అబుదాబి: ఉక్రెయిన్‌పై రష్యా ఐదేళ్లుగా సాగిస్తున్న దురాక్రమణకు ముగింపు పలికేందుకు అమెరికా మరోసారి ప్రయత్నం చేస్తోంది. ఆ దేశ మధ్యవర్తిత్వంతో మంగళవారం దుబాయ్‌లో రష్యా, ఉక్రెయిన్‌ల ప్రతినిధి బృందాలు చర్చలు మొదలుపెట్టాయి. ఫిబ్రవరి తర్వాత మొదటి సారిగా మొదలైన ఈ చర్చలు రెండు రోజులపాటు జరుగుతాయి. మంగళవారం అమెరికా ప్రతినిధుల సమక్షంలో రష్యా, ఉక్రెయిన్‌ల దూతలు దాదాపు 4 గంటలపాటు చర్చలు జరిపారు.
బుధవారం కూడా చర్చలు కొనసాగుతాయని ఉక్రెయిన్ వర్గాలు వెల్లడించాయి. కాల్పుల విరమణ చర్చల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్, ఆ దేశ దూత స్టీవ్ విట్కాఫ్ కూడా ఉన్నారు. రెండు దేశాల మధ్య విభేదాలను పరిష్కరించుకునేందుకు గల అనేక మంచి అవకాశాలున్నాయని తాను భావిస్తున్నట్లు విట్కాఫ్ తెలిపారు. ఉక్రెయిన్ ప్రతినిధి వర్గానికి ఆ దేశ ఫారిన్ ఇంటెలిజెన్స్ చీఫ్ రుస్తెమ్ ఉమెరోవ్, రష్యా బృందానికి అధ్యక్షుడు పుతిన్ సహాయకుడిగా ఉన్న మెడిన్‌స్కీ సారథ్యం వహిస్తున్నారు.


