పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి మున్సిపల్‌ టీచర్లు | Municipal teachers brought under the purview of the School Education Department | Sakshi
Sakshi News home page

పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి మున్సిపల్‌ టీచర్లు

Nov 2 2026 4:55 AM | Updated on Nov 2 2026 4:55 AM

Municipal teachers brought under the purview of the School Education Department

ఉపాధ్యాయుల సర్వీస్‌ నిబంధనల్లో కీలక మార్పులు

నియామకాలు, పదోన్నతులు కూడా.. 

ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

సాక్షి, అమరావతి: విశాఖ మహానగర పాలకసంస్థ, విజయవాడ కార్పొరేషన్‌ సహా రాష్ట్రంలోని అన్ని మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయుల సర్వీస్‌ నిబంధనల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేష్‌కుమార్‌ ఉత్తర్వులు (జీవో నంబర్లు 269, 270, 271) జారీచేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులు–2025, లోకల్‌ క్యాడర్ల పునర్‌వ్యవస్థీకరణ, మున్సిపల్‌ పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలను పాఠశాల విద్యాశాఖకు అప్పగించిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు విడుదల చేశారు. మున్సిపల్‌ ఉపాధ్యాయుల సర్వీసు నిబంధనలు, పాలన, నియంత్రణ పూర్తిగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌/డైరెక్టర్‌ పరిధిలోకి తెచ్చారు. 

జిల్లా, జోనల్‌ స్థాయిల్లో పోస్టులను పునర్‌వ్యవస్థీకరించి, ప్రత్యక్ష నియామకాల్లో స్థానిక అభ్యర్థులకు 95 శాతం రిజర్వేషన్‌ వర్తింపజేయనున్నారు. ఇప్పటివరకు కార్పొరేషన్లు, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ పరిధిలో ఉన్న మున్సిపల్‌ ఉపాధ్యాయుల నియామక, క్రమశిక్షణ అధికారాలను విద్యాశాఖ అధికారులకు (డీఈవో, ఆర్జేడీలకు) బదిలీ చేశారు. గెజిటెడ్‌ హెడ్‌మాస్టర్‌ (గ్రేడ్‌–2) నియామక అధికారిగా సంబంధిత రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ఉంటారు. 

స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్జీటీలు, భాషా పండితులు, ప్రత్యేక ఉపాధ్యాయుల నియామక అధికారిగా డీఈవో వ్యవహరిస్తారు. గెజిటెడ్‌ హెచ్‌ఎం పోస్టుల పదోన్నతికి ఆర్జేడీ చైర్మన్‌గా, కార్పొరేషన్‌ కమిషనర్‌ ప్రతినిధి/ఆర్‌డీఎంఏ సభ్యుడిగా, డీఈవో సభ్య కార్యదర్శిగా ఉండే కమిటీ ద్వారా ప్యానల్‌ ఎంపిక చేస్తుంది. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల పదోన్నతికి డీఈవో చైర్మన్‌గా, కార్పొరేషన్‌/మున్సిపల్‌ ప్రతినిధి సభ్యుడిగా, డిప్యూటీ ఈవో సభ్య కార్యదర్శిగా ఉండే కమిటీ ద్వారా ఎంపిక చేస్తారు. 

ప్రభుత్వ, జెడ్పీ టీచర్లతో సమానంగా అర్హతలు
మున్సిపల్‌ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీ స్కూల్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ నిబంధనల ప్రకారం జిల్లా పరిషత్, మండల పరిషత్, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు నిర్దేశించిన అర్హతలే వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉపాధ్యాయులపై చర్యలు, సస్పెన్షన్‌ తదితర క్రమశిక్షణ చర్యలు ఏపీ సివిల్‌ సర్వీసెస్‌ రూల్స్‌–1991 ప్రకారం నియామక అధికారే చేపడతారు. డీఈవో ఉత్తర్వులపై ఆర్జేడీకి, ఆర్జేడీ ఉత్తర్వులపై స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌/డైరెక్టర్‌కు అప్పీల్‌ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ సవరణల్లోని నియామక/కేటగిరీలకు సంబంధించిన అంశాలు అక్టోబర్‌ 2026 నుంచి, మిగిలిన నిబంధనలు 9 ఫిబ్రవరి 2024 నుంచి అమలులోకి వచ్చినట్లుగా పరిగణిస్తారని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement