మొన్న ఆగస్టులో ఐఏఎస్ అధికారి దివ్య మిట్టల్ రాజీనామా
2014 నుంచి ఉద్యోగాలను వీడిన 88 మంది సివిల్ సర్వెంట్స్
స్వతంత్ర అధికారుల కంటే తమకు అనుకూలంగా ఉండే అధికారులనే కోరుకుంటున్న రాజకీయ నాయకత్వాలు..
ప్రభుత్వానికి విధేయులుగా ఉండలేకా, రాజ్యాంగానికి కట్టుబడలేకా..? లేక కార్పొరేట్ కెరీర్ కోసమా..
సివిల్ సర్వీసెస్ అధికారుల రాజీనామాలు లెవనెత్తుతున్నసందేహాలపై నడుస్తున్న తాజా చర్చ
అది 1947 ఏప్రిల్ 21...అప్పటి తాత్కాలిక ప్రభుత్వంలో మొదటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కొత్తగా విధుల్లో చేరిన పరిపాలనా అధికారులు (సివిల్ సర్వీసెస్)ను ఉద్దేశించి దేశాన్ని ఐక్యంగా ఉంచడంలో, నడపడంలో ఆ అధికారుల పాత్రను కొనియాడుతూ వారిని ‘స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా (భారత ఉక్కు చట్రం)గా అని అభివర్ణించారు. దేశంలో ప్రభుత్వాలు మారినా, రాజకీయ పరిస్థితులు మారినా... ‘మారకుండా దేశ పరిపాలనా వ్యవస్థను బలంగా నిలబెట్టే వెన్నెముక’ లాంటిది ఈ సివిల్ సర్వీసెస్ వ్యవస్థ అని భావం వచ్చేలా ఆయన చేసిన ప్రసంగం అప్పటి అధికారులకు కర్తవ్యాన్ని బోధపరిచింది.
ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన 2013 బ్యాచ్ మహిళా ఐఏఎస్ అధికారి దివ్య మిట్టల్ మొన్న ఈ మధ్యనే తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆమె తన 13 ఏళ్ల ఉద్యోగ జీవితాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్టు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లు పేర్కొన్నా, స్థానిక రాజకీయ ప్రమేయాన్ని పట్టించుకోకుండా నిబంధనల ప్రకారం పనిచేయడంతో ఆమె ఒత్తిళ్లను ఎదుర్కొన్నారని తెలుస్తోంది.
సాక్షి, అమరావతి: లక్షలాది మంది యువత కలలుగనే ఐఏఎస్, ఐపీఎస్ హోదాలు.. సమాజంలో గొప్ప గౌరవం, అధికారం, హోదా.. అలాంటి అత్యున్నత సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలను సాధించడం ఎంత కష్టమో, సర్వీసు మధ్యలోనే వదులుకోవడం అంతకంటే సంచలనం. యూపీ ఐఏఎస్ అధికారి దివ్య మిట్టల్ రాజీనామా సంచలనం కలిగించిగా, 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏపీకి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్‌ప్రకాశ్ కూడా రాజీనామా చేశారు.
వాస్తవంగా 2014 తర్వాత ఈ తరహా రాజీనామాలు మరింత పెరిగాయి. ఇప్పటి వరకు దాదాపు 88 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, ఐఆర్‌ఎస్ వంటి ఉన్నతాధికారులు తమ సర్వీసులను మధ్యలోనే వదులుకున్నారు. వీరంతా రాజకీయ ఒత్తిళ్లతోనే బయటకు వస్తున్నారా, లేక మారుతున్న కాలానికి అనుగుణంగా కెరీర్ బాటలు మార్చుకుంటున్నారా? అనేది తీవ్ర చర్చకు దారితీసింది.
రాజకీయ వేధింపులే కారణమా?
తమ పదవులకు రాజీనామా చేసిన ఉన్నతాధికారులంతా వ్యక్తిగత కారణం అని చెబుతున్నా బ్యూరోక్రసీలో మితిమీరిన రాజకీయ జోక్యం, నిబంధనలకు వ్యతిరేకంగా పనులు చేయాలనే ఒత్తిళ్లు ప్రధానంగా ఉన్నాయంటున్నారు నిపుణులు. రాజకీయనేతలు చెప్పినట్టు చేయకుంటే బదిలీలు, పోస్టింగ్ ఇవ్వకపోవడం లేదా అప్రాధాన్య పోస్టుల్లో నియమించడం వంటి కారణలతో 25 శాతం మంది పోస్టులు వదులుకుంటున్నారు. 2019లో జమ్మూ–కశ్మీర్‌లో ఆంక్షలు, భావ ప్రకటనా స్వేచ్ఛ హరణకు నిరసనగా కన్నన్ గోపీనాథన్ రాజీనామా చేశారు. అదే ఏడాది కర్ణాటకకు చెందిన ఎస్.శశికాంత్ సెంథిల్ ప్రజాస్వామ్య మూలస్తంభాలు ప్రమాదంలో పడ్డాయని హెచ్చరిస్తూ బయటకు వచ్చారు.
నిజాయతీగా పనిచేసే ఐఏఎస్‌లను ప్రాధాన్యత లేని పోస్టులకు బదిలీ చేయడం తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి. ఇలా రాజీనామా చేసిన తమిళనాడు ఐపీఎస్ అధికారి కె.అన్నామలై, ఐఏఎస్ అధికారి శశికాంత్ సెంథిల్, ఒడిశాలో అధికార యంత్రాంగాన్ని ప్రభావితం చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి వీకే పాండియన్ వంటివారు ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చారు. సుదీర్ఘ పని గంటలు, కుటుంబ బాధ్యతలు, భార్యాభర్తలు వేర్వేరు రాష్ట్ర కేడర్లలో ఉండటం వంటి సమస్యలు, సొంతంగా సివిల్స్ కోచింగ్ అకాడమీలు, సామాజిక స్టార్టప్‌లను స్థాపించే లక్ష్యంతో 10 నుంచి 15 శాతం మంది అధికారులు సర్వీసును వీడుతున్నారు. మరో వైపు కార్పొరేట్ రంగం అందించే భారీ ప్యాకేజీలు, అంతర్జాతీయ కెరీర్ కోసం 40/50 శాతం మంది ఐఆర్‌ఎస్, ఐఎఫ్‌ఎస్‌లు రాజీనామాలు చేస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.
2014 తర్వాత 88 మంది రాజీనామా
కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, పార్లమెంటరీ నివేదికల గణాంకాల ప్రకారం 2014 నుంచి దాదాపు 88 మంది కేంద్ర సర్వీసు అధికారులు తమ ఉన్నత ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఇందులో 22 మంది ఐఏఎస్‌లు, 18 మంది ఐపీఎస్‌లు, 32 మంది ఐఆర్‌ఎస్‌లు, ఆరుగురు ఐఎఫ్‌ఎస్ అధికారులు ఉన్నారు. వీరంతా కేవలం 5 నుంచి 15 ఏళ్ల లోపు సర్వీసు ఉన్న వారే. ప్రభుత్వానికి విధేయులుగా ఉండటమా? లేక రాజ్యాంగానికి జవాబుదారీగా ఉండటమా? అనే సంక్షోభంలో భారత ఉక్కు చట్రం ఉందని సీనియర్లు చెబుతున్నారు. రాజకీయ నాయకత్వాలు చట్ట ప్రకారం నడిచే స్వతంత్ర అధికారుల కంటే తమ ఆదేశాలను ప్రశ్నించకుండా అమలు చేసే అనుకూల అధికారులనే కోరుకుంటున్నాయి. ఫలితంగా రాజీ పడలేని అధికారులు వ్యవస్థను వీడుతున్నట్టు తెలుస్తోంది.
నాడు అవినీతిపైన.. నేడు ప్రభుత్వ తీరుపైన..
భారతదేశ పరిపాలనా చరిత్రలో రాజీనామాలు కొత్త కాకున్నా 2014కు ముందు, ఆ తర్వాత పరిణామాల్లో గుణాత్మక మార్పు కనిపిస్తుందంటున్నారు రిటైర్డ్ అధికారులు. 2014కు ముందు అధికారులు వ్యవస్థలోని అవినీతి కారణంగా, లేదా సంస్కరణల కోసం రాజీనామా చేశారు. 1975లో అరుణారాయ్ పేదల హక్కుల కోసం రాజీనామా చేసి సమాచార హక్కు చట్టం సాధనకు కారణమయ్యారు. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో యంత్రాంగం వైఫల్యానికి నిరసనగా హర్‡్ష మందర్ వైదొలిగారు. 2014 తర్వాత జాతీయ భద్రత, ఆర్టికల్ 370, రాజ్యాంగ సంస్థల స్వయంప్రతిపత్తి, భావ ప్రకటనా స్వేచ్ఛ వంటి సిద్ధాంతపరమైన నిర్ణయాలపై కేంద్ర ప్రభుత్వ విధానాలతో విభేదించి బహిరంగంగా నిరసన తెలిపే ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది.


