పేట్రేగిన పచ్చమూకలు | Attack on media representatives in Pulivendula | Sakshi
Sakshi News home page

పేట్రేగిన పచ్చమూకలు

Nov 2 2026 4:33 AM | Updated on Nov 2 2026 4:33 AM

Attack on media representatives in Pulivendula

పులివెందులలో టీడీపీ మూకల దాడిలో గాయపడిన మీడియా ప్రతినిధులను పరామర్శిస్తున్న వైఎస్‌ జగన్‌

మున్సి‘పోల్స్‌’ అరాచకాలను కవర్‌ చేస్తున్న మీడియా ప్రతినిధులపై దాడి

ఇండియా టుడే, ఎన్టీవీ, సాక్షి జర్నలిస్టులపై విరుచుకుపడ్డ పచ్చ గూండాలు 

పోలింగ్‌ సందర్భంగా పులివెందులలో భయానక వాతావరణం సృష్టించిన వైనం 

తీవ్రంగా ఖండించిన వైఎస్‌ జగన్‌.. గాయపడిన వారికి పరామర్శ 

దాడులు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టీకరణ

సాక్షి, అమరావతి/పులివెందుల: ప్రశ్నిస్తే దేశ ద్రోహం.. నిలదీస్తే దాడులు.. ఎదురు తిరిగితే అణచివేత.. సూత్రంతో రాష్ట్రంలో వెన్నుపోటు టీడీపీ ప్రభుత్వం రెచ్చిపోతోంది. అధికార మదం.. తోలుబొమ్మల్లా ఆడుతున్న పోలీసుల అండతో ఎల్లో తాలిబన్‌ ముఠా స్థానిక ఎన్నికల నామినేషన్లు, పరిశీలన, విత్‌డ్రా సమయాల్లో పెద్దఎత్తున పేట్రేగిపోయిన విషయం తెలిసిందే. పోలింగ్‌ రోజున వీరి అరాచకాలను బట్టబయలు చేస్తున్న మీడియాపైనా పచ్చ గూండాలు దాడులు, హింసకు పాల్పడ్డారు. ఆదివారం మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా ఏకంగా జాతీయ మీడియా ప్రతినిధులపైనా దాడులకు తెగబడటం విస్తుగొలుపుతోంది. 

వైఎస్సార్‌ జిల్లా పులివెందుల మున్సిపాలిటీలో ప్రజలు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోకుండా పచ్చమూకలు సృష్టించిన భయానక వాతావరణాన్ని కవర్‌ చేస్తున్న ఇండియా టుడే ప్రతినిధులపై విరుచుకుపడ్డారు. పులివెందులలో హింస సృష్టించి రిగ్గింగ్‌ చేసుకునేందుకు వీలుగా శనివారమే పట్టణంలో పచ్చమూకలు పెద్దఎత్తున మోహరించాయి. సినీఫక్కీలో కర్రలు, కత్తులు, రాడ్లతో ఆదివారం తెల్లవారుజామున పట్టణాల్లో హల్‌చల్‌ చేశాయి. ప్రజలు ఓటు వేయడానికి ఇళ్ల నుంచి బయటకు రాకుండా భయానక పరిస్థితులను సృష్టించాయి. 

వీటిపై రిపోర్ట్‌ చేస్తున్న ఇండియా టుడే టీవీ రిపోర్టర్‌ బషీర్, కెమెరామెన్‌ విజయ్, ఎన్టీవీ రిపోర్టర్‌ సురేశ్‌పై పచ్చ గూండాలు దాడులు చేశారు. ఇండియా టుడే కెమెరామెన్‌ కెమెరా లాక్కుని అందులో రికార్డైన పచ్చమూకల వీడియోలను తొలగించడంతో పాటు, కెమెరాను ధ్వంసం చేశారు. అలాగే, ఎన్టీవీ రిపోర్టర్‌ సురేశ్‌పైనా దాడిచేసి సెల్‌ఫోన్‌ లాక్కుని వెళ్లిపోయారు. ఓట్లు వేయడానికి ఇళ్ల నుంచి బయటకొచ్చే మహిళా ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్న పరిస్థితులను రిపోర్ట్‌ చేస్తున్న సాక్షి టీవీ ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ ఇస్మాయిల్‌ పైనా రాళ్లు రువ్వారు.  

గొంతునొక్కడమే పనిగా.. 
నిజానికి.. చంద్రబాబు గద్దెనెక్కిన నాటి నుంచి ఎన్నికల హామీలను అమలు చేయలేకపోవడంతో కూటమి ప్రభుత్వ అరాచకాలు, అక్రమాలు, అవి­నీతిని ప్రశ్నిస్తున్న మీడియాను అణిచి వేయడమే పనిగా పెట్టుకున్నారు. ఈ పరంపరలో సాక్షి మీడియాపైనా ఇప్పటికే అనేక వేధింపులకు దిగారు. పత్రిక ఎడిటర్‌ ఆర్‌.ధనంజయరెడ్డిపై అనేక అక్రమ కేసులు బనాయించారు. విచారణల పేరిట వేధించారు. 

ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జాతీయ మీడియాపైనా టీడీపీ గ్యాంగ్‌ దాడులు చేయడం మేధావి వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. చంద్రబాబు ప్రభుత్వ నియంత పోకడలపై జర్నలిస్టు సంఘాలు మండి పడుతున్నాయి. ఇది కేవలం మీడియాపై దాడి కాదని, భావ ప్రకటన స్వేచ్ఛపై, రాజ్యాంగం కల్పించిన హక్కులపై జరిగిన దాడిగా ఆయా సంఘాలు అభివర్ణిస్తున్నాయి.

వైఎస్‌ జగన్‌ పరామర్శ
పులివెందుల మునిసిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై దాడిని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ తీవ్రంగా ఖండించారు. టీడీపీ మూక దాడిలో గాయపడిన ఇండియా టుడే టీవీ రిపోర్టర్‌ బషీర్, కెమెరామెన్‌ విజయ్, ఎన్టీవీ రిపోర్టర్‌ సురేష్‌లను కలిసి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడి­యా ప్రతినిధులపై దాడులను వైఎస్‌ జగన్‌ తీవ్రంగా ఖండించారు. 

ప్రజాస్వామ్యంలో మీడియాకు స్వేచ్ఛగా పనిచేసే హక్కు ఉందని, ఎన్నికల ప్రక్రియను ప్రజలకు తెలియజేసే జర్నలిస్టులపై దాడులు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ఎన్నికల సమయంలో మీడి­యా ప్రతినిధులకు తగిన భద్రత కల్పించాల్సిన బా«­ద్య­­త ప్రభుత్వంపై, పోలీసు యంత్రాంగంపై ఉందని చెప్పారు. జర్నలిస్టులపై దాడులకు సంబంధించిన ఘ­ట­నలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

హే రామ్‌.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి
» రాష్ట్రంలో స్థానిక ఎన్నికల తీరుపై వైఎస్‌ జగన్‌
» ఇవి ఎన్నికలు కావు.. మీకు నచ్చిన వారిని మీరే ఎంపిక చేసుకునే ప్రక్రియ 
» ప్రజల తీర్పును తారుమారు చేసేందుకు బరి తెగించి చేస్తున్న ప్రయత్నం 
» ఇది ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి అధ్యాయం 
» చివరి నిమిషం వరకు పోరాడిన మహిళలు, కార్యకర్తలకు సెల్యూట్‌  
సాక్షి, అమరావతి: పట్టపగలే ఎన్నికల్లో రిగ్గింగ్, పోలింగ్‌ ఏజెంట్లను అడ్డుకోవడం, వారిని బలవంతంగా బయటకు లాగేయడం, ఓటర్లను బహిరంగంగా బెదిరించడం, ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుకోవడం.. ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే జరగడం అత్యంత దారుణం అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. పులివెందుల మున్సిపల్‌ (యూఎల్‌బీ) ఎన్నికల్లో మొత్తం 80 పోలింగ్‌ కేంద్రాలకు గాను 70 కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ పోలింగ్‌ ఏజెంట్లను లోపలికి అనుమతించలేదని, మరి అలాంటప్పుడు ఓటర్లను గుర్తించేది ఎవరని ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. 

‘పారదర్శకంగా ఎన్నికలు జరిగితే గెలవలేమనే భయంతోనే వెన్నుపోటు పార్టీ దౌర్జన్యాలకు పాల్పడింది. నా సొంత నియోజకవర్గమైన పులివెందులలోనే కాకుండా కడప, అనంతపురం, తిరుపతి, కర్నూలు, చిత్తూరు, ఒంగోలు, గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నం (జీవీఎంసీ), విజయవాడ, మాచర్ల, చిలకలూరిపేట, వినుకొండ, జమ్మలమడుగు, నంద్యాల, చీమకుర్తి, ఎమ్మిగనూరు, సూళ్లూరుపేట, పలాస, నాయుడుపేట, నందిగామ, జగ్గయ్యపేట, కుప్పం, పుత్తూరు, భీమునిపట్నం, పార్వతీపురం తదితర మున్సిపాలిటీల (యూఎల్‌బీ) పోలింగ్‌లో ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. 

చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వ్యవస్థ అత్యంత దారుణంగా మారింది. ఈ వ్యవస్థ ఆందోళనకరంగా కుప్పకూలుతోంది. ఇంకా చెప్పాలంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ పూర్తిగా హైజాక్‌కు గురయ్యాయి. ఇవి ఇక ఎన్నికలు కావు.. మీకు (చంద్రబాబు) నచ్చిన వారిని మీరే ఎంపిక చేసుకునే ప్రక్రియ మాత్రమే. ఇది ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి. ప్రజల తీర్పును తారుమారు చేసేందుకు బరి తెగించి చేస్తున్న ప్రయత్నం. ఇది ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి అధ్యాయం. హే రామ్‌.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చివరి నిమిషం వరకు వెనక్కు తగ్గకుండా, ధైర్యంగా నిలబడి పోరాడిన మహిళలను, పార్టీ కోసం అంకిత భావంతో పని చేసిన కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వారి ధైర్యసాహసాలకు సెల్యూట్‌ చేస్తున్నాను’ అని వైఎస్‌ జగన్‌ ఆ పోస్టులో పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement