‘వాళ్లిద్దరు ఉన్నా గెలిచేవాళ్లము కాదు.. రెండో టెస్టులోనూ క‌ష్టమే’ | IND vs NZ 1st Test Gill Dismisses Claims Siraj Jadeja Presence Helped | Sakshi
Sakshi News home page

‘వాళ్లిద్దరు ఉన్నా పెద్ద తేడా ఏమీ ఉండదు.. రెండో టెస్టులోనూ చోటు క‌ష్టమే’

Nov 23 2026 12:58 PM | Updated on Nov 23 2026 1:05 PM

IND vs NZ 1st Test Gill Dismisses Claims Siraj Jadeja Presence Helped

భారత జట్టు (PC: BCCI X)

వెల్లింగ్‌టన్‌ వేదికగా న్యూజిలాండ్‌- టీమిండియా మధ్య తొలి టెస్టు ‘డ్రా’గా ముగిసింది. ఆటకు ఆఖరి రోజైన సోమవారం కివీస్‌ బ్యాటర్లు పట్టుదలగా నిలబడటంతో భారత్‌ విజయానికి దూరమైంది. ఫలితంగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌-2027 ఫైనల్‌ రేసులో ముందుకు వెళ్లాలన్న గిల్‌ సేనకు నిరాశే మిగిలింది.

ఆ ఇద్దరికి దక్కని చోటు
పాయింట్ల పట్టికలో ప్రస్తుతం టీమిండియా యథాతథంగా నాలుగో స్థానంలోనే కొనసాగుతోంది. ఇదిలా ఉంటే.. బేసిన్‌ రిజర్వ్‌ మైదానంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో సీనియర్లు స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు తుదిజట్టులో చోటు దక్కలేదు.

ఈ నేపథ్యంలో టీమిండియా యాజమాన్యం తీరుపై విమర్శలు వచ్చాయి. సిరాజ్‌ను కాదని అన్షుల్‌ కాంబోజ్‌ను.. జడ్డూ స్థానంలో వాషింగ్టన్‌ సుందర్‌ను ఏ ప్రాతిపదికన ఆడించారని పలువురు మాజీ క్రికెటర్లు ప్రశ్నలు లేవనెత్తారు. ముఖ్యంగా సిరాజ్‌ విషయంలో రాజకీయ నాయకులు కూడా జోక్యం చేసుకుని రచ్చ చేశారు.

సిరాజ్‌ నాకు మంచి దోస్త్‌
ఈ అంశాలపై టీమిండియా కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ స్పందించాడు. కివీస్‌తో తొలి టెస్టు డ్రా అయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సిరాజ్‌ నాకు మంచి దోస్త్‌. అతడిని జట్టు నుంచి తప్పించడం నిజంగా ఓ కఠిన నిర్ణయం. కెరీర్‌ తొలినాళ్ల నుంచి మేమిద్దరం కలిసే ఆడుతున్నాం.

తొలి టెస్టుకు ముందు మా నిర్ణయం గురించి ముందుగానే సిరాజ్‌కు చెప్పేశాను. అతడు అర్థం చేసుకున్నాడు. ప్రతీ ఆటగాడి కెరీర్‌లో ఇలాంటి ఒక దశ ఉంటుంది. ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లనే మేము ఎంచుకున్నాము. సిరాజ్‌ మంచి ప్లేయర్‌.

అతడు కచ్చితంగా తిరిగి పుంజుకుని మునుపటి లయ అందుకుంటాడు’’ అని గిల్‌ పేర్కొన్నాడు. ఈ క్రమంలో సిరాజ్‌, రవీంద్ర జడేజా ఉంటే మ్యాచ్‌ ఫలితం వేరుగా ఉండేదా? అన్న విలేకరుల ప్రశ్నకు బదులిస్తూ..

వాళ్లిద్దరు ఉన్నా గెలిచేవాళ్లము కాదేమో!
‘‘నేనైతే అలా ఏం అనుకోవడం లేదు. సీమర్లకు పిచ్‌ పెద్దగా అనుకూలించలేదు. స్పిన్నర్లకు కాస్త సహకరించింది. అయితే, ముందుగా చెప్పినట్లు బౌలర్లకు పిచ్‌ పెద్దగా సహకరించలేదు. కాబట్టి వారిద్దరు ఉన్నా తేడా ఏమీ ఉండేది కాదు’’ అని గిల్‌ కుండబద్దలు కొట్టాడు.

సిరాజ్‌, జడ్డూ తుదిజట్టులో లేకపోయినా పెద్దగా నష్టం జరుగలేదని పరోక్షంగా గిల్‌ స్పష్టం చేశాడు. అదే విధంగా.. ‘‘రెండో టెస్టులోనూ మా తుదిజట్టులో పెద్దగా మార్పులు ఉండవు’’ అంటూ క్రైస్ట్‌చర్చ్‌ టెస్టులోనూ సిరాజ్‌, జడ్డూలు ఆడరనే సంకేతాలు ఇచ్చాడు. కాగా కివీస్‌- భారత్‌ జట్ల మధ్య శుక్రవారం మొదలయ్యే రెండో టెస్టుకు క్రైస్ట్‌చర్చ్‌లోని హెగ్లే ఓవల్‌ మైదానం వేదిక.

ఇదీ చదవండి: IND vs PAK: తిలక్‌ వర్మ సెంచరీ వృథా
INDA Vs PAK-A: గెలిచామన్న సంతోషంలో పాక్ ప్లేయర్ల ఓవరాక్షన్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement