టెహ్రాన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఇరాన్ గట్టి ఝలక్ ఇచ్చింది. తాము ఇరాన్‌తో చేసిన యుద్ధంలో ఇప్పటికే విజయం సాధించామని, ఆ దేశ సైనిక శక్తి తీవ్రంగా దెబ్బతిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ ధీటుగా బదులిచ్చింది. శాటిలైట్‌కు అంతుచిక్కని, శత్రుదుర్భేద్యమైన సైనిక స్థావరాలు, అపారమైన ఆయుధ సంపత్తి మా దగ్గర ఉందని చాటిచెప్పేలా ఓ వీడియోని విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పరిణామం అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది.
అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల అనంతరం అంతర్జాతీయ మీడియాతో తొలిసారి మాట్లాడిన ట్రంప్.. ఇరాన్‌తో జరుగుతున్న ఉద్రిక్తతలు, యుద్ధ పరిస్థితులపై స్పందించారు. ఇరాన్‌తో జరుగుతున్న ఈ ఘర్షణ సైనికపరంగా దాదాపు ముగింపు దశకు వచ్చిందని, ప్రస్తుతం పరిస్థితి యథాస్థితిగా కొనసాగుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి పెద్ద ఎత్తున సైనిక చర్యలు చేపట్టాల్సిన అవసరం కనిపించడం లేదని ఆయన స్పష్టం చేశారు.
తాము ఇరాన్‌తో జరిపిన పోరులో ఇప్పటికే విజయం సాధించామని, ఆ దేశ సైనిక శక్తి తీవ్రంగా దెబ్బతిందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికి దాడులు అవసరం లేదనిపిస్తున్నప్పటికీ, పరిస్థితులు మారితే స్పందించేందుకు అమెరికా సైన్యం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని హెచ్చరించారు. ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాల జోలికి వెళ్లకుండా అడ్డుకుంటామని తన వైఖరిని మరోసారి స్పష్టం చేశారు.
ట్రంప్ ప్రకటనకు కౌంటర్‌గా ఇరాన్ మాస్టర్ ప్లాన్!
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల నేపథ్యంలో ఇరాన్ సైనిక శక్తి పూర్తిగా ధ్వంసమైందని, వారి మిలిటరీ సామర్థ్యం తుడిచిపెట్టుకుపోయిందని ట్రంప్ తరచూ ప్రకటనలు చేస్తుండటం తెలిసిందే. తాజాగా మధ్యంతర ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఆయన ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు.
అయితే, ఈ వాదనలన్నింటినీ పటాపంచలు చేస్తూ టెహ్రాన్ తాజాగా సంచలన వీడియోను విడుదల చేసింది. ఇరాన్ రక్షణ రంగం చెక్కుచెదరలేదని, అంతర్జాతీయ ఆంక్షలను ఎదుర్కొంటూనే మరింత బలాన్ని పుంజుకుంటున్నామని శత్రు దేశాలకు గట్టి సంకేతాలు పంపింది. శత్రు దేశాల రాడార్లకు చిక్కకుండా, శాటిలైట్ల కన్నుగప్పి భూగర్భంలో నిర్మించిన రహస్య సైనిక స్థావరాలను ఈ వీడియోలో అధికారికంగా బయటపెట్టింది. వందలాది శక్తివంతమైన క్షిపణులు, అత్యాధునిక సైనిక ట్రక్కులతో నిండి ఉన్న ఈ భూగర్భ సొరంగాల దృశ్యాలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
సొరంగాల్లో క్షిపణుల సామ్రాజ్యం
ఇరాన్ స్టేట్ టీవీ, అధికారిక వార్తా సంస్థలు ప్రసారం చేసిన ఈ విజువల్స్‌లో కిలోమీటర్ల కొద్దీ విస్తరించి ఉన్న భారీ భూగర్భ సొరంగ మార్గాలు కనిపిస్తున్నాయి. ఎటువంటి వైమానిక దాడులకైనా తట్టుకునేలా పర్వతాలను తొలచి నిర్మించిన ఈ బంకర్లలో.. అత్యంత శక్తివంతమైన బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు వరుస క్రమంలో మోహరించి ఉన్నాయి. వాటిని మోసుకెళ్లే హెవీ-డ్యూటీ మిలిటరీ ట్రక్కులు కూడా ఈ వీడియోలో స్పష్టంగా కనిపించాయి. భూగర్భంలోనే క్షిపణులను సురక్షితంగా నిల్వ చేయడమే కాకుండా, క్షణాల వ్యవధిలో వాటిని ఎక్కడినుంచైనా ప్రయోగించేలా ఇరాన్ తన సైనిక వ్యవస్థను అత్యాధునికంగా తీర్చిదిద్దినట్లు తేలింది.
మళ్లీ రాజుకుంటున్న వేడి
ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు ప్రతిష్టంభనకు గురైన తరుణంలో, ఇరాన్ ఈ రకమైన శక్తి ప్రదర్శనకు దిగడం పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకునేలా చేస్తోంది. అమెరికా ఆంక్షలు, నౌకాదళ దిగ్బంధనాలను ఛేదించుకుంటూ ఇరాన్ తన ఆయుధాగారాన్ని ఏ విధంగా నింపుకుంటోందో ఈ అండర్‌గ్రౌండ్ మిస్సైల్ సిటీ నిరూపిస్తోంది.
Two senior Iranian commanders appear in newly released footage touring an underground facility that the Revolutionary Guards describe as a new "missile city." The video was published by Tasnim, a news agency affiliated with the IRGC. https://t.co/v0pHX6f3lN
— Open Source Intel (@Osint613) November 10, 2026


