ఆమ్‌స్టర్‌డామ్‌ వీధుల్లో ఇజ్రాయెల్‌ వ్యతిరేక నిరసనలు | Amsterdam streets in Red Line protest demand action against Israel | Sakshi
Sakshi News home page

ఆమ్‌స్టర్‌డామ్‌ వీధుల్లో ఇజ్రాయెల్‌ వ్యతిరేక నిరసనలు

Nov 9 2026 7:35 AM | Updated on Nov 9 2026 7:39 AM

Amsterdam streets in Red Line protest demand action against Israel

ఆమ్‌స్టర్‌డామ్‌: నెదర్లాండ్స్ రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌లో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శన జరిగింది. గాజాపై ఇజ్రాయెల్ దాడులను నిలిపివేయాలని, ఆ దేశంపై కఠిన ఆంక్షలు విధించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం 2 లక్షల మందికి పైగా ప్రజలు వీధుల్లోకి వచ్చారు. డచ్ విభాగానికి చెందిన అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ నిరసనలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఎరుపు దుస్తులు ధరించి ‘రెడ్ లైన్’ పేరుతో నిర్వహించిన ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఇజ్రాయెల్‌తో వాణిజ్య సంబంధాలపై కఠిన ఆంక్షలు విధించాలని, ఆ దేశానికి ఆయుధాల విక్రయాలను పూర్తిగా నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

నిరసనలో పాల్గొన్న మైక్ వాన్ డోంగెన్ మాట్లాడుతూ.. గాజాలో జరుగుతున్న పరిణామాలు అమానవీయమని ఆవేదన వ్యక్తం చేశారు. నెదర్లాండ్స్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకాడుతోందని విమర్శించారు. ఆమ్‌స్టర్‌డామ్‌లో సాధారణ వాహనాల రాకపోకలను నిలిపివేసి నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఓ వ్యక్తి బస్టాప్ సమీపంలో లౌడ్‌స్పీకర్ పట్టుకుని 'ఫ్రీ.. ఫ్రీ పాలస్తీనా' అంటూ నినాదాలు చేయగా.. ప్రదర్శనలో పాల్గొన్నవారు కూడా వాటిని అనుసరించారు.

2023 అక్టోబర్‌లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్ దాడుల్లో 74 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. వీరిలో సుమారు 21 వేల మంది చిన్నారులు ఉన్నట్లు తెలిపాయి. మరోవైపు 2023 అక్టోబర్ 7 దాడుల నుంచి ఇజ్రాయెల్‌లో 2,046 మందికి పైగా మరణించినట్లు ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ, అంతర్జాతీయ ట్రాకింగ్ వర్గాలు వెల్లడించాయి.

గత ఏడాది అక్టోబర్ 10 నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటికీ, ఆ తర్వాత కూడా దాదాపు ప్రతిరోజూ ఇజ్రాయెల్ దాడులు, ప్రాణనష్టం కొనసాగుతున్నది. ఇజ్రాయెల్‌పై కొత్త ఆంక్షలు విధించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో గత ఏడాది నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రి తన పదవికి రాజీనామా చేశారు. గత ఏడాది అక్టోబర్‌లోనూ ఇలాంటి నిరసన జరగ్గా, అంతకుముందు జూన్‌లో హేగ్‌లో రెడ్ లైన్ ఆందోళనలు నిర్వహించారు.

ఇదీ చదవండి: దీపావళి వేళ.. వందేభారత్‌పై రాళ్ల దాడి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement