ఇవి అసలు ఎన్నికలేనా! | Former CM YS Jagan lashes out at irregularities in local elections | Sakshi
Sakshi News home page

ఇవి అసలు ఎన్నికలేనా!

Nov 2 2026 4:12 AM | Updated on Nov 2 2026 4:12 AM

Former CM YS Jagan lashes out at irregularities in local elections

పులివెందుల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ పోలింగ్‌ ఏజెంట్లతో కలిసి ధర్నా చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌

పులివెందులలో రీపోలింగ్‌ జరపాలి

మున్సిపల్‌ పోలింగ్‌లో టీడీపీ బరితెగింపు

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మండిపాటు 

తెల్లవారుజాము నుంచే పోలింగ్‌ బూత్‌ల స్వాధీనం 

70 బూత్‌ల నుంచి వైఎస్సార్‌సీపీ ఏజెంట్ల తరిమివేత 

వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, నాయకులపై దాడి 

ఎక్కడికక్కడ యథేచ్ఛగా రిగ్గింగ్‌.. పోలీసుల చోద్యం

ఒక తప్పుడు సంప్రదాయం మొదలైంది.. రేపు అదే కొనసాగుతుంది 

చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాడు 

ప్రభుత్వం, ఎస్‌ఈసీ, పోలీసులు కుమ్మక్కయ్యారు 

ఇప్పుడు నేను ఓటేస్తే అంతా సవ్యంగా ఉందని ఒప్పుకున్నట్లే 

రీ పోలింగ్‌ నిర్వహిస్తే తప్పకుండా వచ్చి ఓటు వేస్తాను 

పులివెందులలో 80 బూత్‌లలో రీ పోలింగ్‌ నిర్వహించాలి 

రిటర్నింగ్‌ అధికారి, ఎస్‌ఈసీ, కలెక్టర్, ఎస్పీలకు లేఖ

సిగ్గుండాలయ్యా నీకు చంద్రబాబునాయుడూ.. ఇదే ఎస్‌ఈసీని కూడా అడుగుతున్నా. టీడీపీకి సహకరిస్తున్న కలెక్టర్లు, ఎస్పీలనూ అడుగుతున్నాను. ఇప్పుడు మీరు సెట్‌ చేస్తున్న ఒక తప్పుడు సంప్రదాయం, రేపు పొద్దున రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది? భావితరానికి మీరు పంపిస్తున్న మెసేజ్‌ ఏమిటి? రేపు రాష్ట్రంలో ఎన్నికలు అనేవి జరగవు.

70 బూత్‌ల్లో నుంచి మా పార్టీ ఏజెంట్లను తరిమేశారు. ఇదే విషయం ఎస్పీకి ఫోన్‌ చేసి అడిగాను. ఆయనకన్నీ తెలుసు. అన్నీ చూస్తూ అలాగే ఊరకుంటారు. కలెక్టర్‌కు కూడా అన్నీ తెలుసు. అయినా ఆయన అలాగే అన్నీ చూస్తూ కూర్చుంటారు. మరి ఇది ఏ రకంగా నిజమైన ఎన్నిక?

మీ పాలన బాగుంటే, నిజంగా మీరు ప్రజలకు మంచి చేశారని అనుకుంటే, ఎందుకు ఇంతగా దిగజారాల్సిన పరిస్థితి? స్థానిక ఎన్నికలు ఎందుకు సాఫీగా నిర్వహించడం లేదు? ఎందుకిన్నిన్ని అక్రమాలు చేస్తున్నారు?

సాక్షి, కడప / పులివెందుల: స్థానిక ఎన్నికల్లో మున్సి­­పల్‌ పోలింగ్‌ సందర్భంగా పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌­రెడ్డి మండిపడ్డారు. పులివెందులలో బరి తెగించిన టీడీపీ తెల్లవారుజాము నుంచే పోలింగ్‌ బూత్‌లు స్వాధీనం చేసుకుందని, పట్టణంలో మొత్తం 80 బూత్‌లు ఉంటే, ఏకంగా 70 బూత్‌ల నుంచి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను తరిమేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందులలో ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి కాబట్టి, ఇక్కడ రీపోలింగ్‌ జరపాలని డిమాండ్‌ చేశారు. ఇంత అప్రజాస్వామికంగా జరిగే ఎన్నికలు.. అసలు ఎన్నికలేనా? అని నిలదీశారు.

వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు లేకుండా పోలింగ్‌ ఎలా నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. పులివెందులలో ఓటు వేయడానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. పులివెందులలో టీడీపీ గూండాలు దగ్గరుండి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను పోలింగ్‌ బూత్‌ల నుంచి లాగి బయటకు పంపేశారని, పోలీసులు దగ్గరుండి వారికి సహకరిస్తున్నారని.. అసలు ఇది ప్రజాస్వామ్యమేనా? మనం ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఉన్నామా? అన్న సందేహం కలుగుతోందన్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

పులివెందులలో ఇదీ అరాచక పర్వం  
పులివెందులలో ఇన్ని జరుగుతున్నా కనీసం అడిగే నాథుడు లేడు. ఎస్పీకి, కలెక్టర్‌కు ఫోన్‌ చేశాం. కానీ ఏ మాత్రం ప్రయోజనం లేదు. పొద్దున నుంచి పులివెందులలో జరిగిన ఘటనల క్రమం చూస్తే.. తెల్లవారుజామున 4 గంటల నుంచే తెలుగుదేశం పార్టీ వాళ్లు బూత్‌లు ఆక్రమించారు. అలా పోలింగ్‌ కేంద్రాలు ఆక్రమించి, ఓటర్లను భయభ్రాంతులను గురి చేస్తున్నారు. మా పార్టీ ఛైర్‌పర్సన్‌ అభ్యర్థి ప్రమీలమ్మపై దాడి చేశారు. పోలింగ్‌ ఏజెంట్‌ సునంద చెయ్యి విరగ్గొట్టారు. ఓటు వేయడానికి వచ్చిన ప్రజలను పోలింగ్‌ కేంద్రాల వద్దే అడ్డుకున్నారు.

మహిళలను బెదిరించారు. ఓటర్‌ స్లిప్‌లను బలవంతంగా లాక్కొని వెనక్కి పంపించారు. అలా పోలింగ్‌ బూతులను ఆక్రమించి దొంగ ఓట్లు వేస్తున్నారు. అసలు ఓటరు వచ్చే సరికే, దొంగ ఓట్లు వేసేస్తున్నారు. మరోవైపు పోలీసులు టీడీపీ కార్యకర్తలకు సహకరిస్తూ, వైఎస్సార్‌సీపీ పోలింగ్‌ ఏజెంట్లను అడ్డుకుంటున్నారు. పలుచోట్ల లాఠీఛార్జ్‌  చేశారు. మా పార్టీ కౌన్సిలర్‌ అభ్యర్థిని బలవంతంగా పోలీసులు జీప్‌లో ఎక్కించుకొనిపోయారు. ఎన్నికల్లో అక్రమాలు చిత్రీకరిస్తున్న ఇండియా టుడే ఛానల్, ఎన్టీవీ ఛానల్‌ రిపోర్టర్లు, కెమెరామెన్ల మీద దాడి చేశారు. వారి కెమెరాలు, సెల్‌ ఫోన్లు ధ్వంసం చేశారు. 

తమను ఓటు వేయనీయడం లేదని చివరకు ఓటర్లు ధర్నాకు దిగుతున్నా పట్టించుకునే నాథుడు లేడు. కనీసం వారిని తీసుకెళ్లి ఓట్లు వేయించే కార్యక్రమం కూడా చేయలేదు. అంత దారుణమైన పరిస్థితి ఉంది. ఇక్కడ నా ఇల్లు, ఓటు ఉంది కాబట్టి, ఈ బూత్‌లో మాత్రమే మా పార్టీ ఏజెంట్లను కూర్చోబెట్టారు. పులివెందులతో పాటు, కడప, జమ్మలమడుగు, చిత్తూరు, మాచర్ల, చిలకలూరిపేట, తాడిపత్రి, మదనపల్లి, చీమకుర్తి, కుప్పంలో కూడా ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

         పులివెందులలో మీడియాతో మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

ఇది తప్పుడు సంప్రదాయం.. మరి రేపు?  
సిగ్గుండాలయ్యా నీకు చంద్రబాబునాయుడూ.. ఇదే ఎస్‌ఈసీని కూడా అడుగుతున్నా. టీడీపీకి సహకరిస్తున్న కలెక్టర్లు, ఎస్పీలనూ అడుగుతున్నాను. ఇప్పుడు మీరు సెట్‌ చేస్తున్న ఒక తప్పుడు సంప్రదాయం, రేపు పొద్దున రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది? భావితరానికి మీరు పంపిస్తున్న మెసేజ్‌ ఏమిటి? రేపు రాష్ట్రంలో ఎన్నికలు అనేవి జరగవు. ఈ మాదిరిగా కక్షలు, కార్పణ్యాలతో ఇలా ఎలక్షన్లు నిర్వహిస్తే రేపు ఇంకొక పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు, మీరు గతంలో ఇదే మాదిరిగా చేస్తే తప్పు లేనప్పుడు, మేము చేస్తే తప్పు ఏముంది అని.. కార్యకర్తలు కూడా తిరగబడతారు. అలా ఇప్పుడు మీరు ఒక తప్పుడు సంప్రదాయం మొదలు పెడుతున్నారు.

చంద్రబాబునాయుడు దాదాపు 80 ఏళ్ల వయసులోకి వచ్చిన తర్వాత కూడా ఇటువంటి దరిద్రమైన పనులు చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న పరిస్థితులు చూస్తే, అసలు ఈ మనిషి ముఖ్యమంత్రిగా కొనసాగడానికి ఒక్క రోజు కూడా అర్హుడు కాదు. రొటేషన్‌ పద్ధతిలో ఓట్లన్నీ వీళ్లంతకు వీళ్లే గుద్దుకుంటా ఉన్నారు. కళ్ల ముందే ఇలా ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోంది. ఇక్కడ బందోబస్తు కోసం 1,000 మంది పోలీసులను తీసుకొచ్చినట్లు చెప్పారు. అసలు ఆ పోలీసులను ఎందుకు తీసుకొచ్చారంటే ఈ అక్రమాలకు సపోర్ట్‌ చేయడం కోసం. 

కళ్లెదుటే అన్నీ.. సుప్రీం ఆదేశాలూ బేఖాతరు 
మన కళ్లెదుటే ఇన్ని వందల మంది ప్రతి బూత్‌ దగ్గర కనిపిస్తున్నారు. పక్కాగా తెలుగుదేశం పార్టీ గూండాలు కనిపిస్తున్నారు. అయినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోరు. 70 బూత్‌ల్లో నుంచి మా పార్టీ ఏజెంట్లను తరిమేశారు. ఇదే విషయం ఎస్పీకి ఫోన్‌ చేసి అడిగాను. ఆయనకన్నీ తెలుసు. అన్నీ చూస్తూ అలాగే ఊరకుంటారు. కలెక్టర్‌కు కూడా అన్నీ తెలుసు. అయినా ఆయన అలాగే అన్నీ చూస్తూ కూర్చుంటారు. మరి ఇది ఏ రకంగా నిజమైన ఎన్నిక? పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు అమర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్ని చోట్ల ఆ ఏర్పాట్లు చేశారు? సీసీ టీవీ లైవ్‌ ఫుటేజ్‌ లేకుండా మీరు ఏ రకంగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు? 

నా ఛాపర్‌ ప్రయాణంపైనా కుట్ర
బెంగళూరు నుంచి పులివెందులకు నేను ఛాపర్‌లో బయలుదేరాను. ఇక్కడికి రావడానికి నిన్న అనుమతి కూడా ఇచ్చారు. కానీ, నా ఛాపర్‌ ప్రయాణం మధ్యలో ఉండగా, పులివెందులలో ఛాపర్‌ ల్యాండింగ్‌కు అనుమతి నిరాకరించారు. పులివెందులలో జగన్‌ ఛాపర్‌ ల్యాండ్‌ కాకూడదని కుట్ర చేశారు.  3 గంటల తర్వాతే నేను ఇక్కడికి రావాలని చెప్పారు. నిన్న ఇచ్చి­న పర్మిషన్‌ రద్దు చేసినట్లు ప్రకటించారు. దీంతో విషయాన్ని నేరుగా పౌర విమానయాన శాఖకు చెప్పాను. దాంతో వారు అధికారుల నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. 

ఛాపర్‌ ల్యాండింగ్‌కు నిన్న పర్మిషన్‌ ఇచ్చి, హఠాత్తుగా ఈరోజు దాన్ని రద్దు చేయడం సరికాదని ఆ శాఖ అధికారులు తప్పు బట్టారు. ఛాపర్‌ మార్గంమధ్యలో ఉన్నప్పుడు ఇలా ల్యాండింగ్‌ పర్మిషన్‌ రద్దు చేయడం సరికాదని వారు తేల్చి చెప్పడంతో, ఎట్టకేలకు ఇక్కడ ఛాపర్‌ ల్యాండింగ్‌కు ఒప్పుకున్నారు. అంటే ఏ స్థాయిలో కుట్ర జరుగుతోందన్న విషయం అర్థం చేసుకోవచ్చు. పెద్దలంతా కలిసి ప్రజాస్వామ్యాన్ని ఇలా ఖూనీ చేస్తుంటే ఎలా? నక్సలిజం అనేది ఎక్కడి నుంచి పుడుతుంది? ప్రజలను కాపాడాల్సిన వాళ్లే, ప్రజలను భక్షించే కార్యక్రమాలు చేసినప్పుడు, ప్రజలను కాపాడాల్సిన వారే, ప్రజలకు అన్యాయం చేసినప్పుడు నక్సలిజం పుడుతుంది, కాక్రోచ్‌లు పుడతాయి. 

రాష్ట్రంలో దయనీయ పరిస్థితి 
ప్రస్తుత పాలకుల వల్ల ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి దయనీయంగా మారింది. పాలన ఎలా ఉందో వారు వారి మనస్సాక్షిని అడగాలి. పాలన బాగుంటే, మరీ ఈ స్థాయికి దిగజారాల్సిన అవసరం ఉందా? సూపర్‌ సిక్స్‌లు లేవు. సూపర్‌ సెవెన్లు లేవు. ప్రజలకు ఇచ్చిన బాండ్లు అన్నీ ఉత్తుత్తే. దీంతో ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తున్నారు. మరోవైపు వ్యవస్థలన్నీ కుప్పకూలాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లేక.. విద్యా దీవెన, వసతి దీవెన రాక పిల్లలు తిరగబడుతున్నారు. ఉద్యోగస్తులకు మేనిఫెస్టోలో చెప్పి­నవి ఏవీ అమలు కాక, వారూ తిరగబడుతున్నారు. మహిళలకు చివరికి సున్నా వడ్డీ కూడా రద్దు చేశారు. దాంతో వారూ తిరగబడుతున్నారు. రైతులకు ఏ ఒక్కరికి గిట్టుబాటు ధర రావడం లేదు. రైతులకు ఇచ్చిన హామీలన్నీ మోసాలుగా తేలడంతో వారూ తిరగబడుతున్నారు. 

అందుకే చంద్రబాబుకు ఎన్నికలంటే భయం 
రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా చంద్రబాబునాయు­డి పాలనతో సంతోషంగా లేదు. అందుకే ఎన్నికలు జరగకూడదన్న కుట్ర. అలా ఎన్నికలను బుల్డో­జ్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీ పాలన బాగుంటే, నిజంగా మీరు ప్రజలకు మంచి చేశారని అనుకుంటే, ఎందుకు ఇంతగా దిగజారాల్సిన పరిస్థితి? స్థా­ని­క ఎన్నికలు ఎందుకు సాఫీగా నిర్వహించడం లే­దు? ఎందుకిన్నిన్ని అక్రమాలు చేస్తున్నారు? ప్రజాస్వామ్యంలో ఉన్న వాళ్లంతా ఒక్కసారి ఆలోచించాలి. 

అది మా హక్కు.. అందుకే అడుగుతాం
ఎన్నికలు సజావుగా జరగనప్పుడు ఆర్‌ఓ దగ్గరికి వెళ్లి అడిగే హక్కు మాకుంది. దాన్ని అడ్డుకునే కార్యక్రమం ఎవరైనా చేస్తే, ఇంతకన్నా ఇంకా దారుణం అనేది ఉండదు. రాష్ట్రంలో దారుణ పరిస్థితిపై ఎన్డీఏ కూడా స్పందించాలి. ఎందుకంటే వారి భాగస్వామ్య పార్టీనే ఇక్కడ ఇన్ని అరాచకాలు చేస్తోంది కాబట్టి. వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, పార్టీ పులివెందుల ఇన్‌ఛార్జి చవ్వా దుష్యంత్‌రెడ్డి, ఛైర్‌పర్సన్‌ అభ్యర్థి వైఎస్‌ ప్రమీలమ్మ, టీడీపీ మూకలు దౌర్జన్యం వల్ల బయటకు వచ్చిన 70 మంది వైఎస్సార్‌సీపీ పోలింగ్‌ ఏజెంట్లు పాల్గొన్నారు.

రీపోలింగ్‌ నిర్వహిస్తేనే వచ్చి ఓటు వేస్తా
పులివెందులలో ఏం జరిగిందో అందరూ చూశారు. ఈ పరిస్థితుల్లో నేను ఓటు వేయను. ఇప్పుడు నేను ఓటు వేస్తే, ఎన్నికల ప్రక్రియ అంతా బాగున్నట్లు ఒప్పుకున్నట్టే. అందుకే నా ఓటు వేయకుండా, ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందన్న విషయాన్ని అందరికీ చెప్పాలనుకుంటున్నా. మేము అడిగినట్లుగా ఇక్కడ 80 బూత్‌లలో రీపోలింగ్‌ పెడితే.. న్యాయం, ధర్మం అనేది ఒకటి బతికి ఉండి.. మనస్సాక్షి అనేది ఒకటి బతికి ఉండి.. వాటికి అనుగుణంగా రీపోలింగ్‌కు ఆదేశిస్తే, అప్పుడు వచ్చి కచ్చితంగా ఓటు వేస్తాను. 

ఎన్నికల ప్రక్రియ, వ్యవస్థ మొత్తం దిగజారిపోయినప్పుడు, అంతా బాగుందని ఒప్పుకోవడం ఏ మాత్రం సరికాదు. ఈ ఎన్ని­కల్లో జరుగుతున్న దారుణాలన్నింటిపై తప్పకుండా కోర్టును ఆశ్రయిస్తాం. న్యాయ పోరాటం కూడా చేస్తాం. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ఈ పరిస్థితి కచ్చితంగా మారాల్సి ఉంది. ఈ రోజు ఇక్కడ నామినేషన్‌ హక్కు, ఓటు హక్కు పోతోంది. ఇప్పుడు మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేకపోతే.. రేపు కూడా ప్రజాస్వామ్య వ్యవస్థ ఇలాగే ఉంటే.. ఆస్తి హక్కులు కూడా ప్రజలకు లేకుండా పోతాయి.

అంతా చంద్రబాబుతోలు బొమ్మలు
రాష్ట్ర ఎన్నికల కమిషన్‌(ఎస్‌ఈసీ) మొదలు, ఆర్‌ఓలు, ఎస్పీ­లు, కలెక్టర్లు అంతా దురదృష్టవశాత్తు చంద్రబాబునాయుడు చేతిలో తోలు బొమ్మలుగా మా­రారు. ఇది వ్యవస్థలో ఒక పెద్ద లోపం. ఎప్పు­డైతే ఎస్‌ఈసీ ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా, ఏ ఒత్తిళ్లు లేకుండా స్వేచ్ఛగా పని చేయ­డం మొదలు పెడుతుందో, అప్పుడు ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా ఉంటుంది. మేము అధికారంలో ఉన్నప్పుడు నిమ్మగడ్డ రమేష్‌ ఎస్‌ఈసీగా ఉన్నాడు. ఆయన్ను అంతకు ముందు చంద్రబాబు నియమించారు. ఆయన ఆధ్వర్యంలో మేము ఎన్నికలకు పోయాం కాబట్టే, అప్పుడు కూడా చంద్రబాబు కోరుకున్నట్లుగా ఎన్నికలు జరిగాయి. 

మాకు నచ్చినా, నచ్చక­పోయినా.. అధికారులందరినీ ఇష్టారాజ్యంగా ఎన్నికల విధు­ల నుంచి తప్పించారు. అది మంచో, చెడో అన్నది పక్కన పెడితే అప్పుడు చంద్రబాబునాయుడు మాత్రం బాగా తృప్తి చెందారు. చంద్రబాబు తన స్వార్థం, ప్రయోజనాల కోసం తన వీరాభిమాని అయిన వ్యక్తిని ఎస్‌ఈసీగా నియమించారు. అక్కడి నుంచే వ్యవస్థ దిగజారిపోయింది. ఇప్పుడు మిగతా వాళ్లంతా కూడా చంద్రబాబు చేతిలో తోలు బొమ్మలు కాబట్టి, ఈ వ్యవస్థ అంతకంతకూ దిగజారి కుప్పకూలుతో­ం­ది.

పులివెందులలో మొత్తం పోలింగ్‌ ప్రక్రియనురద్దు చేయాలి
» సమగ్ర విచారణ చేపట్టాలి.. 80 బూత్‌లలో రీపోలింగ్‌ నిర్వహించాలి   
» బాధిత పోలింగ్‌ ఏజెంట్లు, ప్రిసైడింగ్‌ అధికారుల వాంగ్మూలాలను నమోదు చేయాలి 
» రీపోలింగ్‌ నిర్వహించాలనే సిఫార్సుతో ఎస్‌ఈసీకి తక్షణమే నివేదిక పంపాలి 
» పులివెందుల మున్సిపాలిటీ రిటర్నింగ్‌ అధికారికి లేఖ రాసిన వైఎస్‌ జగన్‌ 
ఎస్‌ఈసీ, జిల్లా కలెక్టర్, ఎస్పీలకు లేఖ ప్రతులు అందజేతపులివెందుల మున్సిపాలిటీ పరిధిలో జరిగిన మొత్తం ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియను రద్దు చేసి, 80 పోలింగ్‌ బూత్‌లలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పులివెందుల మున్సిపాలిటీ రిటర్నింగ్‌ అధికారికి ఆదివారం ఆయన లేఖ అందజేశారు. 80 పోలింగ్‌ బూత్‌లలో కేవలం 10 బూత్‌లలో మాత్రమే వైఎస్సార్‌సీపీ పోలింగ్‌ ఏజెంట్లను అనుమతించారని లేఖలో వెల్లడించారు. మిగిలిన 70 బూత్‌లలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను టీడీపీకి చెందిన వ్యక్తులు బలవంతంగా అడ్డుకున్నారని, వారి ఆథరైజేషన్‌ పత్రాలను చించివేశారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ గూండాలను పులివెందులకు తరలించి ఎన్నికల ప్రక్రియకు ఆటంకాలు సృష్టించారని చెప్పారు.

టీడీపీ దౌర్జన్యాలకు పోలీసులు సహకరించారని, అధికారులు ప్రేక్షకపాత్ర పోషించారని ఆక్షేపించారు. ఎన్నికల అక్రమాలు కేవలం 70 బూత్‌లకే పరిమితం కాలేదని, మొత్తం మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతపైనే తీవ్ర సందేహాలు తలెత్తాయని స్పష్టం చేశారు. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, పారదర్శక ఎన్నికలకు అవసరమైన ప్రాథమిక రక్షణ వ్యవస్థలనే ఉల్లంఘించారని ఆందోళన వ్యక్తం చేశారు. పులివెందుల మున్సిపాలిటీ వ్యాప్తంగా జరిగిన ఘటనలపై తక్షణమే సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల సీసీటీవీ ఫుటేజీ, పోలింగ్‌ రికార్డులు, సంబంధిత సాక్ష్యాధారాలను భద్రపరచాలని విజ్ఞప్తి చేశారు. బాధిత పోలింగ్‌ ఏజెంట్లు, ప్రిసైడింగ్‌ అధికారుల వాంగ్మూలాలను నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. 

మొత్తం 80 బూత్‌లలో రీపోలింగ్‌ నిర్వహించాలనే సిఫార్సుతో రాష్ట్ర ఎన్నికల సంఘానికి తక్షణమే నివేదిక పంపాలని కోరారు. విచారణలో బాధ్యులుగా తేలిన వారందరిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రీ పోలింగ్‌ సమయంలో పోలింగ్‌ ఏజెంట్లకు తగిన భద్రత, రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తన లేఖపై తక్షణమే లిఖిత పూర్వక నిర్ణయం తీసుకుని, సంబంధిత ఎన్నికల అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ లేఖ ప్రతులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్, వైఎస్సార్‌ కడప జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా ఎస్పీలకు పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement