సైబర్‌ ముప్పు.. ట్రంప్‌ కీలక నియామకం.. | Who Is Jay Clayton Trump Taps Director Of National Intelligence | Sakshi
Sakshi News home page

సైబర్‌ ముప్పు.. ట్రంప్‌ కీలక నియామకం..

Nov 23 2026 9:00 AM | Updated on Nov 23 2026 9:02 AM

Who Is Jay Clayton Trump Taps Director Of National Intelligence

వాషింగ్టన్‌: అమెరికాలో సైబర్‌ భద్రతకు సంబంధించి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ జాతీయ నిఘా విభాగం డైరెక్టర్‌ జే క్లేటన్‌కు మరో కీలక బాధ్యతలు అప్పగించారు. తాత్కాలిక జాతీయ సైబర్‌ డైరెక్టర్‌గా ఆయనను నియమించారు. అమెరికా డిజిటల్‌ మౌలిక సదుపాయాలపై సైబర్‌ దాడుల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వైట్‌హౌస్‌ జాతీయ సైబర్‌ డైరెక్టర్‌ కార్యాలయాన్ని (ఓన్‌సీడీ)ఆయన తాత్కాలికంగా పర్యవేక్షించనున్నారు. ఈ పదవికి ట్రంప్‌ నామినేట్‌ చేసిన కిర్‌స్టెన్‌ డేవిస్‌ నియామకానికి సెనేట్‌ ఆమోదం లభించే వరకు క్లేటన్‌ ఈ బాధ్యతల్లో కొనసాగుతారు.

అమెరికా నిఘా విభాగానికి తొమ్మిదో అధిపతి
జే క్లేటన్‌ అమెరికా తొమ్మిదో జాతీయ నిఘా విభాగం డైరెక్టర్‌. 2026 ఆగస్టు 3న ఈ పదవిలో ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా అధ్యక్షుడికి ప్రధాన నిఘా సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. దేశంలోని వివిధ నిఘా సంస్థల కార్యకలాపాలను సమన్వయం చేయడంతోపాటు, జాతీయ నిఘా కార్యక్రమాల అమలును పర్యవేక్షిస్తున్నారు. నిఘా కార్యకలాపాలు అమెరికా చట్టాలు, రాజ్యాంగానికి అనుగుణంగా జరిగేలా చూడటం కూడా ఆయన బాధ్యతల్లో భాగం.

న్యాయ, ఆర్థిక రంగాల్లోనూ అనుభవం
ట్రంప్‌ ప్రభుత్వంలో చేరకముందు క్లేటన్‌ అమెరికా న్యాయ, ఆర్థిక రంగాల్లో కీలక పదవులు నిర్వహించారు. న్యూయార్క్‌ దక్షిణ జిల్లాకు అమెరికా అటార్నీగా పనిచేశారు. ఉగ్రవాదం, గూఢచర్యం, మనీలాండరింగ్‌, లంచగొండితనం, కీలక మౌలిక సదుపాయాలకు ఎదురయ్యే ముప్పులకు సంబంధించిన కేసులను పర్యవేక్షించారు.

ఎస్‌ఈసీ ఛైర్మన్‌గా సేవలు
2017 మే నుంచి 2020 డిసెంబర్‌ వరకు అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ (ఎస్‌ఈసీ) ఛైర్మన్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఆర్థిక మార్కెట్ల నియంత్రణ, సైబర్‌ భద్రత, డిజిటల్‌ ఆస్తులు, పెట్టుబడిదారుల రక్షణ వంటి అంశాలపై దృష్టి సారించారు. అనంతరం అపోలో గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌గా, సుల్లివన్‌ అండ్‌ క్రామ్‌వెల్‌ న్యాయ సంస్థలో సీనియర్‌ పాలసీ సలహాదారుగా పనిచేశారు.

విద్యాభ్యాసం.. అదనపు బాధ్యతలు
పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయాల్లో ఇంజినీరింగ్‌, ఆర్థికశాస్త్రం అభ్యసించారు. అనంతరం పెన్సిల్వేనియా యూనివర్సిటీ లా స్కూల్‌లో న్యాయశాస్త్ర పట్టా పొందారు. అమెరికా ప్రభుత్వంలో ప్రస్తుతం నిఘా విభాగం అధిపతిగా, కృత్రిమ మేధ (ఏఐ) వ్యవహారాల బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయనకు తాజా నియామకంతో సైబర్‌ భద్రతా విధానాల సమన్వయం కూడా అదనంగా చేరింది. అమెరికా కీలక సంస్థలు, ప్రభుత్వ వ్యవస్థల్లో సాంకేతిక అంతరాయాలు, సైబర్‌ ముప్పులపై ఆందోళనలు పెరుగుతున్న తరుణంలో ఈ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది.


ఇదీ చదవండి: ఇక నేపాల్‌కు రైల్లో.. నేడే కొత్త రైలు పరుగులు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement