ప్చ్‌.. ఏ మాత్రం మారలేదు..! | Low Voter Turnout In Visakhapatnam | Sakshi
Sakshi News home page

ప్చ్‌.. ఏ మాత్రం మారలేదు..!

Nov 2 2026 8:17 AM | Updated on Nov 2 2026 8:59 AM

Low Voter Turnout In Visakhapatnam

ఈసారీ ఎన్నికల్లో అత్తెసరు పోలింగ్‌ 

ప్రాథమికంగా 51.47 శాతం ఓటింగ్‌ నమోదు 

2021లో 59.41 శాతం.. ఈసారి 7.94 శాతం తగ్గుదల 

వరుసగా ఆరోసారి 60 శాతం దాటని పోలింగ్‌ 

ఓటు హక్కు వినియోగంలో మహిళలదే పైచేయి

సాక్షి, విశాఖపట్నం: మహా నగర ఓటరు తీరు మారలేదు. తన వీధి, తన వార్డు, తన నగర అభివృద్ధిని ప్రభావితం చేసే జీవీఎంసీ ఎన్నికల్లోనూ నిర్లిప్తత వీడలేదు.  ఆదివారం జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో ప్రాథమికంగా వెల్లడించిన తాత్కాలిక తుది నివేదిక ప్రకారం 51.47 శాతం పోలింగ్‌ మాత్రమే నమోదైంది. జీవీఎంసీ పరిధిలో మొత్తం 18,37,901 మంది ఓటర్లు ఉండగా, వారిలో 9,45,915 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. 120 వార్డుల్లోని 1,990 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించినప్పటికీ, నగరవాసులు గత ఎన్నికల తీరునే పునరావృతం చేశారు. 2021 ఎన్నికల్లో 59.41 శాతం పోలింగ్‌ నమోదు కాగా, ఈసారి ఏకంగా 7.94 శాతం తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. 

మెట్రో నగరాలతో పోటీ పడుతున్న విశాఖలో ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యం మాత్రం ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. వరుసగా ఆరోసారి కూడా పోలింగ్‌ శాతం 60 దాటకపోవడం నగర ఓటర్ల నిర్లిప్తతకు అద్దం పడుతోంది. 1987లో 56.83 శాతం, 1995లో 49.02 శాతం, 2000లో 49.63 శాతం, 2007లో 52.48 శాతం, 2021లో 59.41 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈసారి గత ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్‌ శాతం మరింత తగ్గడం గమనార్హం. ముఖ్యంగా ఉన్నత వర్గాలు, ఉద్యోగులు, వ్యాపారులు ఓటు వేసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదనే అభిప్రాయం వ్యక్తమైంది. శివారు ప్రాంతాలతో పోలిస్తే నగరం నడిబొడ్డున ఉన్న ప్రాంతాల్లో పోలింగ్‌ తక్కువగా నమోదైంది. సెలవు దినంగా భావించి పలువురు ఇళ్లకే పరిమితం కాగా, ఓటు వేయాలని రాజకీయ పార్టీల ఏజెంట్లు, కార్యకర్తలు అపార్ట్‌మెంట్లు, ఇళ్లకు వెళ్లి విజ్ఞప్తి చేసినా ఆశించిన స్పందన కనిపించలేదు.

మహిళా ఓటర్లే అత్యధికం 
ఓటు హక్కు వినియోగంలో పురుషుల కంటే మహిళలే ముందున్నారు. ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద మహిళలు బారులు తీరి ఓటు వేశారు. ప్రతి రెండు గంటలకు నమోదైన పోలింగ్‌ సరళిలోనూ మహిళల భాగస్వామ్యం అధికంగా కనిపించింది. జీవీఎంసీ పరిధిలో 9,06,866 మంది పురుష ఓటర్లు, 9,30,916 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. తాత్కాలిక తుది పోలింగ్‌ నివేదిక ప్రకారం 4,55,395 మంది పురుషులు ఓటు వేయగా, 4,90,519 మంది మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement