breaking news
Divya Mittal
-
సస్పెన్స్‌కు తెర దించిన మాజీ ఐఏఎస్ దివ్య
ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా.. రాజకీయాల్లోకి వస్తున్నారన్న ప్రచారం.. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల నుంచి ఆహ్వానాలంటూ చర్చ.. రాహుల్ గాంధీతో రహస్య భేటీ జరిగిందంటూ మరో ప్రచారం! మాజీ ఐఏఎస్ అధికారి దివ్యా మిట్టల్ రాజకీయ అడుగులపై గత కొన్ని రోజులుగా ఉత్తరప్రదేశ్‌లో ఆసక్తికర చర్చ నడిచింది. ఆమె ఏ పార్టీలో చేరతారన్న ఉత్కంఠకు తాజాగా తెరపడింది. ప్రధాన పార్టీల అంచనాలకు భిన్నంగా తన రాజకీయ ప్రస్థానంపై ఆమె కీలక ప్రకటన చేశారు.13 ఏళ్ల సివిల్ సర్వీసు కెరీర్‌కు స్వస్తి చెప్పిన దివ్యా మిట్టల్(42).. గురువారం తన రాజకీయ పార్టీని ప్రకటించారు. వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. రాజకీయాల్లోకి వస్తానని గతంలోనే ప్రకటించిన ఆమె.. ఏదో ఒక పార్టీతో కలిసి పనిచేయడం కంటే ప్రజలతో నేరుగా మమేకమై రాజకీయాలు చేయాలన్న తన ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు సిద్ధమయ్యారు.సొంత పార్టీతో రాజకీయాల్లోకి..తన పార్టీకి ‘జన్ నీతి భారత్ పార్టీ’ అని పేరు పెట్టినట్లు దివ్యా మిట్టల్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ప్రజలే విధానాల రూపకల్పనలో కీలకంగా ఉండాలని, ఎన్నికల సమయంలోనే కాకుండా ఐదేళ్ల పాలనలోనూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉండాలని ఆమె పేర్కొన్నారు. కులం, మతం వంటి గుర్తింపుల కంటే ప్రజల అవసరాలకు ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు. ప్రతి ప్రభుత్వ పనికి ప్రజలకు జవాబు చెప్పాల్సిందేనని పేర్కొంటూ మూడు ప్రధాన సూత్రాలను వివరించారు.मेरा राजनीतिक सफर का अगला कदम। मेरे साथ जुड़ें 🙏🙏 https://t.co/c9ihA3dxOB— Divya Mittal (@divyamittal_IAS) October 15, 2026రాహుల్‌తో భేటీ ఉత్తదేదివ్యా మిట్టల్ రాజకీయ ప్రవేశంపై చర్చ జరుగుతున్న సమయంలో బీజేపీ నేత ప్రశాంత్ ఉమ్రావ్ చేసిన సోషల్ మీడియా పోస్టు మరింత ఆసక్తి రేకెత్తించింది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో దివ్యా మిట్టల్ రహస్యంగా సమావేశమయ్యారంటూ ఆయన ఆరోపించారు. దీంతో ఆమె కాంగ్రెస్‌లో చేరబోతున్నారన్న ప్రచారం మొదలైంది. అయితే, ఈ ఆరోపణలను దివ్యా మిట్టల్ ఖండించారు. సెప్టెంబర్ 29న విడుదల చేసిన వీడియోలో తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోనని, ప్రజలతో కలిసి పనిచేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.అఖిలేశ్ వ్యాఖ్యలతోనూ చర్చ..దివ్యా మిట్టల్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు దారితీశాయి. ఆమె ఎస్పీలో చేరితే స్వాగతిస్తామనే సంకేతంగా ఆయన వ్యాఖ్యలను పలువురు విశ్లేషించారు. మరోవైపు కాంగ్రెస్‌లో చేరతారన్న ప్రచారం కూడా సాగింది. అయితే, ఈ ఊహాగానాల మధ్య దివ్యా మిట్టల్ సొంత పార్టీ ప్రకటన చేయడంతో ఆమె రాజకీయ ప్రయాణంపై స్పష్టత వచ్చింది.వ్యవస్థలోని లోపాలే రాజకీయాలకు కారణమా?ప్రభుత్వ వ్యవస్థలో పనిచేసినప్పుడు ఎదురైన అనుభవాలే రాజకీయాల్లోకి రావాలన్న నిర్ణయానికి కారణమని దివ్యా మిట్టల్ గతంలో వివరించారు. మంజూరైనప్పటికీ నిర్మాణం కాని పాఠశాలలు, లబ్ధిదారులకు అందని భూములు, అధ్వాన్న రహదారులు, పేపర్ లీకేజీలతో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావించారు. ప్రభుత్వ నిర్ణయాలు కాగితాలకే పరిమితం కాకుండా ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడమే తన రాజకీయ లక్ష్యమని చెప్పారు.ఐఐటీ.. ఐఐఎం నుంచి ఐఏఎస్ వరకుహరియాణాలోని రేవారీకి చెందిన దివ్యా మిట్టల్.. ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం బెంగళూరులో చదువుకున్నారు. అనంతరం లండన్‌లో పనిచేసి, 2013లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో 68వ ర్యాంకు సాధించారు. ఉత్తరప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఆమె సంత్ కబీర్ నగర్, మిర్జాపూర్, డియోరియా జిల్లాలకు జిల్లా మేజిస్ట్రేట్‌గా సేవలందించారు. మిర్జాపూర్‌లోని మారుమూల గ్రామాలకు కుళాయి ద్వారా తాగునీరు అందించే కార్యక్రమంతో గుర్తింపు పొందారు. ఆగస్టు 30న ఐఏఎస్ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణకు నిర్ణయం తీసుకున్న ఆమె.. తాజాగా సొంత పార్టీతో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2027 యూపీ ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్నది మాత్రం ఇంకా వెల్లడించలేదు.ఇదీ చదవండి: ఈసీపై ప్రశాంత్ కిషోర్ సంచలన ఆరోపణలు -
మాజీ ఐఏఎస్ దివ్య పొలిటికల్ ఎంట్రీ.. బిగ్ సస్పెన్స్!
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లోకి మరో మాజీ ఐఏఎస్ అధికారి అడుగుపెట్టబోతున్నారు. 13 ఏళ్లపాటు సివిల్ సర్వీసుల్లో పనిచేసి రాజీనామా చేసిన దివ్య మిట్టల్.. తన రాజకీయ ప్రయాణంపై అక్టోబర్ 15న కీలక ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్లో ప్రజలను కలుస్తూ, స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఆమె.. 2027 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎలాంటి రాజకీయ వ్యూహంతో ముందుకు వెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది.జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన మీర్జాపూర్ నుంచే దివ్య మిట్టల్ తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. నవరాత్రి సందర్భంగా ఆమె జిల్లాలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. ఆమెకు మద్దతుదారులు పూలతో స్వాగతం పలుకుతూ ‘దివ్య దీదీ జిందాబాద్’ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇదే సమయంలో అక్టోబర్ 15న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా మీర్జాపూర్లో పర్యటించనుండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, యోగీ పర్యటనకు పోటీగా తాను ప్రకటన చేయనున్నట్లు దివ్య మిట్టల్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కాగా, తన రాజకీయ ప్రయాణంలో తీసుకునే ప్రతి అడుగును ప్రజలకు బహిరంగంగానే వెల్లడిస్తానని దివ్య మిట్టల్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే, ప్రస్తుతం ఉన్న ఏ రాజకీయ పార్టీలోనూ చేరే ఉద్దేశం లేదని ఆమె ప్రకటించడం గమనార్హం. దీంతో ఆమె సొంతంగా రాజకీయ వేదికను ఏర్పాటు చేస్తారా? లేక మరో మార్గంలో ప్రజా జీవితంలో కొనసాగుతారా? అన్న చర్చ మొదలైంది.మరోవైపు.. దివ్య మిట్టల్ రాజకీయాల్లోకి వస్తున్నారన్న వార్తపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ గతంలోనే స్పందించారు. ఆమె సమాజ్‌వాదీ పార్టీకి సంబంధించిన కండువా ధరిస్తారా? లేక మరేదైనా ఎంచుకుంటారా? అన్న అర్థంలో వ్యాఖ్యానించారు. అయితే, ఆమెకు టికెట్ లేదా నియోజకవర్గాన్ని కేటాయించే అంశంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు, ప్రజల కోసం పనిచేయాలనుకునే మహిళలకు కాంగ్రెస్ ఎప్పుడూ స్వాగతం పలుకుతుందని యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ తెలిపారు. జనసత్తా దళ్ (లోక్తాంత్రిక్) సహా మరికొన్ని పార్టీలు కూడా ఆమె రాజకీయ ప్రవేశంపై ఆసక్తి వ్యక్తం చేశాయి.ఎవరీ దివ్య మిట్టల్?2013 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి దివ్య మిట్టల్.. ఆగస్టు 30న తన పదవికి రాజీనామా చేశారు. సెప్టెంబర్ 29న రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌నే తన కర్మభూమిగా అభివర్ణించిన ఆమె.. అక్కడి నుంచే కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తానని వెల్లడించారు. ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం బెంగళూరులో విద్యనభ్యసించిన దివ్య మిత్తల్.. సివిల్ సర్వీసుల్లోకి రాకముందు లండన్‌లో పనిచేశారు. తొలుత ఐపీఎస్‌కు ఎంపికైన ఆమె, అనంతరం ఐఏఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. మీర్జాపూర్తోపాటు డియోరియా, సంత్ కబీర్ నగర్ జిల్లాలకు జిల్లా మేజిస్ట్రేట్‌గా పనిచేశారు.ప్రస్తుతం అందరి దృష్టి అక్టోబర్ 15న ఆమె చేయనున్న ప్రకటనపైనే ఉంది. రాజకీయాల్లోకి రావాలన్న నిర్ణయం తీసుకున్న దివ్య మిట్టల్.. తనకంటూ ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసుకుంటారా? 2027 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా? అన్న ప్రశ్నలకు ఆమె అధికారిక ప్రకటనతోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.ఇదీ చదవండి: అఖిలేష్‌కు బిగ్ షాక్.. ముగ్గురు ఎస్పీ ఎమ్మెల్యేలు జంప్! -
రాహుల్ గాంధీతో మాజీ ఐఏఎస్ రహస్య భేటీ?
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఐఏఎస్ అధికారి దివ్యా మిట్టల్ పేరు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. పదమూడేళ్ల సర్వీసు తర్వాత హఠాత్తుగా ఐఏఎస్‌కు రాజీనామా చేసిన ఆమె.. రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారం ఊపందుకుంది. వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. జెన్‌జీ ఉద్యమ ప్రభావం కూడా రాజకీయ పార్టీలను కొత్త ముఖాల వైపు చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో దివ్యా మిట్టల్‌ను తమవైపు తిప్పుకునేందుకు పలు పార్టీలు ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే.. రాజకీయ ప్రవేశంపై దివ్యా మిట్టల్ మాత్రం ముందుగానే ఓ స్పష్టమైన నిర్ణయంతో ఉన్నట్లు తాజాగా ఆమె వ్యాఖ్యలతో తేలింది.తాజాగా బీజేపీ నేత ప్రశాంత్ ఉమ్రావ్ చేసిన సోషల్ మీడియా పోస్టు.. యూపీ రాజకీయాలను కుదిపేసింది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్(43) రహస్యంగా కలిశారని అన్నారాయన. ‘‘చీకటి మాటున భేటీ’’ అంటూ చేసిన సంచలన ఆరోపణతో చేసిన ఈ పోస్టుతో.. ఆమె కాంగ్రెస్‌లో చేరబోతున్నారనే చర్చ మొదలైంది. ఇదే సమయంలో.. యువతలో మంచి క్రేజ్ ఉన్న ఆమెను ప్రత్యక్షంగానే సమాజ్‌వాదీ పార్టీ ఆహ్వానించడం, అదే సమయంలో కాంగ్రెస్‌తో ఆ పార్టీకి జరుగుతున్న సీట్ల పంపకం పంచాయితీ, రాహుల్‌ను ఆమె కలిశారన్న ప్రచారం ఈ ఎపిసోడ్‌ను మలుపుల మీద మలుపులు తిప్పుతోంది. దివ్యకు అఖిలేశ్ ఆహ్వానందివ్యా మిట్టల్ రాజకీయ ప్రవేశం నేపథ్యంలో ఎస్పీ–కాంగ్రెస్ సీట్ల పంచాయితీకి కూడా ఈ వ్యవహారం ముడిపడింది. కాంగ్రెస్ 150 సీట్లలో పోటీ చేయాలని చెబుతుండగా.. ఎస్పీ 350 స్థానాల్లో సన్నాహాలు చేస్తోందన్న వార్తలు వచ్చాయి. ఇక దివ్యా మిట్టల్ విషయంలో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు మరో చర్చకు దారితీశాయి. ఆమె రాజకీయాల్లోకి వస్తున్న విషయంపై స్పందిస్తూ.. ‘‘హరా ఔర్ లాల్ గమ్ఛా డాల్ లేన్’’ అంటూ ఎస్పీ పార్టీ రంగులను సూచించేలా వ్యాఖ్యానించారు. ఆమె ఎస్పీలో చేరితే స్వాగతిస్తామన్న సంకేతంగా ఈ వ్యాఖ్యను తీసుకున్నారు. ఏం జరిగిందో చెప్పిన దివ్యా మిట్టల్..రాహుల్ గాంధీతో రహస్య భేటీ అంటూ వచ్చిన ప్రచారంపై దివ్యా మిట్టల్ సుమారు తొమ్మిది నిమిషాల వీడియో విడుదల చేసి స్పందించారు. ఆ ప్రచారాన్ని ఖండిస్తూ.. తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత ఇచ్చారు. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ధృవీకరించిన ఆమె.. ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోనని స్పష్టం చేశారు. యూపీ నుంచే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమవుతుందని, అది ఏ పార్టీ జెండా కింద ఉండదని తెలిపారు. పార్టీతో కాదు.. ప్రజలతో కలిసి రాజకీయాలు అనేదే తన విధానమని చెప్పారు. ‘‘గత నెల ఐఏఎస్‌కు రాజీనామా చేశాను. ఎన్నో ప్రశ్నలను వదిలి వచ్చాను. తర్వాత ఏంటి? అనే ప్రశ్నకు సమాధానం.. రాజకీయాలు’’ అని ఆమె అన్నారు. ఉత్తరప్రదేశ్ తన కర్మభూమి అని, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పని చేయాలనుకుంటున్నట్లు తెలిపారు.ప్రజల గొంతుకగా..ప్రభుత్వ నిర్ణయాలు తీసుకున్నా.. వాటి అమలు జరగని సందర్భాలు తనను రాజకీయాల వైపు నడిపించాయని దివ్యా మిట్టల్ చెప్పారు. మంజూరైన పాఠశాలలు నిర్మాణానికి నోచుకోకపోవడం, భూములు కేటాయించినా లబ్ధిదారులకు అందకపోవడం, అధ్వాన్న రహదారులు, పేపర్ లీక్‌లతో విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినడం వంటి అంశాలను ప్రస్తావించారు. మిర్జాపూర్ జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు లహురియా దహ్ గ్రామంలో ఓ మహిళ.. ఇల్లు, పింఛన్ కాకుండా పిల్లల కోసం పాఠశాల కావాలని కోరిన ఘటనను గుర్తుచేశారు. నిధులు, నిబంధనలు, అనుమతులు ఉన్నప్పటికీ మూడేళ్లు గడిచినా నిర్మాణం ప్రారంభం కాలేదన్నారు. ‘‘అన్నీ ఉన్నాయి.. కానీ ఉద్దేశం లేదు’’ అంటూ వ్యవస్థలో నిర్ణయం, అమలు మధ్య ఉన్న అంతరాన్ని వివరించారు.कुछ दिन पहले IAS से त्यागपत्र दिया था और आपके मन में कई सवाल छोड़ दिए थे। अपनी बात इस वीडियो में कह दी है। अगर आपको लगे कि ये आपकी भी बात है, तो 9198956957 पर whatsapp मैसेज करिए। pic.twitter.com/mtS6gzBzRw— Divya Mittal (@divyamittal_IAS) September 29, 2026ఐఐటీ–ఐఐఎం చదువు.. లండన్‌లో ఉద్యోగందివ్యా మిట్టల్ 2013 బ్యాచ్ యూపీ కేడర్ ఐఏఎస్ అధికారి. ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం బెంగళూరులో చదువుకున్నారు. సివిల్ సర్వీసెస్‌లోకి రాకముందు లండన్‌లో ఎక్సోటిక్ డెరివేటివ్స్ ట్రేడర్‌గా పనిచేశారు. సంత్‌కబీర్‌నగర్, మిర్జాపూర్, డియోరియా జిల్లాల కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. మిర్జాపూర్ కలెక్టర్‌గా మారుమూల లహురియా దహ్ గ్రామానికి పైపుల ద్వారా తాగునీరు అందించే కార్యక్రమంతో గుర్తింపు పొందారు. గోండా సీడీవో, యూపీ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ జాయింట్ ఎండీ, బరేలీ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. తర్వాత యూపీ రూరల్ రోడ్ డెవలప్మెంట్ ఏజెన్సీ సీఈవోగా బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా ఆగస్టులో ఐఏఎస్‌కు రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. తీవ్ర చర్చనీయాంశంగా మారారు.ఇదీ చదవండి: లండన్ పరీక్ష నుంచి భారతీయుల పోరాటం దాకా.. -
మౌనం వీడిన దివ్యా మిట్టల్.. మాజీ ఐఏఎస్ అధికారి సంచలన నిర్ణయం!
లక్నో: ఉత్తరప్రదేశ్ క్యాడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి దివ్యా మిట్టల్ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించారు. అయితే తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోనని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలు, వారి ప్రశ్నలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజలతో కలిసి కొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌ను తన కర్మభూమిగా పేర్కొంటూ.. అక్కడి నుంచే తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించనున్నట్లు వీడియో సందేశంలో వెల్లడించారు.2013 బ్యాచ్‌కు చెందిన దివ్యా మిట్టల్ 2026, ఆగస్టు 30న తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత, కుటుంబ కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆమె రాజీనామాను ఆమోదించడంతో సెప్టెంబర్ 15 నుంచి అది అమల్లోకి వచ్చింది. అనంతరం ఆమె ఏమి చేయబోతున్నారనే దానిపై సస్పెన్స్ వీడింది. రాజకీయాలు తనకు పదవి కోసం మార్గం కాదని దివ్యా మిట్టల్ తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల వరకు తమ సమస్యలను తీసుకెళ్లలేని, తీసుకెళ్లినా వినిపించని ప్రజల తరఫున గొంతుకగా నిలవాలనుకుంటున్నట్లు చెప్పారు.మిర్జాపూర్‌లోని లహురియాదహ్ ప్రాంతంలో ఓ మహిళను కలిసిన సందర్భాన్ని ఆమె గుర్తుచేశారు. ఐదో తరగతి తర్వాత పిల్లల చదువుకు ఇబ్బందులు ఎదురవుతున్నందున గ్రామంలో తదుపరి తరగతి పాఠశాలను ప్రారంభించాలని ఆ మహిళ కోరినట్లు తెలిపారు. పాఠశాలకు అనుమతి వచ్చినప్పటికీ మూడేళ్ల తర్వాత కూడా నిర్మాణం ప్రారంభం కాలేదని పేర్కొన్నారు. సమస్య వనరుల కొరత కాదని.. సంకల్పం లేకపోవడమేనని వ్యాఖ్యానించారు. ప్రత్యేక కార్యదర్శి రెవెన్యూ హోదాలో ఉన్న సమయంలో ఓ వ్యక్తి ప్రభుత్వ భూమి పట్టాకు సంబంధించిన పత్రాలను తీసుకుని తనను కలిశారని దివ్యా మిట్టల్ తెలిపారు. పట్టా లభించినా భూమిపై వాస్తవ స్వాధీనం కల్పించలేదని చెప్పారు. సంబంధిత నివేదికలో అవకతవకలు గుర్తించి చర్యలు తీసుకున్నట్లు వివరించారు.యువత ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఆమె ప్రస్తావించారు. పోటీ పరీక్షలకు ఏళ్ల తరబడి సిద్ధమయ్యే విద్యార్థులకు పేపర్ లీక్ ఘటనలు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని అన్నారు. అదే సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో అనేక ఉద్యోగాల స్వరూపం మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇద్దరు కుమార్తెల తల్లిగా భవిష్యత్ తరాలపై తనకు ప్రత్యేక శ్రద్ధ ఉందన్నారు. ఏ ఒక్క రాజకీయ నాయకుడిని మార్చడం తన లక్ష్యం కాదని, రాజకీయాల్లోనే మార్పు రావాలని దివ్యా మిట్టల్ అన్నారు.దివ్యా మిట్టల్ ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం బెంగళూరులో విద్యాభ్యాసం చేశారు. అనంతరం లండన్‌లో ఉద్యోగం చేసిన ఆమె భారత్‌కు తిరిగి వచ్చి యూపీఎస్సీకి సిద్ధమై ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. మిర్జాపూర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో గ్రామాలకు పైపుల ద్వారా నీటిని అందించే కార్యక్రమంతో ఆమె గుర్తింపు పొందారు. ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వివిధ పరిపాలనా బాధ్యతలు నిర్వహించారు. ఆమె రాజీనామా అనంతరం కాంగ్రెస్ నేత అజయ్ రాయ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ స్పందించినప్పటికీ.. దివ్యా మిట్టల్ మాత్రం తన రాజీనామా ఆలోచించి తీసుకున్న నిర్ణయమని అప్పట్లో తెలిపారు.ఇదీ చదవండి: దుబాయ్‌లో గుండె జబ్బులు.. భారతీయులే అధికం! -
ఆ ఇద్దరు ఐఏఎస్‌లదీ ఒకే కథ!
సివిల్స్‌లో విజయం సాధారణమేమీ కాదు. మన దేశంలో ఎంతోమంది యువతకు అదొక కల. అందుకోసం ఏళ్ల తరబడి కష్టపడుతుంటారు కూడా. కానీ ఆ ప్రతిష్ఠాత్మక ఉద్యోగాన్ని సాధించిన తర్వాత కూడా.. అదే కెరీర్లో జీవితాంతం కొనసాగాలని లేదనుకుంటే?. రోమన్ సైనీ, దివ్యా మిట్టల్ ప్రయాణాలే దీనికి ఆసక్తికరమైన సమాధానం. ఇద్దరూ తమకు దక్కిన అవకాశాన్ని వదులుకుని.. తమకు నచ్చిన దారిని ఎంచుకున్నారు.రోమన్ సైనీ 2013లో UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో 18వ ర్యాంక్ సాధించి IASలోకి అడుగుపెట్టారు. మరోవైపు దివ్యా మిట్టల్ 2012 UPSC పరీక్షలో 68వ ర్యాంక్ సాధించి IASకు ఎంపికయ్యారు. ఆమె 2013 బ్యాచ్ అధికారిణిగా సర్వీసులో చేరారు. ఒకరు ఐఏఎస్‌లో చేరిన 20 నెలల్లోనే బయటకు వచ్చి స్టార్టప్ ప్రపంచంలోకి వెళ్లగా.. మరొకరు 13 ఏళ్ల సుదీర్ఘ సేవ అనంతరం తాజాగా రాజీనామా చేశారు. ఇద్దరి నిర్ణయాల వెనుక దారులు వేరు.. కానీ లక్ష్యం మాత్రం తమకు నచ్చిన జీవితాన్ని ఎంచుకోవడమే. ఒకరు ప్రభుత్వ ఉద్యోగం కంటే వ్యాపారాన్ని ఎంచుకుంటే.. మరొకరు సుదీర్ఘ ప్రజాసేవ తర్వాత కొత్త అధ్యాయం వైపు అడుగులు వేశారు. ఇప్పుడు ఈ ఇద్దరి ప్రయాణాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి.ఇందులో రోమన్ సైనీ ప్రయాణం చాలా ప్రత్యేకం. 16 ఏళ్లకే ఎయిమ్స్ ప్రవేశ పరీక్షలో విజయం సాధించి వైద్య విద్య పూర్తి చేసిన ఆయన.. 2013లో యూపీఎస్సీ సివిల్స్‌లో ఆల్ ఇండియా 18వ ర్యాంక్ సాధించారు. కేవలం 22 ఏళ్ల వయసులో ఐఏఎస్ అయ్యారు. అయితే ప్రతిష్ఠాత్మకమైన సివిల్ సర్వీస్‌లో ఆయన కెరీర్ రెండేళ్లు కూడా కొనసాగలేదు. లాల్‌బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (LBSNAA)లో ఉన్న సమయంలో గౌరవ్ ముంజాల్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఐఏఎస్‌ను వీడి ముంజాల్‌తో కలిసి యూన్‌అకాడమీ నిర్మాణంలో భాగమయ్యారు.ఐఏఎస్ నుంచి ఎడ్టెక్ వైపు..2015లో ప్రారంభమైన యూన్ అకాడమీకి రోమన్ సైనీ సహ వ్యవస్థాపకుడిగా వ్యవహరించారు. ఆన్లైన్ విద్య అంతగా విస్తరించని సమయంలో తీసుకున్న ఈ నిర్ణయం పెద్ద సాహసమే. అయితే కొవిడ్ సమయంలో యూన్ అకాడమీ భారీ స్థాయిలో విస్తరించింది. నెలకు లక్షకు పైగా లైవ్ క్లాసులు, దాదాపు 10 లక్షల మంది చెల్లింపు సబ్స్క్రైబర్లు ఉన్న దశను సంస్థ చూసింది. తాజాగా యూన్ అకాడమీని అప్‌గ్రాడ్ 200 మిలియన్ డాలర్లకు పైగా విలువైన ఆల్-స్టాక్ డీల్‌లో కొనుగోలు చేసింది. ఈ పరిణామంతో సైనీ ఐఏఎస్‌ను వదిలి నిర్మించిన అధ్యాయం మరో మలుపు తిరిగింది.13 ఏళ్ల తర్వాత దివ్యా మిట్టల్ రాజీనామారోమన్ సైనీకి పూర్తి భిన్నంగా దివ్యా మిట్టల్ ఐఏఎస్‌లో సుదీర్ఘ ప్రయాణం సాగించారు. ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం బెంగళూరులో చదువుకున్న ఆమె.. లండన్‌లో ఉద్యోగం చేసిన తర్వాత భారత్‌కు తిరిగి వచ్చి సివిల్ సర్వీసెస్‌లో చేరారు. 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో పనిచేశారు. దేవరియా, మిర్జాపూర్, సంత్‌కబీర్ నగర్ వంటి జిల్లాల్లో జిల్లా మేజిస్ట్రేట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.మీర్జాపూర్‌లోని ఓ మారుమూల కొండ గ్రామానికి పైపుల ద్వారా తాగునీరు అందించడంలో ఆమె కీలకంగా వ్యవహరించారు. దశాబ్దాలుగా నీటి కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలకు తాగునీరు అందించడం ఆమె సేవా కాలంలోని గుర్తుండిపోయే పనుల్లో ఒకటిగా నిలిచింది.2026లో ఈ ఇద్దరి కెరీర్ ప్రయాణాలు మరోసారి ఆసక్తికరమైన మలుపు తీసుకున్నాయి. యూపీఎస్సీ 2013 బ్యాచ్‌కు చెందిన రోమన్ సైనీ అప్పటికే ఐఏఎస్‌ను వదిలి వ్యాపార రంగంలోకి వెళ్లారు. సరిగ్గా 13 ఏళ్ల తర్వాత ఆయన సహ వ్యవస్థాపకుడిగా నిర్మించిన యూన్‌అకాడమీ మరో చేతుల్లోకి వెళ్లింది. రోనీ స్క్రూవాలా నేతృత్వంలోని ఎడ్టెక్ సంస్థ అప్‌గ్రాడ్, యూన్అకాడమీని 200 మిలియన్ డాలర్లకు పైగా విలువైన ఆల్-స్టాక్ డీల్‌లో సొంతం చేసుకుంది. ఒకప్పుడు 3.44 బిలియన్ డాలర్ల గరిష్ఠ విలువను అందుకున్న యూన్‌అకాడమీ.. ఇప్పుడు దానితో పోలిస్తే దాదాపు 94 శాతం తక్కువ విలువకు డీల్ కావడం విశేషం. ఈ ఒప్పందంతో యూన్‌అకాడమీ షేర్హోల్డర్లకు upGradలో వాటాలు దక్కాయి. రోమన్ సైనీ మాత్రం సంస్థ నిర్వహణ నుంచి తప్పుకుని ఇకపై అడ్వైజరీ పాత్రలో కొనసాగనున్నారు.అదే సమయంలో దివ్యా మిట్టల్ 13 ఏళ్ల సుదీర్ఘ ఐఏఎస్ సేవకు స్వచ్ఛందంగా ముగింపు పలికారు. ఒకరు ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి స్టార్టప్ నిర్మించి, 13 ఏళ్ల తర్వాత ఆ సంస్థ కొత్త యాజమాన్యంలోకి వెళ్లడాన్ని చూశారు. మరొకరు 13 ఏళ్లపాటు ఐఏఎస్‌గా సేవలందించిన తర్వాత స్వయంగా ఆ కెరీర్‌కు వీడ్కోలు పలికారు. ఇద్దరి ప్రయాణాలూ వేర్వేరైనా.. 2026లో మాత్రం ఇద్దరూ తమ జీవితాల్లో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.ఇద్దరి నిర్ణయాలు భిన్నమైనప్పటికీ.. సందేశం మాత్రం ఒకటే. యూపీఎస్సీలో విజయం అనేది కెరీర్‌కు ముగింపు కాదు.. కొత్త ప్రయాణానికి ఆరంభం మాత్రమే. తాను సాధించిన ప్రతిష్ఠాత్మక స్థానంలోనే జీవితాంతం కొనసాగాల్సిన అవసరం లేదని ఈ ఇద్దరి కథలు చెబుతున్నాయి. ఒకరు ఐఏఎస్ నుంచి వ్యాపారవేత్తగా మారితే.. మరొకరు 13 ఏళ్ల పరిపాలనా సేవ తర్వాత కొత్త అధ్యాయం వైపు అడుగులు వేశారు. అందుకే.. యూపీఎస్సీ క్లియర్ చేయడమే అంతిమ లక్ష్యం కాదని, ఆ తర్వాత మనకు నచ్చిన మార్గాన్ని ఎంచుకోవడమే అసలు సవాల్ అని రోమన్ సైనీ, దివ్యా మిట్టల్ ప్రయాణాలు గుర్తుచేస్తున్నాయి.ఇదీ చదవండి: రాఘవ్ చద్దా ఓటు మిస్సింగ్?


