తిలక్‌ వర్మ సెంచరీ వృథా | India A team lost to the Pakistan A team by 48 runs | Sakshi
Sakshi News home page

తిలక్‌ వర్మ సెంచరీ వృథా

Nov 23 2026 3:02 AM | Updated on Nov 23 2026 3:02 AM

India A team lost to the Pakistan A team by 48 runs

పాకిస్తాన్‌ ‘ఎ’ చేతిలో భారత్‌ ‘ఎ’ పరాజయం  

దోహా: కెప్టెన్‌ తిలక్‌ వర్మ (148 బంతుల్లో 100; 7 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా... ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ వన్డే టోర్నీలో భారత ‘ఎ’ జట్టుకు ఓటమి తప్పలేదు. తొలి మ్యాచ్‌లో నేపాల్‌పై సునాయాసంగా నెగ్గిన భారత ‘ఎ’ జట్టు... గ్రూప్‌ ‘బి’లో భాగంగా ఆదివారం పాకిస్తాన్‌ ‘ఎ’ జట్టు చేతిలో 48 పరుగుల తేడాతో ఓడిపోయింది. మొదట పాకిస్తాన్‌ ‘ఎ’ 49.2 ఓవర్లలో 313 పరుగులకు ఆలౌటైంది. హసన్‌ నవాజ్‌ (79; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), మాజ్‌ సదాఖత్‌ (59; 6 ఫోర్లు, 1 సిక్స్‌), ఫర్హాన్‌ యూసఫ్‌ (56; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలు సాధించారు.

భారత ‘ఎ’ జట్టు బౌలర్లలో విప్రాజ్‌ నిగమ్, సూర్యాంశ్‌ షెడ్గే, ప్రిన్స్‌ యాదవ్, హర్షిత్‌ రాణా తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో భారత ‘ఎ’ జట్టు 49.1 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. అభిషేక్‌ శర్మ (42 బంతుల్లో 70; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు), షహబాజ్‌ అహ్మద్‌ (49 బంతుల్లో 56; 1 ఫోర్, 4 సిక్స్‌లు) పోరాడినా ఫలితం లేకపోయింది. పాకిస్తాన్‌ ‘ఎ’ బౌలర్లలో అలీ రజా, హసన్‌ నవాజ్‌ చెరో 3 వికెట్లు పడగొట్టారు. తదుపరి మ్యాచ్‌లో మంగళవారం యూఏఈతో భారత ‘ఎ’ జట్టు తలపడనుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement