కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాలో భారత సంతతికి చెందిన అభిషేక్ అవస్థి అరుదైన ఘనత సాధించారు. విక్టోరియా రాష్ట్రంలోని గ్రేటర్ బెండిగో నగర మేయర్‌గా ఎన్నికయ్యారు. ఆస్ట్రేలియాలో ఈ పదవిని చేపట్టిన తొలి భారత సంతతి వలసదారుగా చరిత్ర సృష్టించారు. నవంబర్ 9న జరిగిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో 2026-27 సంవత్సరానికి ఆయనను కౌన్సిల్ సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 43 ఏళ్ల అభిషేక్ గతంలో ఈ నగరానికి డిప్యూటీ మేయర్‌గా పనిచేశారు.
ఏడాది పాటు మేయర్‌గా బాధ్యతలు
సోమవారం క్యాపిటల్ థియేటర్‌లో జరిగిన కార్యక్రమంలో అభిషేక్ మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఆండ్రియా మెట్కాల్ఫ్ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అభిషేక్ తనపై నమ్మకం ఉంచిన కౌన్సిల్ సభ్యులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రేటర్ బెండిగోను తమ నివాసంగా మార్చుకున్న వలసదారులందరికీ తన విజయాన్ని అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. తన ఎదుగుదలలో సహకరించిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.
ఫేస్‌బుక్‌లో భావోద్వేగ పోస్టు
మేయర్‌గా ఎన్నికైన అనంతరం అభిషేక్ ఫేస్‌బుక్‌లో తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ గౌరవం దక్కడం ఎంతో సంతోషంగా, గర్వంగా ఉందని పేర్కొన్నారు. తనపై విశ్వాసం ఉంచిన కౌన్సిల్ సభ్యులకు, సేవ చేసే అవకాశం కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. నగర అభివృద్ధి కోసం అందరితో కలిసి పనిచేస్తానని, ఈ ప్రాంత ప్రయోజనాల కోసం బలంగా గొంతు వినిపిస్తానని, గ్రేటర్ బెండిగోకు ఉజ్వల భవిష్యత్తు నిర్మించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు.
హిమాచల్ ప్రదేశ్ నుంచి ఆస్ట్రేలియాకు..
అభిషేక్ అవస్థి స్వస్థలం హిమాచల్ ప్రదేశ్‌లోని మండి. 2008లో అంతర్జాతీయ విద్యార్థిగా ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లారు. లా ట్రోబ్ యూనివర్సిటీలో బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్‌లో పోస్టుగ్రాడ్యుయేట్ విద్యను అభ్యసించారు. ఉత్తరప్రదేశ్ టెక్నికల్ యూనివర్సిటీ నుంచి బీటెక్ పట్టా కూడా పొందారు. 2010లో బెండిగోలో స్థిరపడ్డారు. అక్కడ నిర్వహించే స్వచ్ఛంద కార్యక్రమాలు, బహుళ సంస్కృతుల ప్రోత్సాహక కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు.
భారతీయ కుటుంబాలను ఏకం చేస్తూ..
2021లో అభిషేక్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ బెండిగోను స్థాపించారు. సెంట్రల్ విక్టోరియాలోని భారతీయ కుటుంబాలను ఒక వేదికపైకి తీసుకురావడం, భారతీయ సంస్కృతిని ప్రోత్సహించడం, సేవా కార్యక్రమాలు, సామాజిక వేడుకలు నిర్వహించడం దీని ప్రధాన లక్ష్యాలు. 2015లో ఆస్ట్రేలియా పౌరసత్వం పొందిన ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
రాజకీయ ప్రస్థానంలోనూ వరుస విజయాలు
2024 నవంబర్‌లో కెనింగ్టన్ వార్డు కౌన్సిల్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. అనంతరం 2024-25 సంవత్సరానికి గ్రేటర్ బెండిగో తొలి భారత సంతతి డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి మేయర్ ఆండ్రియా మెట్కాల్ఫ్‌తో కలిసి పనిచేశారు. తాజాగా మేయర్‌గా ఎన్నికై మరో అరుదైన మైలురాయిని అందుకున్నారు.
ఇదీ చదవండి: ట్రంప్‌కు బిగ్ షాక్.. చేతులు మారిన రిపబ్లికన్ పగ్గాలు!


