సాక్షి, విశాఖపట్నం: విశాఖలో టీడీపీ కుట్రకు తెరలేపింది. ఎన్నికల స్ట్రాంగ్ రూమ్‌లో పవర్ కట్ చేసేశారు. బ్యాలెట్ బాక్స్‌లు ఉన్న ఏయూకి కరెంట్ తీసేసిన అధికారులు.. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేశారు. స్ట్రాంగ్ రూమ్‌కి సీల్ వేయకుండానే వెళ్లిపోవాలని ఆదేశించారు. అధికారులు.. టీడీపీ నేతలతో కుమ్మక్కు కావడంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ధర్నాకు సిద్ధమవుతున్నారు.
బ్యాలెట్‌ల స్ట్రాంగ్ రూమ్‌లను వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి పరిశీలించారు. ‘‘బ్యాలెట్ బాక్స్‌లు రాత్రి 9 గంటలకు స్ట్రాంగ్ రూమ్‌లకు చేరుకున్నాయి. వాటికి తెల్లవారుజామున 2 గంటల వరకు ఎందుకు సీల్ వేయలేదంటూ ఆమె ప్రశ్నించారు. స్ట్రాంగ్ రూమ్‌లకు సీల్ వేయకపోవడంపై అనేక అనుమానాలు ఉన్నాయి. ప్రభుత్వ పెద్దలు ఒత్తిడితోనే స్ట్రాంగ్ రూములకు సీల్ వేయలేదు. అధికారులు తీరుపై అనేక అనుమానాలు ఉన్నాయి’’ అని వరుదు కల్యాణి పేర్కొన్నారు.
‘‘మా ఏజెంట్లను ఎందుకు స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర నుంచి వెళ్లిపోమన్నారు. స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాల్లో ఎందుకు కరెంటు తీసేశారు. వైఎస్సార్సీపి విజయం సాధిస్తుందని భయం కూటమి నేతల్లో కనిపిస్తోంది. స్ట్రాంగ్ రూమ్‌లకు సీల్ వేయకపోవడానికి అనేక సిల్లీ కారణాలు చెబుతున్నారు’’ అంటూ వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: యథేచ్ఛగా రిగ్గింగ్


