PC: BCCI X
ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్- 2026 వన్డే టోర్నమెంట్ లీగ్ దశలో భారత్- ‘ఎ’ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. లీగ్ దశలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ‘ఎ’ జట్టు చేతిలో తిలక్ వర్మ సేన 48 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దోహాలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్.. తొలుత బ్యాటింగ్‌కు దిగి 49.2 ఓవర్లలో 313 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
తిలక్ సెంచరీ వృథా
అయితే, లక్ష్య ఛేదనలో ఆది నుంచే తడబడిన భారత్ 49.1 ఓవర్లలో కేవలం 265 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ అభిషేక్ శర్మ మెరుపు అర్ధ శతకం (42 బంతుల్లో 70), కెప్టెన్ తిలక్ వర్మ సెంచరీ (149 బంతుల్లో 100), షాబాజ్ అహ్మద్ హాఫ్ సెంచరీ (49 బంతుల్లో 56) వృథా అయ్యాయి.
సెమీ ఫైనల్లో పాకిస్తాన్
ఇక ఈ విజయంతో రెండో గెలుపు నమోదు చేసిన పాకిస్తాన్ సెమీ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇప్పటికి రెండింట రెండు మ్యాచ్‌లు గెలిచి గ్రూప్-‘బి’ టాపర్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే.. భారత్ తమ తొలి మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే.
భారత్ సెమీస్ చేరాలంటే?
నేపాల్ జట్టుతో తలపడ్డ భారత్.. తొలుత 332 పరుగులు చేసింది. అనంతరం ప్రత్యర్థిని కేవలం 26 పరుగులకే ఆలౌట్ చేసి భారీ రన్‌రేటు సాధించింది. ఈ నేపథ్యంలో భారత్ సెమీస్ చేరాలంటే.. దాయాది పాకిస్తాన్‌తో ఫైనల్లో తలపడాలంటే..??
సమీకరణాలు ఇవే
లీగ్ దశలో చివరిగా భారత జట్టు మంగళవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో.. పాకిస్తాన్ నేపాల్‌తో తలపడతాయి. యూఏఈతో మ్యాచ్‌లో భారత్ తప్పక గెలవాల్సిందే. తద్వారా నాలుగు పాయింట్లతో సెమీస్ చేరే అవకాశం ఉంటుంది. అదే సమయంలో నేపాల్‌ను పాకిస్తాన్ ఓడించాల్సి ఉంటుంది. అదే జరిగితే భారత్ నేరుగా సెమీస్‌లో అడుగుపెడుతుంది.
ఒకవేళ నేపాల్ పాకిస్తాన్‌ను స్వల్ప తేడాతో ఓడించినా.. అప్పటికీ భారత్ అవకాశాలు మిగిలే ఉంటాయి. భారత్, నేపాల్ చెరో రెండు గెలిచి నాలుగు పాయింట్లు సాధించినా.. రన్‌రేటు పరంగా మెరుగ్గా ఉన్న భారత్ రెండోస్థానంలో నిలిచి సెమీస్‌కు అర్హత సాధిస్తుంది.
వర్షం వల్ల మ్యాచ్ రద్దైపోయినా
ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ రద్దైపోయినా ఒక పాయింట్ వస్తుంది. అప్పుడు పాకిస్తాన్ నేపాల్‌ను తప్పక ఓడించాల్సి ఉంటుంది. అలా అయితేనే భారత్ సెమీస్‌కు చేరగలదు. ఒకవేళ దురదృష్టవశాత్తూ యూఏఈ చేతిలో భారత జట్టు ఓడినా.. పాక్ గనుక నేపాల్‌ను ఓడిస్తే తప్పకుండా భారత్ క్వాలిఫై అవుతుంది. అదీ కాకుండా యూఏఈ భారత జట్టుపై గెలుపొందినా.. నేపాల్ పాక్‌ను ఓడించినా తిలక్ సేన టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
ప్రస్తుత బలాబలాల దృష్ట్యా ఇటు భారత జట్టు.. అటు పాకిస్తాన్ జట్టు పటిష్టంగా ఉన్నాయి. కాబట్టి భారత్ యూఏఈ మీద.. పాక్ నేపాల్ మీద సులువుగానే గెలుస్తాయని చెప్పవచ్చు. ఒకవేళ వర్షం వల్ల ఆటంకం కలిగితే మాత్రం పరిస్థితులు కాస్త మారిపోవచ్చు.
ఫైనల్లో దాయాదుల పోరు?
ఇదిలా ఉంటే.. గ్రూప్-ఎ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ ‘ఎ’ జట్లు సెమీస్ చేరుకున్నాయి. ప్రస్తుతం లంక టాపర్‌గా ఉండగా.. బంగ్లాదేశ్ రెండో స్థానంలో ఉంది. ఇలాంటి తరుణంలో గ్రూప్-బి నుంచి పాక్, భారత్ తొలి రెండు స్థానాల్లో నిలిస్తే.. సెమీ ఫైనల్ వన్‌లో పాక్- బంగ్లా, టూలో భారత్- శ్రీలంక తలపడే అవకాశాలు ఉంటాయి.
కాబట్టి సెమీస్‌లో ఆయా జట్లను ఓడిస్తే.. భారత్- పాక్ ఫైనల్‌కు చేరుకుంటాయి. ఆదివారం జరిగే టైటిల్ పోరులో పాక్‌పై ప్రతీకారం తీర్చుకుంటే.. భారత్ చాంపియన్‌గా అవతరిస్తుంది. 
Photo Credit: Cricbuzz
ఇదీ చదవండి: కివీస్‌తో రెండో టెస్టు.. టీమిండియా కీలక నిర్ణయం


