source: X
సెంచూరియన్‌లోని సూపర్ స్పోర్ట్ వేదికగా సౌతాఫ్రికాతో ఇవాళ మొదలైన రెండో టెస్టులో బంగ్లాదేశ్ ఘోరంగా విఫలమైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు కేవలం 91 పరుగులకే కుప్పకూలింది. దీంతో సూపర్ స్పోర్ట్ మైదానంలో అత్యల్ప స్కోరు (ఓ టెస్ట్ ఇన్నింగ్స్) నమోదు చేసిన జట్టుగా బంగ్లాదేశ్ చెత్త రికార్డును మూటగట్టుకుంది. గత పదేళ్లుగా ఇంగ్లండ్ పేరిట ఉన్న రికార్డును అధిగమించింది.
సూపర్ స్పోర్ట్ మైదానంలో అత్యల్ప స్కోర్లు
91 (బంగ్లాదేశ్) vs దక్షిణాఫ్రికా, 2026*
101 (ఇంగ్లాండ్) vs దక్షిణాఫ్రికా, 2016
116 (దక్షిణాఫ్రికా) vs వెస్టిండీస్, 2023
119 (శ్రీలంక) vs దక్షిణాఫ్రికా, 2001
120 (న్యూజిలాండ్) vs దక్షిణాఫ్రికా, 2006
మ్యాచ్ విషయానికొస్తే.. సౌతాఫ్రికా పేసర్ల ధాటికి బంగ్లాదేశ్ జట్టు విలవిలలాడిపోయింది. రబాడ, మార్కో యాన్సెన్ తలో 3 వికెట్లు.. అన్రిచ్ నోర్జే 2, ముల్దర్, హార్మర్ చెరో వికెట్ పడగొట్టడంతో ఆ జట్టు 91 పరుగులకే చాపచుట్టేసింది.
6 పరుగులకే తొలి వికెట్ (తంజిద్ హసన్ (3)) కోల్పోయిన ఆ జట్టు.. ఆతర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. 40 పరుగుల వద్ద మహ్ఫిజుల్ ఇస్లాం (23), 44 పరుగుల వద్ద కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో (4), 60 పరుగుల వద్ద మొమినుల్ హక్ (18), 73 పరుగుల వద్ద లిట్టన్ దాస్ (8), 85 పరుగుల వద్ద ఇన్ ఫామ్ బ్యాటర్ తౌహిద్ హృదోయ్ (19), 89 పరుగుల వద్ద షొరీఫుల్ ఇస్లాం (2), 90 పరుగుల వద్ద జాకిర్ అలీ (1), 91 పరుగుల వద్ద తస్కిన్ అహ్మద్ (2), ఖలీద్ అహ్మద్ (0) వికెట్లు కోల్పోయింది.
ఇదీ చదవండి: బంగ్లాదేశ్‌పై శ్రీలంక ఘన విజయం


