తండ్రి ఫోన్‌ పగలగొట్టాడని.. కూతురు కసికసిగా ఏం చేసిందంటే? | Father throws daughters phone on floor she kills | Sakshi
Sakshi News home page

తండ్రి ఫోన్‌ పగలగొట్టాడని.. కూతురు కసికసిగా ఏం చేసిందంటే?

Nov 2 2026 9:10 PM | Updated on Nov 2 2026 9:10 PM

Father throws daughters phone on floor she kills

Representative image

గుజరాత్‌లోని సూరత్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మొబైల్‌ ఫోన్‌ విషయంలో తండ్రితో జరిగిన గొడవ ప్రాణాల మీదకు తెచ్చింది. తండ్రి తన ఫోన్‌ను నేలకేసి కొట్టడంతో ఆగ్రహానికి గురైన 22 ఏళ్ల యువతి.. ప్రెషర్‌ కుక్కర్‌ మూత, కత్తితో దాడి చేసి ఆయనను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ ఘటనకు సంబంధించి కాజల్‌ అలియాస్‌ విక్రమ్‌ను అమ్రోలి పోలీసులు అరెస్టు చేశారు.

ఈ ఘటన అక్టోబర్‌ 31న రాత్రి 10.30 గంటల సమయంలో జరిగింది. రమేశ్‌సిన్హ్‌ రాజ్‌పుత్‌ తన భార్య మంజుబెన్‌, చిన్న కుమార్తెతో కలిసి ఇంట్లో ఉన్నారు. ఈ క్రమంలో ఇంటి విషయానికి సంబంధించి ఆయనకు కాజల్‌తో గొడవ జరిగింది. మొదట చిన్నపాటి వాగ్వాదంగా మొదలైన వివాదం క్రమంగా ముదిరింది. ఇంటి పనుల విషయంలో కాజల్‌ను తండ్రి మందలించారు. అనంతరం ఆమె మొబైల్‌ ఫోన్‌ను లాక్కొని నేలకేసి కొట్టారు.

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కాజల్‌.. ప్రెషర్‌ కుక్కర్‌ మూత తీసుకుని తండ్రి తలపై పలుమార్లు కొట్టింది. అనంతరం వంటగదిలోని కత్తితో ఆయన పొట్టలో పొడిచింది. దీంతో ఆమె తండ్రికి తీవ్ర గాయాలై రక్తస్రావం జరిగింది.

గాయాలైనప్పటికీ రమేశ్‌సిన్హ్‌ ఇంటి బయట ఉన్న అరుగువైపు పరిగెత్తారు. కొంతదూరం వెళ్లాక కుప్పకూలిపోయారు. దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌ సేవలకు సమాచారం అందించారు. వైద్య సిబ్బంది అక్కడికి చేరుకుని రమేశ్‌సిన్హ్‌ను పరీక్షించగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం ఆయన భార్య మంజుబెన్‌.. కుమార్తెపై అమ్రోలి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కాజల్‌ను అరెస్టు చేసి హత్య కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమె న్యాయస్థాన ఆదేశాల మేరకు జ్యుడీషియల్‌ కస్టడీలో ఉంది.

పోలీసులేమన్నారంటే..
అమ్రోలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కోసాడ్‌ ఆవాస్‌ హెచ్‌-5లో అక్టోబర్‌ 31న ఈ ఘటన జరిగినట్లు సూరత్‌ పోలీస్‌ ఏసీపీ పార్థ్‌ చోవాటియా తెలిపారు. ఇంటి పనుల విషయంలో తండ్రి కూతురిని మందలించడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైందని చెప్పారు. ఆగ్రహానికి గురైన కాజల్‌ తొలుత నాన్‌స్టిక్‌ పెనం తీసుకుని తండ్రిపై దాడి చేసిందని, ఆ తర్వాత వంటగది కత్తితో దాడి చేసిందని వివరించారు.

తీవ్ర గాయాలైన తండ్రిని ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారని తెలిపారు. నిందితురాలిని అరెస్టు చేసి ప్రస్తుతం న్యాయస్థాన కస్టడీకి పంపినట్లు వెల్లడించారు. హత్యకు దారితీసిన పరిస్థితులు, ఇంట్లో జరిగిన పరిణామాల క్రమంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నపాటి కుటుంబ వివాదం చివరకు హత్యకు దారితీయడంతో కోసాడ్‌ ఆవాస్‌ ప్రాంత వాసులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement