టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (PC: BCCI X)
టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తీరుపై భారత మాజీ క్రికెటర్ అజింక్య రహానే అసహనం వ్యక్తం చేశాడు. నాయకుడిగా జట్టును ముందుకు నడిపించే వ్యక్తి.. సహచర ఆటగాళ్లకు అండగా ఉండాలే తప్ప.. వారిని తిట్టడం సరికాదని విమర్శించాడు. అలా చేయడం వల్ల ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని పేర్కొన్నాడు.
తొలి టెస్టు డ్రా
టీమిండియా ప్రస్తుతం న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వెల్లింగ్‌టన్ వేదికగా కివీస్- భారత్ మధ్య తొలి టెస్టు డ్రా అయింది. ఆటకు చివరి రోజైన సోమవారం న్యూజిలాండ్ స్టార్లు డారిల్ మిచెల్ (186 బంతుల్లో 49), గ్లెన్ ఫిలిప్స్ (126 బంతుల్లో 26 నాటౌట్) జిడ్డులా క్రీజులో పాతుకుపోయి.. టీమిండియా గెలుపును దూరం చేశారు.
ఆకాశ్ దీప్ ఆలస్యం.. తప్పించుకున్న మిచెల్
ఇదిలా ఉంటే.. సోమవారం రెండో సెషన్‌లోనే డారిల్ మిచెల్‌ను రనౌట్ చేసే సువర్ణావకాశం భారత్‌కు వచ్చింది. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో అతడు మిడాన్ దిశగా షాట్ బాది సింగిల్‌కు వెళ్లాడు. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న ఆకాశ్ దీప్.. బంతిని పట్టుకుని వికెట్ కీపర్ వైపు విసరడంలో ఆలస్యం చేశాడు.
అప్పటికి నాన్ స్ట్రైకర్ ఎండ్ దిశగా సగం దూరం పరిగెత్తిన మిచెల్ ప్రమాదాన్ని గమనించి.. వెంటనే వెనక్కి వచ్చేశాడు. ఆకాశ్ దీప్ ఆలస్యం కారణంగా.. రనౌట్ నుంచి తప్పించుకున్న డారిల్ మిచెల్ మళ్లీ క్రీజులో పాతుకుపోయాడు.
India managed just one wicket in the 2nd session as Daryl Mitchell survived three close calls to keep New Zealand fighting! 👊 Watch the HERO VIDA India Tour of New Zealand, 1st Test Day 5, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #SonyLIV #NZvIND
— Sony Sports Network (@SonySportsNetwk) November 23, 2026
ఆగ్రహానికి లోనైన గిల్
ఈ నేపథ్యంలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్.. ఆకాశ్ దీప్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కనిపించింది. కోపంతో అతడిపై గట్టిగానే అరిచినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై రహానే స్పందించాడు. సోనీ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘అలాంటి సమయంలోనే సహచర ఆటగాళ్ల మద్దతు ఎంతో అవసరం.
అలా చేయడం సరికాదు
ఆకాశ్ దీప్ తర్వాత బౌలింగ్ చేయడానికి రావొచ్చు. అతడు వికెట్లు కూడా తీయొచ్చు. అద్భుతమైన క్యాచ్ కూడా అందుకోవచ్చు. కాబట్టి ఒక్కసారి తప్పు చేసినందుకు ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా కెప్టెన్ ప్రవర్తన ఉండకూడదు’’ అని రహానే గిల్‌కు హితవు పలికాడు. కాగా కివీస్‌తో తొలి టెస్టులో ఆకాశ్ దీప్ మూడు వికెట్లు పడగొట్టాడు.
ఇదీ చదవండి: ‘వాళ్లిద్దరు ఉన్నా పెద్ద తేడా ఏమీ ఉండదు.. రెండో టెస్టులోనూ చోటు కష్టమే’


