‘ఒక ఫిర్యాదు అందింది, ఒకసారి స్టేషన్‌కి రండి, స్టేట్‌మెంట్ తీసుకొని పంపించేస్తాం’ అంటూ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేసి చెప్పటం ఇప్పటికీ చాలాచోట్ల, చాలాసార్లు జరుగుతూనే ఉంటుంది. ఫోన్ కాల్ అందుకున్న వ్యక్తులు భయంతో స్టేషన్‌కి వెళ్లి ఇబ్బంది పడటం, ఒక్కోసారి అనవసర చిక్కుల్లో పడటం జరుగుతుంటుంది. కానీ, అమలులో ఉన్న చట్టప్రకారం పోలీసులు ఎవరినైనా స్టేషన్ కి పిలవాలంటే ఫోన్ ద్వారా, లేదా కానిస్టేబుల్ ద్వారా కబురుచేసి కాకుండా, కచ్చితంగా రాతపూర్వక నోటీసు ఇవ్వాలి.
ఇటీవల గౌరవ సుప్రీంకోర్టువారు ‘సతేందర్ కుమార్ అంటిల్ – సి.బి.ఐ.’ మధ్య జరిగిన వివాదంలో (21 జనవరి 2025) ఇచ్చిన తీర్పులో– వాట్సాప్ ద్వారా, ఎలక్ట్రానిక్ మోడ్ ద్వారా నోటీసు పంపకూడదనీ, ‘భారతీయ నాగరిక్ సురక్ష సంహిత’ (బి.ఎన్.ఎస్.ఎస్.) సెక్షన్ 35లో తెలియజేసిన విధంగా రాతపూర్వక నోటీసు ద్వారానే పిలవాలనీ స్పష్టంచేసింది. దీన్నే గతంలో సి.ఆర్.పి.సి. సెక్షన్ 41 నోటీసు అనేవారు.
నోటీసులో కేసు వివరం, తేదీ, సమయం స్పష్టంగా ఉండాలి. నోటీసుకు స్పందించి స్టేషన్ కు హాజరైన వ్యక్తిని అకారణంగా అరెస్టు చేయకూడదని కూడా చట్టం చెబుతోంది. ఏడేళ్లలోపు శిక్ష ఉన్న కేసుల్లో ముందుగా ‘సెక్షన్ 35 – బిఎన్‌ఎస్‌ఎస్’ ప్రకారం నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయటం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హరియాణా డి.జి.పి. ఒక కేసు (స్పెషల్ లీవ్ పిటిషన్ నం. 9991/2024)లో వాట్సాప్ ద్వారా పంపిన నోటీసు చెల్లదని, రాత పూర్వక నోటీసు పంపాల్సిందేనని సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది.
అయినప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లో గౌరవ సుప్రీంకోర్టు వారి ఆదేశాలకు వ్యతిరేకంగా సెక్షన్ 35 నోటీసు ఇవ్వకుండా నోటిమాట ద్వారా పిలిచి స్టేట్‌మెంట్లు రికార్డు చేస్తూ ఉండటం విచారకరం. ఒకవేళ, పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ వస్తే, ‘నేను స్టేషన్ కు రావటానికి సిద్ధంగా ఉన్నాను, నాకు రాతపూర్వకంగా పూర్తి వివరాలతో నోటీసు పంపండి’ అని మర్యాదపూర్వకంగా తెలియ జేయవచ్చు.
గతంలో ‘అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్’ కేసు (02 జూలై 2014)లో గౌరవ సుప్రీంకోర్టు ఈ విషయాన్ని గట్టిగా చెప్పింది. ఒక వ్యక్తి నేరం చేశాడని ఫిర్యాదు అందినప్పుడు అలవాటు ప్రకారం అరెస్టు చేయకుండా, నిందితుడు తప్పించుకు పోతాడనో, సాక్ష్యాలను తారుమారు చేస్తాడనో అనుమానాలు గట్టిగా ఉన్నప్పుడు మాత్రమే కారణాలు రికార్డుచేసి, నిబంధనలు పాటిస్తూ అరెస్టు చేయాలని ఆదేశించింది. నోటీసుకు సక్రమంగా స్పందించిన సందర్భాల్లో అరెస్టు అవసరం లేదు. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన అధికారులపై కోర్టు ధిక్కారం కింద శిక్షించవచ్చు.
ఫోన్ స్వాధీనం చేసుకోవచ్చా?
మరో ఇబ్బందికర విషయం– విచారణ కోసమని స్టేషన్‌కు పిలిపించి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవటం. బిఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 106 ప్రకారం విచారణకు అవసరమైన వస్తువులను సీజ్ చేయవచ్చు. కానీ, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకోవాలనుకున్నప్పుడు సీజర్ మెమో తప్పనిసరి. సీజర్ మెమో ఇచ్చి, 24 గంటల్లో సంబంధిత మేజిస్ట్రేట్‌కి తెలియజేయాలని సెక్షన్ 105 స్పష్టం చేస్తోంది. స్వాధీనం చేసుకున్న ఫోన్‌ను వీలైనంత త్వరలో రిలీజ్ చేసి, పార్టీకి అందజేయాలి. ఇలా చేయకపోవటం పౌరుల హక్కుల ఉల్లంఘన క్రిందకు వస్తుందని అనేక కోర్టు ఉత్తర్వులు తెలియజేస్తున్నాయి.
క్రిమినల్ పిటిషన్ నం. 3119/ 2023 తేదీ 12.08.2022 గల తీర్పులో గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇదే విషయాన్ని నొక్కి వక్కాణించింది. ఈ నేపథ్యంలో స్థానిక న్యాయ స్థానాలు, న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు చట్టాలను అమలు చేయటంలో పౌరులకు అండగా ఉంటారని, తద్వారా పౌరుల హక్కులను కాపాడతారని ఆశిద్దాం.
– డా. వి. రాజేంద్రప్రసాద్, అడ్వకేట్
ఇదీ చదవండి: అపహాస్యమైన ప్రజాస్వామ్యం


