PC: ACC Media X
ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్-2026 వన్డే టోర్నీలో అఫ్గానిస్తాన్ ఎట్టకేలకు విజయం సాధించింది. పసికూన హాంకాంగ్-చైనాపై ప్రతాపం చూపించి.. గెలుపుతో టోర్నీని ముగించింది.
లంక, బంగ్లాదేశ్ చేతిలో ఓటమి
ఈ మెగా ఈవెంట్లో గ్రూప్-‘ఎ’ నుంచి శ్రీలంక ‘ఎ’, బంగ్లాదేశ్ ‘ఎ’, హాంకాంగ్-చైనాతో కలిసి అఫ్గాన్ ‘ఎ’ జట్టు బరిలోకి దిగింది. ఈ క్రమంలో తొలుత శ్రీలంక జట్టుతో తలపడ్డ ఆఫ్గాన్.. ఆరు వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. అనంతరం బంగ్లాదేశ్‌తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్ వికెట్ తేడాతో పరాజయం పాలైంది.
66 పరుగులకే ఆలౌట్ చేసి
అయితే, లీగ్ దశలో చివరిగా తాజాగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో హాంకాంగ్-చైనాపై అఫ్గానిస్తాన్ విజయం సాధించింది. దోహా వేదికగా టాస్ గెలిచిన అఫ్గాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. హాంకాంగ్‌ను 21.3 ఓవర్లలో కేవలం 66 పరుగులకే ఆలౌట్ చేసింది. హాంకాంగ్ బ్యాటర్లలో అన్షుమన్ రత్ (15), కెప్టెన్ యాసిమ్ ముర్తజా (19) మాత్రమే కాస్త చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.
అఫ్గాన్ బౌలర్లలో ఏఎమ్ ఘజన్‌ఫర్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. నసీర్ ఖాన్ మరూఫ్‌ఖిల్ మూడు వికెట్లు పడగొట్టాడు. నవీద్ జద్రాన్, బాషిర్ అహ్మద్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.
ఏడు వికెట్ల తేడాతో గెలుపు
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన అఫ్గాన్ జట్టు.. 10.2 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. తద్వారా ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. టాపార్డర్‌లో కెప్టెన్ ఇమ్రాన్ మిర్ (15) ఫర్వాలేదనిపించగా.. హసన్ ఐసాఖిల్ (2), బాహిర్ షా (1) విఫలమయ్యారు. ఇలాంటి తరుణంలో డార్విష్ రసూలీ మెరుపు అర్ధ శతకం (30 బంతుల్లో 50) బాది ఇషాక్ రహీమి (2*)తో కలిసి విజయలాంఛనం పూర్తి చేశాడు.
ఇప్పటికే టోర్నీ నుంచి ఎలిమినేట్
కాగా కీలక మ్యాచ్‌లలో ఓడిన అఫ్గాన్ ఇప్పటికే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది. అయితే, ఆఖరి మ్యాచ్‌ను విజయంతో ముగించి కాస్త ఊరట పొందింది. గ్రూప్-‘ఎ’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ ‘ఎ’ ఇప్పటికే రెండింట రెండు మ్యాచ్‌లు గెలిచి సెమీ ఫైనల్‌కు అర్హత సాధించాయి. హాంకాంగ్ మూడింట మూడు ఓడిపోయి అఫ్గాన్‌తో పాటు ఎలిమినేట్ అయింది.
ఇదీ చదవండి: INDA Vs PAK-A: గెలిచామన్న సంతోషంలో పాక్ ప్లేయర్ల ఓవరాక్షన్!


