న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ మద్దతుగా నిలిచారు. హసీనా స్వదేశానికి తిరిగి వచ్చి స్వతంత్ర న్యాయస్థానంలో విచారణ ఎదుర్కొనే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆమెపై వచ్చిన ఆరోపణలు నిరూపితమైతే చట్టప్రకారం శిక్ష విధించాలన్నారు. తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
79 ఏళ్ల హసీనా 2024 ఆగస్టులో విద్యార్థుల ఉద్యమం నేపథ్యంలో ప్రభుత్వం కూలిపోవడంతో బంగ్లాదేశ్ విడిచి భారత్‌కు వచ్చారు. ప్రస్తుతం భారత్‌లోనే ఉంటున్నారు. డిసెంబర్ 16న ఢాకాకు తిరిగి రావాలని ఆమె భావిస్తున్నట్లు ప్రతినిధి ‘రాయిటర్స్’కు వెల్లడించారు. బంగ్లాదేశ్ విముక్తి దినోత్సవం సందర్భంగా ఢిల్లీ నుంచి జాతీయ విమానయాన సంస్థలో ప్రయాణించేందుకు ఏర్పాట్లు చేయాలని తారిఖ్ రెహ్మాన్ ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం.
హసీనా న్యాయపోరాటానికి మద్దతు ప్రకటించిన తస్లీమా.. బంగ్లాదేశ్‌లో సమూల మార్పులు రావాలని కోరారు. ఇస్లామిస్ట్ తీవ్రవాదం, దానికి నిధులు సమకూర్చే వ్యవస్థలను అరికట్టాలని డిమాండ్ చేశారు. మదర్సాలను మూసివేసి ఆధునిక, శాస్త్రీయ, లౌకిక విద్యాసంస్థలను ఏర్పాటు చేయాలన్నారు. మహిళలు, మైనారిటీల హక్కులకు రక్షణ కల్పించాలని స్పష్టం చేశారు.
1993లో తస్లీమా రాసిన 'లజ్జ' నవల బంగ్లాదేశ్‌లో వివాదానికి దారితీసింది. బెదిరింపుల నేపథ్యంలో 1990ల మధ్యలో ఆమె దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. హసీనా పాలనలోనూ ఆమె ప్రవాస జీవితం కొనసాగింది. గతంలో హసీనా రాజకీయాలను విమర్శించిన తస్లీమా.. ఇప్పుడు ఆమెకు న్యాయమైన విచారణ జరగాలని కోరడం ఆసక్తికరంగా మారింది.
ఇదీ చదవండి: Turkey: కూలిన సైనిక హెలికాప్టర్.. వీడియో వైరల్!


