భోజ్‌పుర్: బిహార్‌లోని భోజ్‌పుర్ జిల్లాలో ఓ వివాహ వేడుకలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఆరుగురు సాయుధ వ్యక్తులు రెండు బైక్‌లపై వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోగా.. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మంగళవారం రాత్రి ముఫస్సిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చకియా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
స్థానిక నివాసి నరేశ్ యాదవ్ కుమార్తె నేహా వివాహ వేడుక జరుగుతుండగా ఈ దారుణం జరిగింది. పద్మినియా గ్రామం నుంచి వరుడి ఊరేగింపు చేరుకున్న అనంతరం వరమాల కార్యక్రమం పూర్తయింది. అతిథులంతా భోజనాలు ముగించుకుని మాట్లాడుకుంటున్న సమయంలో ఆరుగురు దుండగులు రెండు బైక్‌లపై అక్కడికి చేరుకున్నారు. ఎలాంటి హెచ్చరిక లేకుండా ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో పెళ్లి వేడుకలో భయాందోళనలు నెలకొన్నాయి.
ఈ కాల్పుల్లో రాహుల్ కుమార్ (20), దీపక్ కుమార్ (21) తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని ఆరా సదర్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మరో యువకుడు సోను కుమార్ (18) కుడి తొడకు బుల్లెట్ గాయం కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న ఎస్‌డీపీఓ-1 సుశీల్ కుమార్ పోలీసులతో కలిసి ఆసుపత్రికి చేరుకున్నారు. బాధితుడిని విచారించి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ప్రాథమిక విచారణలో పాత కక్షలే కాల్పులకు కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. కొందరు అనుమానితులను ఇప్పటికే గుర్తించినట్లు ఎస్‌డీపీఓ వెల్లడించారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: బంగ్లాదేశ్‌లో ‘తట్టు’ విజృంభణ.. భారత్‌లో కలకలం!


