లాహోర్: గురునానక్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు, 2,300 మందికి పైగా భారతీయ సిక్కులు పాకిస్తాన్‌కు చేరుకున్నారు. ఆదివారం వాఘా సరిహద్దు వద్ద వీరికి ‘ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్’(ఈటీపీబీ) చైర్మన్ ఖమర్ జమాన్, పంజాబ్ మైనారిటీ వ్యవహారాల మంత్రి, ‘పాకిస్తాన్ సిక్కు గురుద్వారా ప్రబంధక్ కమిటీ’(పీఎస్‌జీపీసీ) అధ్యక్షుడు సర్దార్ రమేష్ సింగ్ అరోరా స్వాగతం పలికారు.
యాత్రికులను కట్టుదిట్టమైన భద్రత మధ్య, మూడు కాన్వాయ్‌ల్లో నంకానా సాహిబ్‌కు తరలించారు. పాక్ ప్రభుత్వం 3,000కు పైగా వీసాలను జారీ చేసిందని, 2,339 మంది భారతీయ యాత్రికులు లాహోర్‌కు చేరుకున్నారని ఈపీటీబీ ప్రతినిధి అమీర్ హష్మీ తెలిపారు. కర్తార్‌పూర్ సాహిబ్ సహా పాక్‌లోని పలు చారిత్రక సిక్కు పుణ్యక్షేత్రాలను సందర్శించి, డిసెంబర్ 1న యాత్రికులు తిరిగి భారత్‌కు చేరుకుంటారని ఆయన పేర్కొన్నారు.
పాకిస్తాన్‌లో బస చేసే సమయంలో యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు బోర్డు అన్ని విధాలా ప్రయతి్నస్తోందని ఈటీపీబీ ఛైర్మన్ జమాన్ తెలిపారు. సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కర్తార్‌పూర్‌లో ఉన్న గురుద్వారా దర్బార్ సాహిబ్‌కు ప్రవేశం కల్పించే కర్తార్‌పూర్ కారిడార్‌ను తిరిగి తెరవాలని మంత్రి అరోరా భారత ప్రభుత్వాన్ని కోరారు.
1947 విభజన సమయంలో భారత్‌కు వలసొచ్చిన హిందువులు, సిక్కుల ఆస్తులు, భూముల నిర్వహణకోసం పాక్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన చట్టబద్ధమైన సంస్థ ఈటీపీబీ. గురునానక్ 557వ జయంతి ప్రధాన వేడుక మంగళవారం నాడు, ఆయన జన్మస్థలమైన నంకానా సాహిబ్‌లోని ‘గురుద్వారా జన్మస్థాన్’వద్ద జరుగుతుంది. భారత్‌తోపాటు ఇతర దేశాల నుంచి వచ్చిన సిక్కు యాత్రికులు ‘భోగ్’, ‘అఖండ పాఠ్ సాహిబ్’వంటి మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.


