అనాథలా ఏపీపీఎస్సీ... చైర్మన్‌ కావలెను! | APPSC without a chairman for 21 months | Sakshi
Sakshi News home page

అనాథలా ఏపీపీఎస్సీ... చైర్మన్‌ కావలెను!

Nov 2 2026 5:13 AM | Updated on Nov 2 2026 5:13 AM

APPSC without a chairman for 21 months

నిరుద్యోగుల జీవితాలతో బాబు సర్కార్‌ చెలగాటం  

ఏడాదిగా చైర్మన్‌ను నియమించకుండా యువతకు దగా  

రాజ్యాంగబద్ధ పదవి ఏళ్ల తరబడి ఖాళీగా ఉండటం ఇదే తొలిసారి  

పూర్తి స్థాయి కార్యదర్శి కరువు  

21 నెలలుగా ఇన్‌చార్జితోనే నెట్టుకొస్తున్న వైనం 

ఇటు ఉద్యోగాలు లేవు.. అటు భృతి ఎగవేత

సాక్షి, అమరావతి: యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదంటే నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామన్న సూపర్‌ సిక్స్‌ హామీని ఎగ్గొట్టిన చంద్రబాబు  సర్కార్‌.. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో అత్యంత కీలకమైన ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ)ను నీరుగార్చి నిర్వీర్యం చేసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీపీఎస్సీ చైర్మన్‌ను తొలగించింది. ఏడాదిగా పూర్తిస్థాయి చైర్మన్‌ను సైతం నియమించలేదు. కార్యదర్శిని కూడా నియమించకుండా ఇన్‌చార్జీతోనే కాలం గడుపుతోంది. 

మొత్తంగా చంద్రబాబు సర్కార్‌ 29 నెలల పాలనలో ఏకంగా 21 నెలల పాటు ఏపీపీఎస్సీకి అసలు చైర్మనే లేకుండా చేసింది. రాజ్యాంగ బద్ధమైన పదవి ఇంతకాలం ఖాళీగా ఉండటం ఇదే తొలిసారి అని కమిషన్‌ వర్గాలు చెబుతున్నాయి. కీలకమైన విధులు పర్యవేక్షించాల్సిన కార్యదర్శి మొక్కుబడిగా ఎఫ్‌ఏసీతో నడిపించడం విస్మయం కలిగిస్తోంది.  

సర్వీస్‌ కమిషన్‌ పూర్తిగా నిర్లక్ష్యం  
కేంద్రంలో యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) తరహాలోనే రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో కీలక ఉద్యోగాల భర్తీని ఏపీపీఎస్సీ ద్వారా చేపడతారు. రాజ్యాంగబద్ధమైన హోదా కలిగిన కమిషన్‌కు చైర్మన్, బోర్డు సభ్యులతో పాటు కార్యదర్శి కీలకం. నిరుద్యోగ అభ్యర్థులకు నష్టం జరకుండా అవసరమైన చట్ట సవరణలు, పరీక్షల తీరును చైర్మన్‌ నేతృత్వంలోని సభ్యులు పర్యవేక్షిస్తారు. నోటిఫికేషన్లు జారీ, పరీక్షల నిర్వహణ, సర్టిఫికెట్ల పరిశీలన తదితర బాధ్యతలను కార్యదర్శి నిర్వర్తిస్తారు. డిపార్ట్‌మెంటల్‌ టెస్టుల నిర్వహణ కూడా కమిషన్‌ పరిధిలోనే ఉంటుంది. ఏ నోటిఫికేషన్‌ ఇచ్చినా.. పరీక్షలు నిర్వహించినా కార్యదర్శి సంతకం లేకుండా ఒక్క ఫైలు కూడా కదిలే పరిస్థితి లేదు. అలాంటి కీలకమైన ఏపీపీఎస్సీని చంద్రబాబు సర్కార్‌ నిర్వీర్యం చేసింది. అటు చైర్మన్‌ ఇటు కార్యదర్శి లేకపోవడంతో కమిషన్‌ పూర్తిగా గాడి తప్పింది.  

21 నెలలుగా చైర్మన్‌ పోస్టు ఖాళీ.. 
చంద్రబాబు ప్రభుత్వం 2024 జూన్‌లో అధికారంలోకి రాగానే ఏపీపీఎస్సీపై కక్ష సాధింపు చర్యలకు దిగింది. కమిషన్‌ చైర్మన్‌గా ఉన్న గౌతమ్‌ సవాంగ్‌ పదవీ కాలం మరో ఏడాది ఉన్నప్పటికీ రాజకీయ కుట్రలతో అదే ఏడాది జూలైలో బలవంతంగా రాజీనామా చేయించింది. దీంతో గతంలో ఇచ్చిన గ్రూప్‌ 2, గ్రూప్‌ 1 మెయిన్స్‌తో పాటు 19 నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షల నిర్వహణకు బ్రేక్‌ పడింది. 

నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకడంతో నాలుగు నెలల అనంతరం మరో ఐపీఎస్‌ అధికారి అనురాధను 2024 అక్టోబర్‌లో చైర్మన్‌గా నియమించారు. ఆమె పదవీ కాలం పూర్తవడంతో 2025 అక్టోబర్‌ 9న బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అనంతరం సర్వీస్‌ కమిషన్‌లో అత్యంత జూనియర్‌ సభ్యుడిగా ఉన్న ప్రాఫెసర్‌ సి.శశిధర్‌కు చంద్రబాబు ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆయన ఏడాదికిపైగా ఎఫ్‌ఏసీ చైర్మన్‌గా కొనసాగుతుండగా, పూర్తిస్థాయి చైర్మన్‌ నియామకంపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదు.  

కార్యదర్శి పోస్టు పరిస్థితీ అదే.. 
మరోపక్క కీలకమైన ఏపీపీఎస్సీ కార్యదర్శి పోస్టు పరిస్థితి కూడా అదే. 2025 అక్టోబర్‌ 10న ఐఏఎస్‌ అధికారి రవిసుభాష్‌ పట్టన్‌శెట్టిని కార్యదర్శిగా చంద్రబాబు  ప్రభుత్వం నియమించింది. అయిష్టంగానే బాధ్యతలు తీసుకున్న ఆయన కమిషన్‌తో అంటీముట్టనట్టుగానే వ్యవహరించారు. ఈ ఏడాది మార్చిలో వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించిన ఆయన అధిక సమయం అదే శాఖకు కేటాయించారు. ఆగస్టులో ఆయన ఏపీ టీడీసీ ఎండీగా బదిలీ అయ్యారు. అయితే ఏపీపీఎస్సీకి కార్యదర్శిని నియమించకుండా రవి సుభాష్‌కే అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన టూరిజంకే అధిక ప్రాధాన్యం ఇస్తుండడంతో ఏపీపీఎస్సీలో పాలన గాడి తప్పింది.  

తీవ్రంగా నష్టపోతున్న నిరుద్యోగులు  
ఏపీపీఎస్సీ ద్వారా వెలువడే అన్ని నోటిఫికేషన్లు, పరీక్షల నిర్వహణకు చైర్మన్‌ అనుమతి తప్పనిసరి. చైర్మన్‌ ఇచ్చే ఆదేశాల మేరకు పరీక్షల నిర్వహణకు కార్యదర్శి చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం ఏపీపీఎస్సీ 40 వరకు నోటిఫికేషన్లు ప్రకటించినా గ్రూప్‌ 1కి మినహా దేనికీ పరీక్షల షెడ్యూల్‌ ప్రకటించలేదు. ఇన్‌చార్జి చైర్మన్‌ అనుభవ రాహిత్యం, కార్యదర్శి లేకపోవడం నిరుద్యోగులకు శాపంలా మారింది. 

సర్వీస్‌ కమిషన్‌ ఇచ్చే నోటిఫికేషన్లపై తలెత్తే అనుమానాలు నివృత్తి చేసేవారుగాని, సమస్యలు పరిష్కరించే దిక్కుగానీ లేకుండా పోయింది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తే పలు సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా ఈడబ్లు్యఎస్, స్థానికత, మైగ్రేషన్, లోకల్‌ స్టేటస్‌ తదితర అంశాలపై అభ్యర్థుల సందేహాలను తీర్చే నాథుడు లేరు. అభ్యర్థులకు వివరణ ఇచ్చేందుకు కనీసం రిడ్రెస్సెల్‌ సెల్‌ కూడా ఏర్పాటు చేయలేదంటే ఏపీపీఎస్సీ దుస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement