చిత్తూరులోని వళ్లియప్ప నగర్ బూత్‌లోకి చొరబడి రిగ్గింగ్ చేస్తున్న టీడీపీ రౌడీలు.. ఒంగోలులోని ఓ పోలింగ్ కేంద్రంలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌పై టీడీపీ గూండాల దాడి
ఎస్‌ఈసీ సమక్షంలో.. పోలీసుల పహారాలో..
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి టీడీపీ అరాచక పర్వం!
చంద్రబాబు డైరెక్షన్‌లో చెలరేగిపోయిన ఖాకీలు
ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా పచ్చమూకల బరితెగింపు
పులివెందులలో కనీవిని ఎరుగని రీతిలో అరాచకం
ఓటర్లను రానీయకపోవడమే విధి అన్నట్లుగా రెచ్చిపోయిన పోలీసులు
డీజీపీ పర్యవేక్షణలో చెలరేగిన డీఐజీ కోయ ప్రవీణ్ చౌదరి, జిల్లాల ఎస్‌పీలు
కడప, పులివెందుల లక్ష్యంగా పనిచేసిన కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ చౌదరి, ఎస్‌పీ నచికేత విశ్వనాథ్, అడిషనల్ ఎస్‌పీ ప్రకాష్ చౌదరి
సీఎంఓ డైరెక్షన్.. కలెక్టర్లను ఇష్టారాజ్యంగా వాడిన సీఎం సెక్రటరీ ప్రద్యుమ్న
పులివెందులలో తెల్లవారుజాము నుంచే బూత్‌ల ఆక్రమణ
ఏజెంట్లను బూత్‌లలోకి రానీయని టీడీపీ గూండాలు
80బూత్‌లకు గాను 70 బూత్‌లలో ఏజెంట్లను రానీయని పరిస్థితి
ఓటర్లను బూత్‌ల దరిదాపుల్లోకి రానీయకుండా సైక్లింగ్.. రిగ్గింగ్..
వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, ఏజంట్లే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా దౌర్జన్యకాండ
పోలింగ్‌కు ముందే వైఎస్సార్‌సీపీ నేతల అరెస్టులు.. గృహనిర్బంధాలు
దాడులు చేసిన వారిని వదిలేసి బాధితులపైనే పోలీసుల లాఠీలు, కేసులు
పులివెందులలో మహిళా అభ్యర్థి ప్రమీలమ్మపై దాడి.. వాహనం ధ్వంసం
పులివెందులతో పాటు, కడప, జమ్మలమడుగు, చిత్తూరు, చిలకలూరిపేట, మాచర్ల, తాడిపత్రి, మదనపల్లి, చీమకుర్తి, కుప్పంలోనూ ఇవే దారుణాలు
వినుకొండలో అభ్యర్థి దంపతులపై దాడి.. మాచర్లలో సీసీ కెమెరాల ధ్వంసం
గుంటూరులో బ్యాలెట్ బాక్సుల ధ్వంసం.. అభ్యర్థులు, నేతలపై దాడులు
సత్తెనపల్లిలో అభ్యర్థి కుమారుడి కిడ్నాప్.. పల్నాడులో దాడులు, దౌర్జన్యాలు
కుప్పంలో విద్యుత్ సరఫరా నిలిపివేసి రిగ్గింగ్.. జమ్మలమడుగులో ఉదయం 11లోపే 60% పోలింగ్ నమోదవ్వడమే రిగ్గింగ్‌కు నిదర్శనం
ఇన్ని జరుగుతున్నా.. నా పరిధి ఇంతే అంటూ చేతులెత్తేసిన ఎస్‌ఈసీ
సాక్షి, అమరావతి: ‘నారా’రూప రాక్షస రాజ్యంలో ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేశారు. చంద్రబాబు పెంచిపోషిస్తున్న రౌడీ మూకలు రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య హక్కులను నిలువునా పాతరేశాయి. మారీచ, సుబాహుల మాదిరిగా చెలరేగిన టీడీపీ కిరాయి మూకలు ప్రజాస్వామ్య యజ్ఞవాటికలైన పోలింగ్ కేంద్రాలపై మారణాయుధాలతో విరుచుకుపడ్డాయి. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బలవంతంగా బయటకు తరిమేశాయి. అభ్యర్థులపై దాడులకు తెగబడి బీభత్సం సృష్టించాయి. ప్రజాతీర్పునకు ప్రతీక అయిన బ్యాలెట్ పత్రాల సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కాలరాశాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచే టీడీపీ రౌడీ మూకలు ఆయుధాలతో పట్టణాలపై దండెత్తాయి.
తాలిబన్ ముష్కర మూకలను తలపించేలా దాడులు, దౌర్జన్యాలతో భయానక వాతావరణాన్ని సృష్టించాయి. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా భద్రత కల్పించాల్సిన పోలీసు యంత్రాంగం నిస్సిగ్గుగా టీడీపీ గూండాగిరీకి వత్తాసు పలికింది. అడ్డూ అదుపూ లేకుండా సాగిన విధ్వంసకాండకు అండగా నిలిచింది. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన అధికార యంత్రాంగం సైతం టీడీపీ కూటమి అక్రమాలకు కొమ్ముకాసిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. సాక్షాత్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డినే లక్ష్యంగా చేసుకుని కుట్రలకు తెగబడటం చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గానికి పరాకాష్టగా నిలిచింది.
జడ్ ప్లస్ భద్రతలో ఉన్న ఆయన హెలికాప్టర్ ప్రమాదానికి గురయ్యే పరిస్థితి తలెత్తేలా ల్యాండింగ్ అనుమతిలో జాప్యం చేయడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. పులివెందుల కేంద్రంగా టీడీపీ ఫ్యాక్షన్ మూకలు నడివీధుల్లో స్వైరవిహారం చేశాయి. ప్రజల ఓటు హక్కును కాపాడాలని వైఎస్ జగన్ రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్నికల అక్రమాలపై న్యాయమైన రీపోలింగ్ డిమాండ్‌ను అధికారులు బేఖాతరు చేశారు. దీంతో వైఎస్ జగన్ తన ఓటు హక్కును వినియోగించుకోకుండా వెనుదిరిగారు. పురపాలక ఎన్నికల పోలింగ్ సందర్బంగా శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీసత్యసాయి జిల్లా వరకు టీడీపీ కూటమి రౌడీ మూకలు విచ్చలవిడిగా చెలరేగిపోయాయి.
దాడులు, దౌర్జన్యాలు, హత్యాయత్నాలు, పోలింగ్ కేంద్రాల ఆక్రమణలు, యథేచ్ఛగా రిగ్గింగ్‌తో ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేశాయి. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి, ప్రతిపక్ష ఏజెంట్లను తరిమేసి, ప్రజాతీర్పును తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బరితెగించాయి. ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పండుగ కావాలి.. కానీ టీడీపీ కూటమి పాలనలో అవి దాడులు, దౌర్జన్యాలు, దమనకాండకు వేదికలయ్యాయి. మున్సిపల్ ఎన్నికలు జరిగిన ఆదివారం రాష్ట్ర ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి రోజుగా మిగిలిపోయింది.
పులివెందులలో పచ్చమూకల మాస్ రిగ్గింగ్..
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో శనివారం అర్ధరాత్రే నుంచే అలజడి మొదలైంది.అరాచకం జుగుప్సాకర స్థాయికి చేరింది. పచ్చ మూకలు అడ్డుఅదుపులేకుండా మాస్ రిగ్గింగ్‌కు పాల్పడితే.. అందుకు సహకరించిన ఖాకీలు విలువలను వలువల్లా విడిచేశారు. వెన్నుపోటుపార్టీ రౌడీ మూకలు ఉదయం 5 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలను ఆక్రమించారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం ఏకపక్షంగా టీడీపీ శ్రేణుల కొమ్ముకాస్తూ ప్రజాస్వామ్యాన్ని నడిరోడ్డుపై ఖూనీ చేసింది. తెల్లవారుజాము నాలుగు గంటలకు వేముల, చక్రాయపేట, వేంపల్లి నుంచి వచ్చిన మూకలు బూత్‌ల దగ్గర మోహరించాయి.
పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు, అభ్యర్థులపై దారిలోనే కర్రలు, రాళ్లతో దాడి చేశాయి. 80 బూత్‌లలో 70 బూత్‌ల నుంచి ఏజెంట్లను తరిమేశాయి. 31వ వార్డు మహిళా ఏజెంట్ సునంద చేయి విరిగింది. మరో ఏజెంట్ లక్ష్మీదేవి రాళ్ల దాడిలో గాయపడింది. 21వ వార్డులో నరసింహారెడ్డిని గాయపరిచారు. 11, 12 బూత్‌ల దగ్గర ఏజెంట్లు, ఓటర్లపై రాళ్ల వర్షం కురిపించారు. ఎర్రగుడిపల్లి దగ్గర ఇద్దరు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను చితకబాదారు. 18వ వార్డు దగ్గర చైర్మన్ అభ్యర్థి కారు ధ్వంసం చేశారు. ఈ దాడులకు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్ రవి వర్గాలు నేతృత్వం వహించాయని ఎంపీ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు.
మేయర్ అభ్యర్థి బండి దీప్తి రెడ్డి నిరసన..
కడప ఉమెన్స్ కాలేజీ బూత్ వద్ద వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను పోలీసులు లోపలికి రానివ్వకుండా గేట్లు వేయడంతో వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి బండి దీప్తి రెడ్డి నిరసనకు దిగారు. పాస్‌లు ఉన్నా అడ్డుకోవడంపై పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే ఓటర్లుకు ఇవ్వాల్సిన స్లిప్‌లు చెత్తకుప్పలో పడేయాడాన్ని అమె స్వయంగా చూపెట్టారు. మరోవైపు, నగరంలోని 8వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్ల ఫామ్‌లను టీడీపీ గూండాలు చించేశారు. పాత కడప జెడ్పీ హైస్కూల్ బూత్‌కు ఓటు వేయడానికి వెళ్లిన మహిళా ఓటర్లను అడ్డుకున్న పచ్చ శ్రేణులు.. ‘మీ ఓట్లు మేము ముందే వేసేసుకున్నాం, ఇక మీరు వెళ్ళిపోండి‘అని బహిరంగంగా చెప్పడంతో వారు నిరాశతో, కన్నీళ్లతో వెనుదిరిగారు.
జమ్మలమడుగులో ప్రజాస్వామ్యం ఖూనీ
జమ్మలమడుగు పురపాలక సంఘం పరిధిలో పోలింగ్ ప్రారంభమైన తొలి గంట నుంచే కూటమి శ్రేణులు పక్కా ప్లాన్‌తో బూత్‌లను తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించడంతో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, ఏజెంట్లను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడటంతో పలు వార్డుల్లో పోలింగ్ ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. మున్సిపల్ చైర్‌పర్సన్‌న్‌అభ్యర్థి హైమావతితో, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పోలింగ్ సరళిని పరిశీలించేందుకు బూత్ వద్దకు వెళ్లగా, కూటమి శ్రేణులు వారిని లోపలికి వెళ్లకుండా దారుణంగా అడ్డుకున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా బూత్‌లను సందర్శించే హక్కు ఉన్న అభ్యర్థులను గేట్ల ముందే నిలువరించడంతో తోపులాట జరిగింది. అదే సమయంలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తన భారీ అనుచరగణంతో ఎత్తపు వారి కాలనీ, జూనియర్ కాలేజ్ బూత్‌ల వద్దకు చేరుకుని హల్‌చల్ చేశారు.
పల్నాడులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, ఏజెంట్లపై దాడులు..
పల్నాడు జిల్లాలో చిలకలూరిపేట, వినుకొండలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, ఏజెంట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు, నిర్బంధాలు కొనసాగాయి. వినుకొండ 8వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పోలూరు అర్చన మూర్తిని, ఆమె భర్త నరసింహమూర్తిని పోలింగ్ కేంద్రం లోపలి నుంచి ఈడ్చుకొచ్చి విచక్షణారహితంగా కొట్టారు. పక్కనే ఉన్న పోలీసులు పట్టించుకోలేదు. సీఐ ప్రభాకర్ అభ్యర్థిని ఏకవచనంతో దూషించారు. 5వ వార్డు ఏజెంట్ కొత్త కోటేశ్వరరావును బూత్‌లోంచి బయటకు లాగేశారు. మాచర్ల 31వ వార్డులో రిగ్గింగ్ అడ్డుకునేందుకు వెళ్లిన కార్యకర్తలపై మూకుమ్మడిగా దాడి చేశారు. 23వ వార్డు బూత్‌లోని సీసీ కెమెరాలను పగలగొట్టారు.
చిలకలూరిపేట 28వ వార్డు అభ్యర్థి చిన్నం లలిత కుమారుడు చిన్నం వెంకటేష్‌ను అర్ధరాత్రి 12.30 గంటలకు పోలీసులు అరెస్టు చేశారు. 27వ వార్డు అభ్యర్థి అన్నపురెడ్డి శ్రీలక్ష్మి కోసం అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లి, ఆచూకీ చెప్పాలంటూ బంధువులను బెదిరించారు. 4వ వార్డు అభ్యర్థి కవల నాగయ్య కుమారుడు కవల దినకర్‌ను పోలింగ్ కేంద్రం వద్ద అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 6, 14, 17, 23, 27, 32, 36, 40, 41, 44వ వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. వినుకొండలో 8వ వార్డు అభ్యర్థి పోలూరు అర్చనమూర్తి, ఆమె భర్త నరసింహమూర్తిపై పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ మూకలు దాడి చేశాయి.
సగానికిపైగా పోలింగ్ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బలవంతంగా బయటకు లాగి దాడులకు పాల్పడ్డారు. గుంటూరు కార్పొరేషన్‌లోనూ పోలింగ్ కేంద్రాలన్నింటిలో టీడీపీ భారీగా దొంగ ఓట్లు వేయించింది. సగానికిపైగా కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను పోలీసులే బలవంతంగా బయటకు పంపించారు. కార్పొరేటర్లుగా పోటీ చేస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ధనావత్ వెంకటేశ్వర నాయక్, బోడపాటి కిషోర్, మాజీ కార్పొరేటర్ బోడపాటి ఉషారాణి తదితరులపై టీడీపీ రౌడీలు దాడులకు పాల్పడ్డారు.
అనంతపురంలో యథేచ్ఛగా రిగ్గింగ్..
అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌లో పలు పోలింగ్ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను పోలీసులు బలవంతంగా బయటకు తరలించి టీడీపీ రిగ్గింగ్‌కు సహకరించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నేతాజీ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులను దూషించి, ఏజెంట్ల ఐడీ కార్డులు చించివేశారు. 1, 23, 30, 61వ డివిజన్లలో ఏజెంట్లను బయటకు నెట్టివేసి టీడీపీ గూండాలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. 40వ డివిజన్ గుడ్ ఛిల్డ్రన్స్ స్కూల్ వద్ద ఏజెంట్ లోకనాథ్‌పై దాడి జరిగింది.

అనంతపురంలో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆదేశాలతో పోలింగ్ కేంద్రంలోకి చొచ్చుకొచ్చి యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడుతున్న టీడీపీ గూండాలు
45వ డివిజన్ జ్ఞాన సరస్వతి స్కూల్ వద్ద దౌర్జన్యాన్ని అడ్డుకున్న విశ్వనాథరెడ్డి, కార్పొరేటర్ అభ్యర్థి అనిల్ కుమార్‌రెడ్డిపై దాడి చేయగా అనిల్ గాయపడ్డారు. 39వ డివిజన్ అభ్యర్థి సాకే చంద్రశేఖర్ ఇంటిపై మాజీ డిప్యూటీ మేయర్ గంపన్న వర్గీయులు రాళ్లు, ఇటుకలతో దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడిన శ్రీనివాసులు, సాకే ఈశ్వరయ్యలను ప్రభుత్వ సర్వజనాస్పత్రికి తరలించారు. అనంత వెంకటరామిరెడ్డి, మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు.
కర్నూలు జిల్లాలో టీడీపీ బరితెగింపు..
కర్నూలు జిల్లాలో డోన్, బేతంచెర్ల మున్సిపాలిటీల్లో టీడీపీ కూటమి యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడింది. డోన్‌లో టీడీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి కోట్ల సుజాతమ్మ పోలీసుల అండతో వైఎస్సార్‌సీపీ మహిళా అభ్యర్థుల భర్తలు, కుటుంబ సభ్యులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి డీఎస్పీ శ్రీనివాసులు ఎదుట బెదిరింపులకు దిగారు. పోలింగ్ ఏజెంట్లను అక్రమంగా నిర్బంధించి కేంద్రాలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. కొందరిపై పోలీసులు చేయి చేసుకున్నారు. బేతంచెర్లలోనూ టీడీపీ నేతలు ఇదే తరహాలో రిగ్గింగ్‌కు పాల్పడ్డారు.
ఈ అక్రమాలను నిరసిస్తూ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు డోన్ టౌన్ పోలీస్‌స్టేషన్ ఎదుట వైఎస్సార్‌సీపీ శ్రేణులతో కలిసి ఆందోళన నిర్వహించారు. డోన్, బేతంచెర్లలో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎన్నికల అక్రమాలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ప్రకటించారు. మరోవైపు ఎమ్మిగనూరులో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్‌రెడ్డిని, నంద్యాల జిల్లాలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
కర్నూలు కార్పొరేషన్ ఎన్నికల్లోనూ టీడీపీ రిగ్గింగ్, రీసైక్లింగ్‌కు తెగబడింది. వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డిలను పోలీసులు అడ్డుకుని వారి వాహనాలను సీజ్ చేశారు. మరోవైపు మంత్రి టీజీ భరత్ వాహనంతోపాటు ఆయన కాన్వాయ్‌ను మాత్రం పోలీసులు అడ్డుకోలేదు. దీంతో మంత్రి నగరంలో యథేచ్ఛగా పర్యటిస్తూ పోలింగ్ బూత్‌లలోకి వెళ్లి దగ్గరుండి రిగ్గింగ్ చేయించారు. కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని 30 డివిజన్లలో టీడీపీ గుండాలు భారీగా దొంగ ఓట్లు వేశారు.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో యథేచ్ఛగా రిగ్గింగ్..
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో టీడీపీ శ్రేణులు పోలీసుల, ఎన్నికల అధికారుల సహకారంతో యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. చిత్తూరు వళ్లియప్ప నగర్ 21/1 పోలింగ్ కేంద్రంలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకు పంపించి, బ్యాలెట్ పత్రాలపై ఫోర్జరీ సంతకాలు, స్వస్తిక్ ముద్రలతో రిగ్గింగ్ చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తిరుపతి 36వ వార్డులో జనసేన నేత పసుపులేటి హరిప్రసాద్ అనుచరులు సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు, అభ్యర్థి ఇమామ్‌పై దాడి చేశారు. 500కు పైగా ఓట్లు రిగ్గింగ్ చేశారు. కుప్పంలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను అడ్డుకుని, విద్యుత్ సరఫరా నిలిపివేసి రిగ్గింగ్ పూర్తి చేశారు. పలమనేరులో స్థానికేతరులతో దొంగ ఓట్లు వేయించారు. నాయుడుపేటలో దొంగ ఓట్లను అడ్డుకున్న ఏజెంట్లను పోలీసులు నిర్బంధించారు. వెంకటగిరిలో గుర్తుల కేటాయింపు గందరగోళంతో 35వ వార్డు పోలింగ్ వాయిదా పడింది. పుత్తూరులో రిగ్గింగ్‌ను ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ నేత మనోజ్‌రెడ్డిపై దాడి చేశారు.
ప్రకాశం జిల్లాలో ఏజెంట్లపై దాడులు
ప్రకాశం జిల్లాలో టీడీపీ ఎన్నికల అక్రమాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు నిర్బంధించారు. దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌ను ఆదివారం తెల్లవారుజామునే హౌస్ అరెస్ట్ చేశారు. అద్దంకిలో టీడీపీ దొంగ ఓట్లను అడ్డుకునేందుకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చింతలపూడి అశోక్‌కుమార్‌ను సింగరాయకొండ వద్ద పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. చీమకుర్తి మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు, నాయకులను ఉదయాన్నే సంతనూతలపాడు పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించారు.
గిద్దలూరులోని సెయింట్ పాల్ కళాశాల పోలింగ్ కేంద్రంలో రెండో వార్డు ఏజెంట్లు అమీర్ భాష, నరసింహారెడ్డిపై విచక్షణారహితంగా దాడి చేశారు. శెట్టిరెడ్డిపల్లెలో టీడీపీ దొంగ ఓట్లను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైఎస్సార్‌సీపీ ఏజెంట్ చంద్రశేఖర్‌పైనా దాడికి తెగబడ్డారు. మార్కాపురంలో వైఎస్సార్‌సీపీ పట్టణ శాఖ అధ్యక్షుడు షేక్ సలీమ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టును నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి కనకదుర్గ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు.
గుంటూరులో బ్యాలెట్ బాక్సులు ధ్వంసం
గుంటూరు 57వ డివిజన్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఐదో బూత్‌లో బ్యాలెట్ బాక్సులను పగలగొట్టారు. దొంగ ఓట్లను అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ నేత భాస్కర్‌రెడ్డిపై దాడి చేశారు. 59వ డివిజన్ అభ్యర్థి ధనావత్ వెంకటేశ్వర్లు నాయక్‌ను కొట్టారు. తెనాలిలో వైఎస్సార్‌సీపీ పట్టణ మహిళా అధ్యక్షురాలు నాగమంజరిపై దాడికి యత్నించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు శెట్టిరెడ్డిపల్లెలో దొంగ ఓట్లను అడ్డుకున్న ఏజెంట్ చంద్రశేఖర్‌పై దాడి జరిగింది.
విశాఖలో పలు పోలింగ్ బూత్‌లలో రిగ్గింగ్
విశాఖలోని గాజువాక, భీమిలి, విశాఖ దక్షిణ, తూర్పు నియోజకవర్గాల్లో పలు పోలింగ్ బూత్‌లలో రిగ్గింగ్ జరిగింది. తమ ఓట్లను ఇతరులు వేసేయడంతో పలువురు ఓటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ మేయర్ అభ్యర్థి వరుదు కల్యాణి ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతుండగా టీడీపీ శ్రేణులు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగి తోపులాటకు పాల్పడ్డారు. 37వ వార్డులో రిగ్గింగ్ జరుగుతోందన్న సమాచారంతో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లితో కలిసి అక్కడికి వెళ్లిన వరుదు కల్యాణితో జనసేన నేతలు వాగ్వాదానికి దిగారు.
మదనపల్లెలో వైఎస్సార్‌సీపీ నేతలపై, ఏజెంట్లపై దాడులు..
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో పలు పోలింగ్ కేంద్రాల్లో దాడులు, రిగ్గింగ్ యత్నాలు చోటుచేసుకున్నాయి. 16వ పోలింగ్ కేంద్రంలో మాక్ పోలింగ్ సమయంలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్ లేకపోవడాన్ని ప్రశ్నించిన చైర్మన్ అభ్యర్థి జింకా వెంకట చలపతిపై ఎస్‌ఐ శివకుమార్ లాఠీతో దాడి చేయడంతో గాయపడ్డారు. 12వ కేంద్రంలో చైర్మన్ బ్యాలెట్ పేపర్లను ఎత్తుకెళ్లేందుకు మాస్కులు ధరించిన వ్యక్తులు ప్రయత్నించగా అడ్డుకున్నారు. 19వ వార్డులో పోలింగ్ కేంద్రంలోకి టీడీపీ కార్యకర్తల ప్రవేశాన్ని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ నేత రఫీపై దాడి చేశారు. దక్నిపేట, మేదరవీధి, రామారావు కాలనీ పోలింగ్ కేంద్రాల వద్ద కూడా వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులకు పాల్పడ్డారు. పలువురు ఏజెంట్ల పాసులను లాక్కెళ్లడంతో పాటు పలు కేంద్రాల్లో రిగ్గింగ్‌కు యత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి.
‘సుప్రీం’ ఆదేశాలు సైతం బేఖాతరు
సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, వాటి అమలును పర్యవేక్షించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీసు యంత్రాంగం పట్టించుకోలేదు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు తగిన భద్రత కల్పించాలని, పోలింగ్ కేంద్రాల్లో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కానీ క్షేత్రస్థాయిలో ఈ ఆదేశాలు అమలైన దాఖలాలు కనిపించలేదు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ఎక్కడా తగిన భద్రత కల్పించలేదు. ఇదే పరిస్థితిని ఆసరాగా చేసుకుని పలు ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు వైఎస్సార్‌సీపీ మేయర్, మున్సిపల్ చైర్‌పర్సన్, కార్పొరేటర్, కౌన్సిలర్ అభ్యర్థులపై దాడులకు దిగాయి. పోలింగ్ సరళిని పర్యవేక్షించేందుకు కూడా వారికి అవకాశం లేకుండా అడ్డుకున్నాయి.
అభ్యర్థులపై దాడులు జరుగుతున్నా, వారిని రక్షించాల్సిన పోలీసులు తగిన చర్యలు తీసుకోకపోవడం పలు ప్రశ్నలకు తావిచ్చింది. ఇక ఎన్నికలు నిర్వహించిన 92 పట్టణ స్థానిక సంస్థల్లో అత్యధిక పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం మరింత ఆందోళనకరం. కడప, పులివెందుల, అనంతపురం, తిరుపతి, కర్నూలు, డోన్, బేతంచర్ల, గుంటూరు, విజయవాడ, నెల్లూరు సహా అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. సీసీటీవీ నిఘా కొరవడిన చోట్ల వైఎస్సార్‌సీపీ పోలింగ్ ఏజెంట్లను బలవంతంగా బయటకు పంపించి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులతో దొంగ ఓట్లు వేయించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. పలు చోట్ల సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు.
అర్ధరాత్రి అరెస్టులు..
పోలింగ్‌కు ముందురోజు రాత్రే పోలీసులు వైఎస్సార్‌సీపీ శ్రేణులే లక్ష్యంగా వేట మొదలుపెట్టారు. శాంతిభద్రతల విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీసులు పక్షపాత ధోరణితో వైఎస్సార్‌సీపీ నాయకులను కట్టడి చేసి కూటమి అభ్యర్థులకు అనుకూలంగా రిగ్గింగ్‌కు లైన్‌క్లియర్ చేశారు. చిలకలూరిపేటలో అర్ధరాత్రి 12:30 గంటలకు 28వ వార్డు అభ్యర్థి చిన్నం లలిత కుమారుడు వెంకటేష్‌ను, 4వ వార్డు అభ్యర్థి కవల నాగయ్య కుమారుడు దినకర్‌ను స్టేషన్‌కు తరలించారు. 27వ వార్డు అభ్యర్థి శ్రీలక్ష్మి కోసం అర్ధరాత్రి ఇంటికి వెళ్లారు. ఆమె కనిపించకపోవడంతో బంధువులను స్టేషన్‌కు తీసుకెళ్తామని బెదిరించారు.
సత్తెనపల్లి 12వ వార్డు అభ్యర్థి గోవిందమ్మ భర్త వెంకటేశ్వర్లును రాత్రి 11:30 గంటలకు తీసుకెళ్లారు. మాచర్ల 32వ వార్డు అభ్యర్థి భర్త షేక్ మస్తాన్‌ను అర్ధరాత్రి ఇంటి నుంచి తీసుకెళ్లారు. ఈ ఇద్దరి ఆచూకీ ఆదివారం సాయంత్రం వరకు కుటుంబాలకు చెప్పలేదు. మాచర్లలో 12 మంది అభ్యర్థులు, నేతలను నాలుగు గంటలపాటు స్టేషన్‌లో కూర్చోబెట్టారు. చిత్తూరులో అర్ధరాత్రి ఒంటిగంటకు వార్డు ఇన్‌ఛార్జులు, బూత్ ఏజెంట్లను బైండోవర్ పేరుతో స్టేషన్లలో నిర్బంధించారు. డోన్‌లో పోలింగ్ మొదలవకముందే పట్టణ అధ్యక్షుడు మల్లికార్జునరెడ్డితోపాటు ఐదుగురు అభ్యర్థులను అదుపులోకి తీసుకున్నారు. ఒంగోలు 55వ డివిజన్ అభ్యర్థి పల్నాటి రవీందర్‌రెడ్డిని తాలూకా సీఐ అరెస్ట్ చేసి స్టేషన్‌లో ఉంచారు.
కడపలో బరితెగించిన ‘కౌరవ’..‘సేన’..
వైఎస్సార్ కడప జిల్లాలో కౌరవ సేన బరితెగించింది. తీవ్ర ఉద్రిక్తతలు, రాజకీయ ఘర్షణల మధ్య పోలింగ్ సాగింది. కడప నాగరాజుపేట పోలింగ్ కేంద్రం వద్ద ఉదయం నుంచే హైడ్రామా మొదలైంది. నగరంలోని కోటిరెడ్డి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల బూత్‌లోకి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను ప్రత్యర్థులు అడ్డుకోవడంతో ఒక్క ఏజెంట్ కూడా లోపల లేని పరిస్థితి ఏర్పడింది. ఈ సమాచారం అందుకున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనా«థరెడ్డి నేరుగా బూత్ లోపలికి వెళ్లి.. తానే స్వయంగా ఏజెంట్‌గా కూర్చున్నారు. ‘జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పే వరకు బూత్ నుండి కదిలేది లేదు’ అనడంతో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది.
కడప నగరంలో 361 పోలింగ్ కేంద్రాల్లోనూ వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు ఎక్కడా లేకుండా పచ్చమూకలకు పోలీసులు పూర్తి సహకారం అందించారు. కడప మోచంపేట పోలింగ్ బూత్‌లో టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డి బూత్ లోపలికి చొరబడి వైఎస్సార్‌సీపీ ఏజెంట్ల ఫారాలను ముక్కలు ముక్కలుగా చించివేసి వారిని గెంటేశారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో ఎలాంటి ప్రచారం చేయరాదనే ఎన్నికల కోడ్ నిబంధనలను బూడిదలో పోసి.. ఏకంగా బూత్ ఆవరణలోనే మీడియా సమావేశం పెట్టి ‘అభివృద్ధికి పట్టం కట్టాలి’అంటూ ఓటర్లను ప్రలోభపెట్టేలా మాట్లాడారు.

పులివెందులలో ఓటర్లను బెదిరించి వెనక్కి పంపుతున్న డీఎస్పీ మురళీ నాయక్
నెల్లూరులో మంత్రి నారాయణ ఆధ్వర్యంలో దొంగ ఓట్ల దందా..
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో మంత్రి నారాయణ తన విద్యాసంస్థల విద్యార్థులను బస్సుల్లో తరలించి దొంగ ఓట్లు వేయించారు. నగరంలోని 14, 16, 17వ డివిజన్లలో విద్యార్థులతో దొంగ ఓట్లు వేయించేందుకు వచ్చిన నారాయణ విద్యాసంస్థల బస్సులను వైఎస్సార్‌సీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దొంగ ఓట్లు ఎందుకు వేస్తున్నారని ప్రశ్నించిన వారిపై టీడీపీ శ్రేణులు దాడులకు దిగాయి. నెల్లూరు కార్పొరేషన్‌తోపాటు ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, నేతలపై పోలీసులు ఆంక్షలు విధించారు. వారిని పోలింగ్ కేంద్రాల్లోకి కూడా వెళ్లనివ్వలేదు. మరోవైపు టీడీపీ కూటమి నేతలు పోలింగ్ బూత్‌లలోకి యథేచ్ఛగా చొరబడి రిగ్గింగ్‌కు పాల్పడుతున్నా పోలీసులు అడ్డుకోలేదు.
పోలీసుల ఏకపక్ష వైఖరిపై ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డిని సైతం పోలీసులు అడ్డుకున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 4వ డివిజన్ పెద్దచెరుకూరు పోలింగ్ బూత్ వద్ద వైఎస్సార్‌సీపీ ఏజెంట్ యర్రంరెడ్డి రామ్‌మోహన్‌రెడ్డిపై 25 మందికి పైగా టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. టీడీపీ ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్‌రెడ్డి సోదరుడు మనుబోలు రామ్‌మోహన్‌రెడ్డి తన అనుచరులతో కలిసి పోలింగ్ బూత్ వద్ద హంగామా సృష్టించారు. ఈ క్రమంలో పోలీసులతో మాట్లాడేందుకు బయటకు వచ్చిన యర్రంరెడ్డి రామ్‌మోహన్‌రెడ్డిపై మూకుమ్మడిగా దాడి చేశారు. దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు.
ఓటమి భయంతోనే ‘నారా’సుర కుతంత్రం!
రెండున్నరేళ్ల టీడీపీ కూటమి రాక్షస పాలనపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజావ్యతిరేకత వెల్లువెత్తుతుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మున్సిపల్ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగితే ప్రజలు కూటమిని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తారన్న భయం ఆయనను వెంటాడుతోంది. అందుకే ప్రజాతీర్పును ఎదుర్కొనే ధైర్యం లేక, ఎన్నికల ప్రక్రియనే తమకు అనుకూలంగా మలుచుకుని ప్రజల తీర్పును హైజాక్ చేసేందుకు పక్కా కుట్రకు తెరతీశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం, డీజీపీతో పాటు పోలీసు యంత్రాంగాన్ని కూడా ఈ కుట్రలో భాగస్వాములను చేసుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పన్నాగానికి శ్రీకారం చుట్టారు.
టీడీపీ గూండాలు, రౌడీ మూకలు, గంజాయి బ్యాచ్‌లు, ఇతర రాష్ట్రాల నుంచి రప్పించిన మాఫియా బలగాలను శనివారం నుంచే ఎన్నికలు జరుగుతున్న పట్టణ స్థానిక సంస్థల్లో మోహరించారు. చంద్రబాబు రచించిన ఈ పథకాన్ని ఆదివారం తెల్లవారుజాము నుంచే అమల్లోకి తెచ్చారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు పోలింగ్ కేంద్రాలకు చేరుకోకుండా పోలీసులే అడ్డంకులు సృష్టించారు. టీడీపీ రౌడీ మూకలు వైఎస్సార్‌సీపీ పోలింగ్ ఏజెంట్లపై దాడులకు తెగబడుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు. పోలీసుల అండతో టీడీపీ గూండాగిరీ మరింతగా రెచ్చిపోయింది. దాడులు, దౌర్జన్యాలతో పోలింగ్ కేంద్రాల వద్ద భయానక వాతావరణాన్ని సృష్టించారు.
వైఎస్సార్‌సీపీ ఓటర్లతో పాటు తటస్థ ఓటర్లను కూడా లక్ష్యంగా చేసుకుని వారిని భయభ్రాంతులకు గురిచేశారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు బయటకు వచ్చిన సామాన్యులపై దాడులకు దిగారు. అసభ్య పదజాలంతో దూషించారు. ఓటర్ల చేతుల్లోని ఓటరు స్లిప్పులను బలవంతంగా లాక్కుని చింపివేసి, వారిని వెనక్కి పంపించారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లాలంటేనే భయపడేలా నడిరోడ్లపై రౌడీ మూకలతో బీభత్స వాతావరణాన్ని సృష్టించారు. ప్రజల మద్దతుతో గెలవలేమన్న భయంతోనే ఓటర్లను ఓటు వేయకుండా అడ్డుకోవడం.. ప్రజాతీర్పును దౌర్జన్యంతో హైజాక్ చేయడమే చంద్రబాబు కూటమి ఎన్నికల వ్యూహంగా మారింది.
సీఎంఓ డైరెక్షన్‌లో అధికారులు టీడీపీ కార్యకర్తల్లా పనిచేశారు. సీఎం సెక్రటరీ ప్రద్యుమ్న కలెక్టర్లను ఇష్టారాజ్యంగా వాడేశారని అధికారవర్గాల్లో వినిపిస్తోంది. ఇక డీఐజీ కోయ ప్రవీణ్ చౌదరి, జిల్లాల ఎస్‌పీలంతా డీజీపీ పర్యవేక్షణలో చెలరేగి పోయారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ చౌదరి, ఎస్‌పీ నచికేత విశ్వనాథ్, అడిషనల్ ఎస్‌పీ ప్రకాష్ చౌదరి కడప, పులివెందుల లక్ష్యంగా పనిచేశారు. పోలీసులను అధికారపార్టీ కోసం పనిచేయించారు.
నేతలను ఇళ్ల నుంచి కదలనివ్వలేదు..
పోలింగ్ రోజు ప్రతిపక్ష నేతలెవరూ బయట కాలు పెట్టకుండా పోలీసులు తీవ్ర నిర్భంధం అమలు చేశారు. కడప మాజీ మేయర్ పాకా సురేష్‌ను ఇంటి నుంచే అరెస్ట్ చేశారు. జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గృహనిర్బంధం చేశారు. పులివెందులలో దుష్యంత్‌రెడ్డి గృహనిర్బంధం. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని పార్టీ కార్యాలయం గేటు దగ్గరే అడ్డుకున్నారు. ఆయన వస్తున్నారని మున్సిపల్ కార్యాలయం గేట్లకు తాళాలు వేశారు. పల్నాడు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటి చుట్టూ ముళ్లకంచెలు వేశారు. మాజీ మంత్రి విడదల రజిని, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, అద్దంకి ఇన్‌ఛార్జ్ చింతలపూడి అశోక్‌కుమార్‌లను గృహనిర్బంధం చేశారు.
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పది రోజులుగా గృహనిర్బంధంలోనే ఉన్నారు. నాయుడుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నేతలు హౌస్ అరెస్ట్ చేశారు. 14వ వార్డు నేత కిషోర్‌రెడ్డిని బయటకు రావొద్దని ఇంటికి వెళ్లి మరీ పోలీసులు హుకుం జారీ చేశారు. కుప్పం మున్సిపల్ అధ్యక్షుడు హఫీజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మాజీ కౌన్సిలర్ ఇళయరాజా హౌస్ అరెస్ట్ చేశారు. నెల్లూరులో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డిని రోడ్డుపైనే ఆపి నోటీసులిచ్చారు. పలాసలో సీనియర్ నేత బోనెల బాలకృష్ణ అరెస్ట్ చేశారు. తిరుపతిలో కలెక్టర్‌ను కలిసేందుకు వెళ్లిన ఎంపీ గురుమూర్తి, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యంను కలెక్టరేట్ గేటు దగ్గరే నిలిపేశారు.
బాధితులపైనే లాఠీలు, కేసులు..
దాడులు చేసిన అధికారపక్షం వాళ్లను వదిలేసిన పోలీసులు బాధితులైన వైఎస్సార్‌సీపీ శ్రేణులపైనే లాఠీలు ఝుళిపించారు. పులివెందుల బూత్ 17 దగ్గర వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు. 13వ వార్డు అభ్యర్థి కలందర్‌ను బలవంతంగా జీపులో ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. మదనపల్లెలో చైర్మన్ అభ్యర్థి జింకా వెంకటచలపతిని సీఐ లాఠీతో కొట్టి కాళ్లతో తన్నారు. సత్తెనపల్లి మండల పరిషత్ కేంద్రంలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌పై ఎస్సై చేయి చేసుకున్నారు. అనంతపురం 61వ డివిజన్‌లో అభ్యర్థి వాసంతి కుటుంబంపై దౌర్జన్యం చేసిన తర్వాత, ఆమె కుటుంబం మీదే రివర్స్ కేసు పెట్టారు. చీమకుర్తిలో దాడికి గురైన ఏజెంట్లనే సీఐ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
నాయుడుపేటలో దొంగ ఓట్లను అడ్డుకున్న ఏజెంట్లను డీఎస్పీ ఎత్తుకెళ్లారు. డోన్‌లో హలచల్ చేసిన టీడీపీ వాళ్లను ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ నేతలనే స్టేషన్‌కు తరలించారు. విజయవాడ 43వ డివిజన్‌లో డబ్బు పంపిణీని నిలదీసిన నేతలను అదుపులోకి తీసుకున్నారు. బేతంచెర్లలో రీపోలింగ్ కోసం మాజీ మంత్రి బుగ్గన పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించాల్సి వచ్చింది. పులివెందులలో రాళ్ల దాడి జరిగిందని కర్నూలు రేంజ్ డీఐజీ స్వయంగా అంగీకరించారు. అయినా ఆదివారం సాయంత్రం వరకు ఒక్క దాడికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్ అయినట్లు సమాచారం లేదు. దాడి చేసినవాళ్లు బయట దర్జాగా తిరుగుతున్నారు. దెబ్బలు తిన్నవాళ్లు స్టేషన్లలో, ఆసుపత్రుల్లో ఉన్నారు.


