దాఖలా కనబడటం లేదు. ఎప్పటిలాగే పరస్పర విరుద్ధ సంకేతాలు పంపుతూ గందరగోళపరిచేందుకే ఆయన ప్రయత్నిస్తు న్నారు. తమ దాడులవల్ల ఇరాన్ సైనికంగా బలహీనపడిందనీ, ఇక యుద్ధం ముగిసిందనే అనుకుంటున్నాననీ మంగళవారం ఆయన ప్రకటించారు. ఆ ప్రాంత దేశాలైన ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్ తదితర దేశాల కోరికమేరకే కొత్త దాడులు చేయరాదన్న నిర్ణయం తీసుకున్నామన్నారు.
ఇరాన్ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేశాం గనుక ఇక యుద్ధం అవసరం లేదని విదేశాంగ మంత్రి మార్కో రుబియో కూడా చెప్పారు. వినడానికి బాగానే అనిపించినా ఈ ప్రకటనల్లో ఎక్కడో తేడా ఉందని అందరికీ అర్థమవు తుంది. ఒకపక్క యుద్ధం ఇక ఉండబోదంటూనే ఓడరేవుల దిగ్బంధం కొనసాగిస్తామని ట్రంప్ అంటున్నారు. మాటలవరకూ ఆయన అయోమయం సృష్టిస్తున్నా, చేతలు ఆయనే మిటో చాటుతున్నాయి. ఇప్పటికీ రోజూ హార్మూజ్ జలసంధిలో చమురు నౌకలపై అమెరికా దాడులు చేస్తూనేవుంది. వాటికి జవాబుగా ఇరాన్‌వైపునుంచి ప్రతిఘటన కొనసాగుతోంది.
ఒమన్‌లో భాగమైన దీదామర్ దీవిలో చమురు స్మగ్లింగ్‌కు పాల్పడు తున్న శత్రు నౌకల్ని ధ్వంసం చేశామని ఇరాన్ తెలిపింది. ఇవన్నీ అమెరికా తరలించుకు పోతున్న ముడిచమురు ట్యాంకులే. ఆత్మరక్షణ కోసమంటూ ఇరాన్‌లోని కెషమ్ ద్వీపంపై అమెరికా దళాలు ఇటీవలే దాడులు జరిపాయి. ఈ యుద్ధానికి అనుబంధంగా మొదలైన లెబనాన్, యెమెన్ ఘర్షణలు కూడా యథావిధిగానే ఉన్నాయి. అమెరికా మాదిరే ఇజ్రాయెల్ సైతం లెబనాన్‌తో కుదిరిన ఒడంబడికను ఉల్లంఘిస్తూ నిత్యం దాడులు చేయటంవల్లే ఈ పరిస్థితి తలెత్తింది.
ఎనిమిది నెలల క్రితం ఇరాన్‌తో అనవసర కయ్యానికి దిగిన ట్రంప్ వల్ల ఆర్థిక వ్యవస్థ కనీవినీ ఎరుగని స్థాయిలో కష్టాలు ఎదుర్కొంటున్నది. ఇంధన ధరలు భారీగాపెరగటంతో, ఇతర నిత్యావసరాల ధరలు సైతం ఆకాశాన్నంటాయి. మొన్న ఆగస్టు తర్వాత తొలిసారి బ్రెంట్ ముడి చమురు బ్యారెల్ 90 డాలర్లకు పడిపోయింది. ట్రంప్ తాజా ప్రకటనే ఇందుకు కారణం. కానీ ఇలా అబద్ధాలతో ఎన్నాళ్లు ధరల్ని అదుపు చేయగలుగుతారు? అమెరికా దుందుడుకు చర్యలు, అది తరచు స్వరం మార్చటం వగైరాలన్నీ దశాబ్దాలుగా చూస్తున్న ఇరాన్‌ను ఇలాంటి మాయదారి ప్రకటనలు మోసపుచ్చలేవు.
ఆ దేశ విదేశాంగమంత్రి అబ్బాస్ అరఘాచి చెప్పినట్టు గౌరవప్రదమైన భాష, దౌత్యపరమైన చర్చలు, ఇన్నేళ్లుగా అమలు చేస్తూ వచ్చిన ఆంక్షల ఎత్తివేత, అమెరికా స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తుల విడుదల వంటివి మాత్రమే ఘర్షణలు నిలిచిపోవటానికి దోహదపడతాయి. ఇవన్నీ జరిగిన రెండు రోజుల్లోనే హార్మూజ్‌జలసంధిలో సాధారణ పరిస్థితులేర్పడతాయని కూడా అరఘాచి అన్నారు. ఈ ప్రతిపాదనలపై తన వైఖరేమిటో చెప్పకుండా, లక్ష్యం నెరవేరింది గనుక తదుపరి దాడులుండబోవని ట్రంప్ చెప్పటం ప్రజల్ని వంచించటమే.
రిపబ్లికన్లను జనం తిరస్కరించటానికి ఇరాన్ యుద్ధంతోపాటు ఇతర కారణాలు కూడా ఉన్నాయి. తన రెండో ఏలుబడి మొదలయ్యాక ట్రంప్ దేశంలో సకల వ్యవస్థలనూ నాశనం చేశారు. న్యాయవ్యవస్థను గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రయత్నించారు. జాతి విద్వేషాలను రెచ్చగొట్టారు. వలసదారులపై ఉక్కుపాదం మోపారు. సక్రమంగా దేశంలో ప్రవేశించినవారిని సైతం వేటాడారు. లైంగిక మైనారిటీ లను వేధించారు. అదనపుసుంకాల పేరిట అనేక దేశాలను దూరం చేసుకున్నారు. వీటన్నిటికీ బాధ్యుడు స్టీఫెన్ మిల్లర్. అలాంటి వ్యక్తిని తాజాగా ట్రంప్ పదోన్నతి కల్పించి, వైట్‌హౌస్ సిబ్బంది వ్యవహారాల చీఫ్‌గా నియమించారు.
ఆయనలో పరివర్తన రాలేదనీ, ఇరాన్ యుద్ధం గురించిన ప్రకటన కూడా మోసపూరిత ఎత్తుగడేననీ స్పష్టంగా తెలుస్తుంది. ఈరెండేళ్లూ ఎటూ ఆయన మైనారిటీ అధ్యక్షుడిగానే కాలం వెళ్లదీయాలి. అయినా తనవీటో అస్త్రాన్ని ఎడాపెడా ప్రయోగిస్తారు. ప్రతినిధుల సభలోనూ, సెనేట్‌లోనూ డెమాక్రాట్లు తమ ఆధిక్యతతో వీలైనమేర అడ్డుకుంటేనే ఈ వైపరీత్యాల తీవ్రతను కాస్తయినా తగ్గించటం సాధ్యమవుతుంది.


