జెరూసలేమ్: ఇజ్రాయెల్ రాజకీయాల్లో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. దేశంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితులు, గాజా యుద్ధం నేపథ్యంలో అందరూ ఏకం కావాలని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పిలుపునిచ్చారు. అయితే, ఆయన చేసిన ఈ ఐక్యత పిలుపును ప్రధాన ప్రతిపక్షం తీవ్రంగా తప్పుబట్టింది. మాజీ ఆర్మీ చీఫ్, ప్రతిపక్ష నేత గాడి ఐసెన్‌కోట్ ప్రధాని నెతన్యాహుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నెతన్యాహు చేసిన ఐక్యతా ప్రకటనను ఆయన సిగ్గుచేటు అని అభివర్ణించారు.
గత కొంతకాలంగా గాజా యుద్ధం, బందీల విడుదల అంశాలు, అంతర్గత భద్రతలో నెతన్యాహు ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు దేశం కష్టకాలంలో ఉందని అందరూ ఏకం కావాలని కోరడాన్ని.. తన ప్రభుత్వ వైఫల్యాలను, తప్పులను కప్పి పుచ్చుకోవడానికి నెతన్యాహు ఆడుతున్న రాజకీయ డ్రామాగా ఐసెన్‌కోట్ కొట్టిపారేశారు. ఇది నిజమైన దేశ ప్రయోజనాల కోసం పిలుస్తున్న ఐక్యత కాదని, కేవలం ప్రభుత్వాన్ని కాపాడుకునే రాజకీయ కూటమి కోసమేనని ఆయన మండిపడ్డారు.
మరోవైపు, ఈ రాజకీయ ప్రతిష్టంభన వేళ.. నెతన్యాహు వ్యతిరేక ప్రతిపక్ష పార్టీలు మాత్రం పార్లమెంటు (కెస్సెట్)లోని అత్యంత కీలకమైన పదవులను పంచుకోవడానికి ఒక అంగీకారానికి వచ్చాయి.
ప్రభుత్వ విధానాలను పార్లమెంటరీ వేదికగా మరింత గట్టిగా ఎదుర్కోవడానికి ఈ కూటమి సిద్ధమవుతోంది. యుద్ధ వాతావరణం, అంతర్గత రాజకీయ సంక్షోభం మధ్య ఇజ్రాయెల్‌లో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు ఆ దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.


