అమ్రేలీ: గుజరాత్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై మరోసారి రాళ్ల దాడి జరిగింది. దీపావళి నాడు అమ్రేలీ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో రైలులోని కిటికీ అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సబర్మతి-వెరావల్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఖిజాడియా, చిటల్ రైల్వే స్టేషన్ల మధ్య గ్రామీణ ప్రాంతం గుండా ప్రయాణిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. రైలులోని ఈ2 కోచ్‌లో 9, 10 సీట్ల సమీపంలో ఉన్న కిటికీకి అమర్చిన లోపలి, బయటి రెండు పొరల అద్దాలు పగిలిపోయాయి.
సాధారణంగా వందేభారత్ రైళ్లలో అత్యంత పటిష్ఠమైన రెండు పొరల భద్రతా అద్దాలను ఏర్పాటు చేస్తారు. అయినప్పటికీ రైలు వేగంగా వెళ్తున్న సమయంలో రాయి తగలడంతో రెండు అద్దాలు ధ్వంసమయ్యాయని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటన లాఠీ సమీపంలో జరిగినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. ఖిజాడియా రైల్వే స్టేషన్‌కు సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఈ దాడి జరిగినట్లు తెలిపారు. పశ్చిమ రైల్వే భావ్‌నగర్ డివిజన్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ అజయ్ శర్మ కూడా ఘటనను ధ్రువీకరించారు. రైల్వే బృందాలు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తూ దాడి జరిగిన కచ్చితమైన ప్రాంతం, సమయాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నాయి.
నాలుగు నెలల్లో మూడో ఘటన
గుజరాత్‌లో వందేభారత్ రైలుపై నాలుగు నెలల వ్యవధిలో రాళ్ల దాడి జరగడం ఇది మూడోసారి. గతంలో ఆగస్టు, అక్టోబర్ నెలల్లో ముంబై-అహ్మదాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై సూరత్ జిల్లాలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా సబర్మతి-వెరావల్ వందేభారత్ రైలు (26901/26902) అమ్రేలీ మీదుగా ధోలా వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వరుసగా ఇలాంటి దాడులు చోటుచేసుకుంటుండటంతో రైల్వే భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) దర్యాప్తు ప్రారంభించింది. దాడికి పాల్పడినవారు ఎవరు? ఏ కారణంతో రైలుపై రాళ్లు విసిరారు? అనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.
ఇదీ చదవండి: దీపావళి ఎఫెక్ట్: విషవాయువుల కోరల్లో ఢిల్లీ


