మాజీ ఐఏఎస్‌ దివ్య పొలిటికల్‌ ఎంట్రీ.. బిగ్‌ సస్పెన్స్‌! | Former IAS Officer Divya Mittal to Announce Political Plans on October 15 | Sakshi
Sakshi News home page

మాజీ ఐఏఎస్‌ దివ్య పొలిటికల్‌ ఎంట్రీ.. బిగ్‌ సస్పెన్స్‌!

Oct 14 2026 8:32 AM | Updated on Oct 14 2026 8:32 AM

Former IAS Officer Divya Mittal to Announce Political Plans on October 15

ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లోకి మరో మాజీ ఐఏఎస్‌ అధికారి అడుగుపెట్టబోతున్నారు. 13 ఏళ్లపాటు సివిల్‌ సర్వీసుల్లో పనిచేసి రాజీనామా చేసిన దివ్య మిట్టల్‌.. తన రాజకీయ ప్రయాణంపై అక్టోబర్‌ 15న కీలక ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో ప్రజలను కలుస్తూ, స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఆమె.. 2027 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎలాంటి రాజకీయ వ్యూహంతో ముందుకు వెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది.

జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన మీర్జాపూర్‌ నుంచే దివ్య మిట్టల్‌ తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. నవరాత్రి సందర్భంగా ఆమె జిల్లాలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. ఆమెకు మద్దతుదారులు పూలతో స్వాగతం పలుకుతూ ‘దివ్య దీదీ జిందాబాద్‌’ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇదే సమయంలో అక్టోబర్‌ 15న ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కూడా మీర్జాపూర్‌లో పర్యటించనుండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, యోగీ పర్యటనకు పోటీగా తాను ప్రకటన చేయనున్నట్లు దివ్య మిట్టల్‌ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కాగా, తన రాజకీయ ప్రయాణంలో తీసుకునే ప్రతి అడుగును ప్రజలకు బహిరంగంగానే వెల్లడిస్తానని దివ్య మిట్టల్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే, ప్రస్తుతం ఉన్న ఏ రాజకీయ పార్టీలోనూ చేరే ఉద్దేశం లేదని ఆమె ప్రకటించడం గమనార్హం. దీంతో ఆమె సొంతంగా రాజకీయ వేదికను ఏర్పాటు చేస్తారా? లేక మరో మార్గంలో ప్రజా జీవితంలో కొనసాగుతారా? అన్న చర్చ మొదలైంది.

మరోవైపు.. దివ్య మిట్టల్‌ రాజకీయాల్లోకి వస్తున్నారన్న వార్తపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ గతంలోనే స్పందించారు. ఆమె సమాజ్‌వాదీ పార్టీకి సంబంధించిన కండువా ధరిస్తారా? లేక మరేదైనా ఎంచుకుంటారా? అన్న అర్థంలో వ్యాఖ్యానించారు. అయితే, ఆమెకు టికెట్‌ లేదా నియోజకవర్గాన్ని కేటాయించే అంశంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు, ప్రజల కోసం పనిచేయాలనుకునే మహిళలకు కాంగ్రెస్‌ ఎప్పుడూ స్వాగతం పలుకుతుందని యూపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అజయ్‌ రాయ్‌ తెలిపారు. జనసత్తా దళ్‌ (లోక్‌తాంత్రిక్‌) సహా మరికొన్ని పార్టీలు కూడా ఆమె రాజకీయ ప్రవేశంపై ఆసక్తి వ్యక్తం చేశాయి.

ఎవరీ దివ్య మిట్టల్‌?
2013 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి దివ్య మిట్టల్‌.. ఆగస్టు 30న తన పదవికి రాజీనామా చేశారు. సెప్టెంబర్‌ 29న రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌నే తన కర్మభూమిగా అభివర్ణించిన ఆమె.. అక్కడి నుంచే కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తానని వెల్లడించారు. ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం బెంగళూరులో విద్యనభ్యసించిన దివ్య మిత్తల్‌.. సివిల్‌ సర్వీసుల్లోకి రాకముందు లండన్‌లో పనిచేశారు. తొలుత ఐపీఎస్‌కు ఎంపికైన ఆమె, అనంతరం ఐఏఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. మీర్జాపూర్‌తోపాటు డియోరియా, సంత్‌ కబీర్‌ నగర్‌ జిల్లాలకు జిల్లా మేజిస్ట్రేట్‌గా పనిచేశారు.

ప్రస్తుతం అందరి దృష్టి అక్టోబర్‌ 15న ఆమె చేయనున్న ప్రకటనపైనే ఉంది. రాజకీయాల్లోకి రావాలన్న నిర్ణయం తీసుకున్న దివ్య మిట్టల్‌.. తనకంటూ ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసుకుంటారా? 2027 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా? అన్న ప్రశ్నలకు ఆమె అధికారిక ప్రకటనతోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: అఖిలేష్‌కు బిగ్‌ షాక్‌.. ముగ్గురు ఎస్పీ ఎమ్మెల్యేలు జంప్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement