ఆత్మకూరు అడవుల్లో ఉన్మాదిని పట్టుకునే యత్నం
పోలీసులపై కత్తితో దాడి.. సీఐకి గాయాలు
ఆత్మరక్షణకు ఆరురౌండ్ల కాల్పులు జరిపిన పోలీసులు
కాల్పుల్లో నిందితుడి మోకాళ్లలోకి మూడు బుల్లెట్లు
అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలింపు
అనంతపురం ఎడ్యుకేషన్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అనంతపురం జిల్లా రాప్తాడులో విద్యార్థినులపై ఎలక్ట్రిక్ రంపంతో దాడికి పాల్ప డిన ఘటనలో ఉన్మాది డుంబు అలియాస్ హేమంత్‌పై పోలీసులు ఆదివారం కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గాయపడ్డ నిందితుడిని ఆస్పత్రికి తరలించారు.
ఎస్పీ జగదీష్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడిని పట్టుకునేందుకు 25 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు ఆత్మకూరు సమీపంలోని అడవుల్లో ఉన్నాడనే పక్కా సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ నిందితుడిని గుర్తించి పట్టుకునే ప్రయత్నం చేస్తున్న పోలీసులపై అతడు ఒక్కసారిగా కత్తితో దాడికి యత్నించాడు. దీంతో రాప్తాడు సీఐ వెంకటేశ్వర్లు చేతికి గాయాలయ్యాయి.
తీవ్రంగా గాయపడ్డ నిందితుడు హేమంత్‌ను సర్వజన ఆస్పత్రికి తరలిస్తున్న పోలీసులు.
అయితే ఆత్మరక్షణ కోసం పోలీసులు ఆరు రౌండ్ల కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో నిందితుడి మోకాళ్లలోకి మూడు బుల్లెట్లు దూసుకెళ్లి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని పట్టుకుని అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నాడు.
రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఉదయం పదో తరగతి విద్యార్థిని గోపిక తరగతి గదిలో చదువుకుంటుండగా చెట్లు కోసే ఎలక్ట్రిక్ రంపంతో హేమంత్ విచక్షణారహితంగా దాడి చేసిన విషయం తెలిసిందే. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని లక్ష్మీపైనా దాడికి తెగబడ్డాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన గోపికను మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రికి తరలించగా, మరో విద్యార్థిని లక్ష్మీ అనంతపురం సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

జాతీయ రహదారిపై ఆందోళన..
నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం రాప్తాడులో ప్రజలు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలియజేశారు. దీంతో రాప్తాడు నుంచి జాతీయరహదారిపై సుమారు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. ఇదే సమయంలో నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారనే సమాచారం అందడంతో పలువురు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.
ఇదీ చదవండి: పచ్చమూకల ఉన్మాదకాండ


