ఎన్నికల ప్రక్రియ అంతా కలెక్టర్లు, ఎస్పీల ద్వారానే నడిపించాలి
వారు నివేదికలిస్తేనే ఏ చర్యైనా తీసుకోగలను
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగింది
అనంతపురం, పల్నాడు జిల్లాల నుంచే ఫిర్యాదులొచ్చాయి
పులివెందులపై ఉదయం ఫిర్యాదు రాగానే కలెక్టర్, ఎస్పీతో మాట్లాడా
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ
సాక్షి, అమరావతి: ‘స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ అంతా కలెక్టర్లు, ఎస్పీల ద్వారానే నడిపించాలి. ఎలాంటి ఫిర్యాదులొచ్చినా, వాటిపై సంబంధిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఇచ్చే నివేదికల ఆధారంగానే ఏ చర్య అయినా తీసుకోగలను. ఈ వ్యవస్థలో నా పరిధి ఇంతే’ అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) అనిల్ చంద్ర పునేఠ వ్యాఖ్యానించారు. ఆదివారం జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సరళిని వివరించేందుకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అధికార టీడీపీ నాయకులు, వారి గూండాలు పలుచోట్ల పోలీసు అధికారుల సహకారంతో వైఎస్సార్‌సీపీ నేతలను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం మొదలు.. పోలింగ్ సమయంలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బూత్‌ల నుంచి బయటకు నెట్టేయడంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్వయంగా ఆర్వో ఆఫీసు ఎదుట ధర్నా చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలపై ఎస్‌ఈసీ పునేఠను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ‘ఈ ఎన్నికల్లో పోలీసులు, అధికారులు పక్షపాతంతో ఉన్నారని రాజకీయ పార్టీలు మీకు ఫిర్యాదు చేస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్వతంత్ర సంస్థ. అందుకే ఫిర్యాదులు ఇస్తున్నామంటున్నారు.
అయితే, మీరు కలెక్టర్లు, ఎస్పీల నివేదికలను ఫాలో అవుతామంటున్నారు. మరి బాధితులకు న్యాయం ఎలా’ అని విలేకరులు అడగ్గా.. ఏ మనిషి రిపోర్టుపై ఆధారపడాలో మీరే చెప్పండి అని ఎస్‌ఈసీ ఎదురు ప్రశ్నించారు. ‘ఈ వ్యవస్థలో ఎస్‌ఈసీగా నేను కలెక్టర్లు, ఎస్పీల ద్వారానే ఎన్నికలు నిర్వహించాలి. ఎక్కడైనా వేరే జిల్లా అధికారిని నియమించినా అతను కూడా పక్షపాతంతో ఉన్నారని అంటారు. మొత్తం వ్యవస్థ ఇలా ఉంది. లేకపోతే, ఏమైనా అవకాశం ఉంటే చెప్పండి. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరిపే కేంద్ర ఎన్నికల సంఘం బయట రాష్ట్రాల పరిశీలకులను తీసుకొస్తారు. ఆ వ్యవస్థ ఇక్కడ లేదు. మేం ఉన్న వ్యవస్థలోనే పనిచేయాలి’ అని పునేఠ వ్యాఖ్యానించారు.
అనంత, పల్నాడు జిల్లాల ఎస్పీలే కొన్ని ఫిర్యాదులున్నాయన్నారు..
మున్సిపల్ పోలింగ్ ముగియడానికి 45 నిమిషాల ముందు పలు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో మాట్లాడినట్టు పునేఠ తెలిపారు. మొదటి నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు జరిగిన, ఎక్కువగా ఫిర్యాదులొచ్చిన నంద్యాల, కడప, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాల ఎస్పీలతో మాట్లాడి, ఏమైనా హింసాత్మక ఘటనలు, ఫిర్యాదులు ఉన్నాయేమోనని ఆరా తీశానన్నారు. ఎక్కడైనా రీ పోలింగ్ కావాలా అని అడిగినట్టు వివరించారు. కేవలం పల్నాడు, అనంతపురం రెండు జిల్లాల్లోనే కొన్ని ఫిర్యాదులున్నట్టు వారు తెలిపారన్నారు.
పోలింగ్ ముగిసిన తర్వాత అక్కడి పోలింగ్ అధికారులు అందజేసే పీవో రిపోర్టును పరిశీలించిన తర్వాత తగిన ఆధారాలు, కారణాలు ఉంటే రీపోలింగ్ అడుగుతామని ఆ రెండు జిల్లాల అధికారులు చెప్పారన్నారు. వారు రీపోలింగ్ కావాలని నివేదికలిస్తే ఆదివారం రాత్రి లోగానే ఆదేశాలిస్తామని చెప్పారు. విజయవాడ 55వ వార్డులో పొలింగ్ రెండున్నర గంటల ఆలస్యంగా మొదలైందని కలెక్టరు నివేదిక ఇవ్వడంతో అక్కడ పోలింగ్ సమయాన్ని పొడిగించినట్లు తెలిపారు. మొత్తంగా అన్ని జిల్లాల్లో పోలింగ్ ప్రశాంతంగానే జరిగిందని చెప్పారు.
పులివెందులపై సమాచారం రాగానే కలెక్టర్‌తో మాట్లాడా..
పులివెందులలో 70 చోట్ల వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బూత్‌లలోకి రానీయలేదని తనకు ఉదయం సమాచారం వచ్చిందని, ఆ వెంటనే జిల్లా కలెక్టర్‌ను సమాచారం అడిగానని విలేకరుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆ జాబితా ఇస్తే దానిపై ఎస్పీలతో మాట్లాడతానని కలెక్టరు చెప్పారన్నారు. పులివెందుల విషయంలో తాను జోక్యం చేసుకొని వెంటనే కలెక్టర్, ఎస్పీతో మాట్లాడానన్నారు. ఐజీతోనూ మాట్లాడినట్టు చెప్పారు.
మీ జోక్యం తర్వాత సమస్య పరిష్కారమైందా అని అడగ్గా.. ‘తర్వాత అక్కడ ఏమి జరిగిందో మీకూ తెలుసు. ఏమైనా ఆధారం ఉంటే రిపోర్టు పంపమని అధికారులను అడిగా. నివేదిక మేరకు చర్యలు తీసుకుంటా’ అని బదులిచ్చారు. ఎస్పీ నివేదిక ఇస్తే వెంటనే రీ పోలింగ్‌కు ఆదేశాలిస్తానన్నారు. జమ్మలమడుగులో ఉదయం 9–11 గంటల మధ్య భారీ పోలింగ్‌పై కడప కలెక్టరుతో మాట్లాడినట్టు చెప్పారు. అనంతపురం నుంచి కూడా ఇలాంటి ఫిర్యాదు ఉందని కలెక్టరు చెప్పారన్నారు. ఆధారాలు ఉంటే పంపుతామన్నారని, అవి వచ్చాక చర్యలు తీసుకుంటానని చెప్పారు.


