పాట్నా: సరదాగా విందుకు వెళ్లొస్తామనుకున్న వారి ప్రయాణం విషాదాంతమైంది. గంగానదిలో పడవ బోల్తా పడటంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. బీహార్లోని వైశాలి జిల్లాలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో మరణాల సంఖ్య 14 మందికి చేరింది. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నట్లు సమాచారం. ఘటనతో బాధిత కుటుంబాల్లో విషాదం నెలకొంది. సహాయక బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టాయి.
అసలేం జరిగింది?
మంగళవారం రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో వైశాలి జిల్లాలోని రఘోపూర్ దియారా ప్రాంతంలో, రాంపూర్ శ్యామ్చంద్ గ్రామం సమీపంలో చోటుచేసుకుంది. గంగానదిలో పడవ ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా బోల్తా పడింది. అందులో ఉన్నవారికి తేరుకునే అవకాశం కూడా లేకపోవడంతో పలువురు నదిలో మునిగిపోయారు. పడవలో సుమారు 15 నుంచి 20 మంది ఉన్నట్లు ప్రాథమిక సమాచారం.
విందుకు వెళ్తుండగా విషాదం
సమీప గ్రామంలో ఏర్పాటు చేసిన విందుకు హాజరయ్యేందుకు కొందరు పడవలో బయల్దేరినట్లు కథనాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగింది. మృతుల్లో 15 ఏళ్లలోపు చిన్నారులు ఎక్కువగా ఉన్నట్లు వైశాలి జిల్లా మేజిస్ట్రేట్ వర్షా సింగ్ తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
సహాయక చర్యలు ముమ్మరం
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, జిల్లా అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) సిబ్బంది స్థానిక గజ ఈతగాళ్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ఈ దుర్ఘటనపై బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌధరి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
మోదీ దిగ్భ్రాంతి
ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇదీ చదవండి: కలిసికట్టుగా పోరాడుతాం!


