అఖిలేష్‌కు బిగ్‌ షాక్‌.. ముగ్గురు ఎస్పీ ఎమ్మెల్యేలు జంప్‌! | Three SP MLAs Join In BJP At Uttar Pradesh | Sakshi
Sakshi News home page

అఖిలేష్‌కు బిగ్‌ షాక్‌.. ముగ్గురు ఎస్పీ ఎమ్మెల్యేలు జంప్‌!

Oct 14 2026 7:54 AM | Updated on Oct 14 2026 7:54 AM

Three SP MLAs Join In BJP At Uttar Pradesh

లక్నో: ఎన్నికల వేళ ప్రత్యర్థి పార్టీల్లో చీలికలు.. రాజకీయ సమీకరణాల్లో అనూహ్య మార్పులు.. ఉత్తరప్రదేశ్‌లో ఇప్పుడు ఇదే రాజకీయ చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార బీజేపీ తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతుండగా, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ముగ్గురు తిరుగుబాటు ఎమ్మెల్యేలు కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. రాకేశ్‌ ప్రతాప్‌ సింగ్‌, అభయ్‌ సింగ్‌, వినోద్‌ చతుర్వేది బుధవారం (అక్టోబర్‌ 14) బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. అమేథీలో జరిగే కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పంకజ్‌ చౌధరి, మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సమక్షంలో ఈ చేరికలు జరగనున్నట్లు సమాచారం.

కాగా, గౌరీగంజ్‌ నుంచి రాకేశ్‌ ప్రతాప్‌ సింగ్‌, అయోధ్యలోని గోసాయిగంజ్‌ నుంచి అభయ్‌ సింగ్‌, జాలౌన్‌ జిల్లాలోని కాల్పి నుంచి వినోద్‌ చతుర్వేది ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో రాకేశ్‌ ప్రతాప్‌ సింగ్‌ 2012, 2017, 2022 ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు. అభయ్‌ సింగ్‌ 2012లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై, 2022లో మరోసారి విజయం సాధించారు. వినోద్‌ చతుర్వేది 2007లో, తిరిగి 2022లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

రాజ్యసభ ఎన్నికల నుంచే విభేదాలు
2024 రాజ్యసభ ఎన్నికల సమయంలో బీజేపీ అభ్యర్థులకు అనుకూలంగా క్రాస్‌ ఓటింగ్‌ చేశారనే ఆరోపణలు ఈ ఎమ్మెల్యేలపై వచ్చాయి. అనంతరం సమాజ్‌వాదీ పార్టీ నాయకత్వంతో వారి విభేదాలు మరింత పెరిగాయి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే కారణంతో 2025 జూన్‌లో రాకేశ్‌ ప్రతాప్‌ సింగ్‌, అభయ్‌ సింగ్‌లతో పాటు మరో నేత మనోజ్‌ పాండేను ఎస్పీ బహిష్కరించింది. ఆ తర్వాత అసెంబ్లీలో వారిని పార్టీకి అనుబంధం లేని సభ్యులుగా గుర్తించారు. వినోద్‌ చతుర్వేది కూడా బీజేపీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు.

2027 ఎన్నికలే బీజేపీ వ్యూహమా?
ఉత్తరప్రదేశ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ చేరికలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అవధ్‌, బుందేల్‌ఖండ్‌ ప్రాంతాలకు చెందిన ఈ ముగ్గురు నేతల చేరికతో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలాన్ని పెంచుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు, ఎస్పీ నుంచి బహిష్కరణకు గురైన నేతలు బీజేపీలో చేరడం అఖిలేశ్‌ యాదవ్‌ పార్టీకి రాజకీయంగా ఎదురుదెబ్బగా మారే అవకాశముంది. అయితే ఈ చేరికల ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది రాబోయే రోజుల్లో తేలనుంది. ఎమ్మెల్యేల వ్యక్తిగత రాజకీయ బలం, స్థానిక సామాజిక సమీకరణాలు, పార్టీ కార్యకర్తల స్పందన వంటి అంశాలు కీలకంగా మారనున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటి నుంచే రాజకీయ వలసలు మొదలవడం రాష్ట్ర రాజకీయాల్లో వేడి పెంచుతోంది.

ఇదీ చదవండి: పడవ ప్రమాదంలో 14 మంది మృతి.. మోదీ, సీఎం దిగ్భ్రాంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement