భారత్‌పై నాడు విషం.. నేడు ఢిల్లీలో పర్యటన.. పాక్ మంత్రి ఎపిసోడ్‌లో ట్విస్ట్! | Pak minister Masood Malik in Delhi for SCO meet on India ties | Sakshi
Sakshi News home page

భారత్‌పై నాడు విషం.. నేడు ఢిల్లీలో పర్యటన.. పాక్ మంత్రి ఎపిసోడ్‌లో ట్విస్ట్!

Nov 21 2026 8:06 AM | Updated on Nov 21 2026 8:06 AM

Pak minister Masood Malik in Delhi for SCO meet on India ties

న్యూఢిల్లీ: భారత్‌లో పర్యటిస్తున్న పాకిస్థాన్ వాతావరణ మార్పుల శాఖ మంత్రి ముసాదిక్ మసూద్ మాలిక్ పర్యటనపై ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆయన ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను సందర్శించేందుకు భారత అధికారులు అనుమతి ఇచ్చారు. అయితే ఢిల్లీలోని ప్రముఖ సూఫీ పుణ్యక్షేత్రం హజ్రత్ నిజాముద్దీన్ దర్గాను సందర్శించాలన్న ఆయన అభ్యర్థనను భద్రతా కారణాలతో తిరస్కరించారు.

నవంబర్ 20 నుంచి 22 వరకు న్యూఢిల్లీలోని చారిత్రక పురానా ఖిలాలో జరుగుతున్న తొలి షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సివిలైజేషనల్ డైలాగ్ ఫోరంలో పాల్గొనేందుకు ముసాదిక్ మాలిక్ భారత్‌కు వచ్చారు. ఈ సందర్భంగా తాజ్‌మహల్‌తో పాటు ఢిల్లీలోని హుమాయూన్ సమాధి, ఢిల్లీ హాట్, ఖిలా రాయ్ పితోరా ప్రాంతాలను సందర్శించేందుకు పాక్ హైకమిషన్ అనుమతి కోరింది. భద్రతా పరిశీలన అనంతరం తాజ్‌మహల్‌తో పాటు మిగిలిన మూడు ప్రాంతాల సందర్శనకు అధికారులు అనుమతించారు. అయితే నిజాముద్దీన్ దర్గా సందర్శనకు మాత్రం అనుమతి నిరాకరించారు. ఈ విషయాన్ని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

మూడేళ్ల తర్వాత భారత్‌లో పర్యటిస్తున్న పాకిస్థాన్ ఫెడరల్ మంత్రి ముసాదిక్ మాలిక్ కావడం ఈ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. చివరిసారిగా 2023 మేలో అప్పటి పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ గోవాలో జరిగిన ఎస్‌సీఓ విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరయ్యారు. 2025 మేలో జరిగిన ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్‌కు వచ్చిన తొలి పాకిస్థాన్ ఫెడరల్ మంత్రి కూడా ముసాదిక్ మాలిక్ కావడం గమనార్హం.

ఇదిలా ఉండగా, ఎస్‌సీఓ వేదికగా భారత్‌తో పాటు ఇతర సభ్యదేశాల ప్రతినిధులతో మాట్లాడే అవకాశం రావడంపై మాలిక్ సంతృప్తి వ్యక్తం చేశారు. దేశాల మధ్య పరస్పర అవగాహన పెరగాలంటే ఒకరి అభిప్రాయాలను మరొకరు అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. భారత్‌తో సంబంధాలు మెరుగుపడటంలో సంస్కృతి, నాగరికతల మధ్య సంబంధాలకు కీలక పాత్ర ఉంటుందని అభిప్రాయపడ్డారు. తన పర్యటన కేవలం ఒక్కసారితో ముగిసిపోకుండా ఇరు దేశాల మధ్య రాకపోకలు, పరస్పర చర్చలు కొనసాగాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.

గతంలో భారత్‌పై ఘాటు వ్యాఖ్యలు..
పాకిస్థాన్ మంత్రి ముసాదిక్ మాలిక్ గతంలో భారత్‌పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ ఏడాది జూన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. పాకిస్థాన్‌కు రావాల్సిన నీటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తమ నీటి వాటాపై ఎవరైనా చేయి వేస్తే ఆ చేతులను నరికేస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు తజికిస్థాన్‌లోని దుషాంబేలో జరిగిన అంతర్జాతీయ జల సదస్సులోనూ భారత్ వైఖరిని తప్పుబట్టారు. నీటిని ఆయుధంగా ఉపయోగించుకోవద్దని, 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని గౌరవించాలని భారత్‌కు సూచించారు. ఈ ఒప్పందాన్ని ఏకపక్షంగా నిలిపివేయడం దిగువ ప్రాంత దేశాల హక్కులకు విఘాతమని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఎస్‌సీఓ సదస్సులో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన ముసాదిక్ మాలిక్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఢిల్లీలో మీడియా ఆయన గత వ్యాఖ్యలపై ప్రశ్నించగా, ఈ వేదిక ద్వైపాక్షిక చర్చల కోసం కాదని, బహుళపక్ష సమావేశాల కోసమేనని సమాధానమిచ్చారు.

ఇదీ చదవండి: తమిళనాడు రహస్యాలు ఏపీకి లీక్‌.. 15 మందిపై వేటు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement