పరువు నష్టం కేసులో మేరీకోమ్‌కు నోటీసులు | Delhi Court issues notice to boxing champion Mary Kom filed by ex husband | Sakshi
Sakshi News home page

పరువు నష్టం కేసులో మేరీకోమ్‌కు నోటీసులు

Nov 21 2026 7:11 AM | Updated on Nov 21 2026 7:11 AM

Delhi Court issues notice to boxing champion Mary Kom filed by ex husband

న్యూఢిల్లీ: ఒలింపిక్‌ పతక విజేత, భారత మాజీ బాక్సింగ్‌ ఛాంపియన్‌ మేరీకోమ్‌కు ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆమె మాజీ భర్త కరోంగ్‌ ఒంకోలర్‌ దాఖలు చేసిన పరువు నష్టం క్రిమినల్‌ ఫిర్యాదుపై శుక్రవారం ఈ మేరకు ఆదేశించింది. 2026 జనవరి 11న ఓ టీవీ కార్యక్రమంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో మేరీకోమ్‌ తనపై అసత్య, పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. ఆమె వ్యాఖ్యలతో తన ప్రతిష్ఠ దెబ్బతిన్నదని ఫిర్యాదులో పేర్కొన్నారు. మేరీకోమ్‌ వివరణ తెలుసుకున్న తర్వాతే కేసును విచారణకు స్వీకరించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు న్యాయమూర్తి శివమ్‌ గుప్తా తెలిపారు. తదుపరి విచారణను డిసెంబర్‌ 21కి వాయిదా వేశారు.

2005 మార్చి 12న మేరీకోమ్‌తో తనకు వివాహమైందని, 2023 డిసెంబర్‌ 20న సంప్రదాయ పద్ధతిలో విడిపోయామని కరోంగ్‌ తెలిపారు. ఆమె బాక్సింగ్‌ కెరీర్‌కు మద్దతుగా తాను తన వృత్తి, ఆశయాలను వదులుకున్నానని పేర్కొన్నారు. టీవీ ఇంటర్వ్యూలో తనను నిజాయతీ లేని వ్యక్తిగా, నిరుద్యోగిగా, ఆర్థికంగా ఆమెపై ఆధారపడినవాడిగా, మద్యానికి బానిసైన వ్యక్తిగా చిత్రీకరించారని ఆరోపించారు. ఆమె బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు తీసుకున్నానని, పిల్లల బాధ్యతలు పట్టించుకోలేదని కూడా ఆరోపించినట్లు ఫిర్యాదులో వివరించారు. ఈ వ్యాఖ్యలతో భర్తగా, తండ్రిగా తన వ్యక్తిత్వం, ప్రతిష్ఠ దెబ్బతిన్నాయని పేర్కొంటూ భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)-2023లోని సెక్షన్‌ 356 కింద ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారుడితో పాటు మరో ముగ్గురు సాక్షుల వాంగ్మూలాలను కోర్టు నమోదు చేసింది.

ఇదీ చదవండి: టెక్‌ కంపెనీలకు ట్రంప్‌ వార్నింగ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement