అపహాస్యమైన ప్రజాస్వామ్యం | Sakshi Guest Column On A Mockery of Democracy at Andhra Pradesh | Sakshi
Sakshi News home page

అపహాస్యమైన ప్రజాస్వామ్యం

Oct 27 2026 12:09 AM | Updated on Oct 27 2026 12:09 AM

Sakshi Guest Column On A Mockery of Democracy at Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌లో అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, కార్యాలయాల ఎదుటే పత్రాలు లాక్కొని చించివేయడం వంటి దృశ్యాలు ప్రజాస్వామ్యాన్ని సిగ్గుపడేలా చేశాయి.

అభిప్రాయం

బిహార్‌లో ఏకంగా 65 లక్షల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించిన తర్వాత వెలువడిన ఫలితం ఎవరి గెలుపును ప్రకటించింది? ప్రజా తీర్పునా, లేక కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) వెనుక ఉన్న పెద్దల వ్యూహాన్నా? రేపు ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 45 లక్షల మంది ఓటర్లు లేకుండా ఎన్నికలు జరిగితే పాలించేది ఎవరు? అక్కడ రాజ్యాంగబద్ధ పాలన మిగిలి ఉన్నట్లా? ఓటరు జాబితాల ప్రక్షాళన పేరిట ప్రారంభమైన ‘స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌’ (ఎస్‌ఐఆర్‌) విధివిధానాలు ఇప్పుడు భారత ప్రజాస్వామ్య వ్యవస్థను, నిష్పాక్షిక ఎన్నికల ప్రక్రియను తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. 

మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కోసమే తొలగింపులు?
ఆంధ్రప్రదేశ్‌లో 2026 జూన్‌ 15 నుంచి జూలై 24 వరకు ఓటర్ల గణన సాగింది. ఈసీఐ స్వయంగా వెల్లడించిన లెక్కల ప్రకారమే... గైర్హాజరు, వలస వెళ్లడం, మరణం, నకిలీ పేర్ల పేరిట ఏకంగా 44,89,512 ఓట్లను ముసాయిదా జాబితాకు ముందే రద్దు చేశారు. అక్టోబర్‌ 14 నాటికి రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,75,69,896. ఒకే విడతలో దాదాపు 45 లక్షల మందిని ఓటర్ల జాబితా నుంచి వేరుచేయడం వెనుక రాజకీయ పక్షపాతం ఉంటే, అది ప్రజాస్వా మ్యానికి వ్యతిరేకంగా ఆడే ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ కాక మరేమిటి? చనిపోయిన వారిని, నకిలీ ఎంట్రీలను తొలగించడం చట్టబద్ధమైన బాధ్యతే. కానీ ‘ఇంట్లో లేరు‘, ‘ఊరు మారారు’ అన్న ముద్రలు గుమ్మం వద్ద నిలబడి తీసుకునే నిర్ణయాలు. హైదరాబా ద్‌లో కూలీ చేసుకునే వలస కార్మికుడో, బెంగళూరులో చదువుకునే విద్యార్థో దొంగ ఓటర్లు కారు. నోటీసు జారీ చేసి, సంజాయిషీ చెప్పుకునే సహజ న్యాయసూత్రాల అవకాశం ఇవ్వకుండా వారి ఓటు హక్కును తుంగలో తొక్కడం రాజ్యాంగ విరుద్ధం.

2026 మే 27న ‘అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) వర్సెస్‌ ఈసీఐ’ కేసులో సుప్రీంకోర్టు ఆర్టికల్‌ 324, ప్రజాప్రాతినిధ్య చట్టం–1950 సెక్షన్‌ 21(3) ప్రకారం సర్‌ను నిర్వ హించే అధికారం ఈసీకి ఉందని స్పష్టం చేసింది. అక్కడే గట్టి షరతు విధించింది. ఓటర్ల జాబితాలో పేరు ఉండటం ప్రాథమిక అర్హత మాత్రమేననీ, కానీ ఆ పేర్లను తొలగించాలంటే లిఖిత పూర్వక కారణాలు, వ్యక్తిగత నోటీసులు తప్పనిసరనీ హెచ్చరించింది. పౌరసత్వ నిర్ధారణను ఎన్నికల ప్రయోజనాల వరకే పరిమితం చేయాలనీ, ఎవరినీ పూర్తిగా దేశ పౌరులు కారని తేల్చే అధికారం ఈసీకి లేదనీ స్పష్టం చేసింది. గుర్తింపు కార్డుగా ఆధార్‌ను అంగీకరించాలని సూచించింది. అంటే, చట్టం కమిషన్‌కు అధికారాన్ని ఇచ్చిందే తప్ప, ఏకపక్షంగా ఓట్లను తొలగించే లైసెన్సు ఇవ్వలేదు.

ఓటు రాజ్యాంగ వాగ్దానం
ఓటు హక్కు అనేది అధికారంలో ఉన్న ప్రభుత్వం కరుణించి విదిల్చే ఉచితం కాదు. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల జాబి తాలో అది ప్రత్యక్షంగా కనిపించకపోయినా, ఆర్టికల్‌ 19(1)(ఎ) భావప్రకటన స్వేచ్ఛ ఆత్మలోనే అంతర్గతంగా నిక్షిప్తమై ఉంది. ఆర్టికల్‌ 326 ప్రకారం 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికి ఓటు రాజ్యాంగబద్ధ వాగ్దానం. మతం, జాతి, కులం, లింగ వివక్షల ఆధారంగా ఎవరినీ ఓటరు జాబితా నుంచి తప్పించరాదని ఆర్టికల్‌ 325 స్పష్టం చేస్తున్నది. ఏ సర్క్యులర్‌ అయినా, ఏ అధికార ప్రక్రియ అయినా ఈ రెండు అధికరణల పరిధిలోనే పనిచేయాలి. మోహిందర్‌ సింగ్‌ గిల్‌ (1978) కేసులో ఆర్టికల్‌ 324ను అధికా రాల మహానది అని వర్ణించిన కోర్టు, ఆ అధికారం చట్ట పరిధిలోనే న్యాయంగా అమలు చేయాలని గుర్తుచేసింది. అయితే, కమిషనర్ల నియామక కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగిస్తూ కేంద్రం తీసుకొచ్చిన చట్టం ఎన్నికల సంఘం నిష్పాక్షి కతపై ప్రశ్నలు, అనుమానాలు రేకెత్తించింది. తాజాగా ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధూ, వివేక్‌ జోషి 10 నెలల కాలంలో దాదాపు 14 అభ్యంతర లేఖలు రాసినట్లు కథనాలు వెలువడటం ఈ అనుమానాలను మరింత బలపరిచింది. ఎస్‌ఐఆర్‌ నిర్ణయాలు ఏకగ్రీవంగా జరిగాయని ఈసీఐ పత్రికా ప్రకట నల ద్వారా సమర్థించుకోవడానికి బదులుగా, సమాచార హక్కు చట్టం పరిధిలోకి వచ్చే మినిట్స్, ఫైల్‌ నోటింగులను బహిరంగపర చాలి. దాపరికం లేని వ్యవస్థకు పారదర్శకతే కొలమానం. 

పత్రాలు చించి ‘ఏకగ్రీవా’లా?
ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, స్థానిక సంస్థల ఎన్నిక లను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఆర్టికల్స్‌ 243కె, 243 జెడ్‌ఏ కింద నిర్వహిస్తుంది. కానీ వీటికి ప్రత్యేక ఓటర్ల జాబితా ఉండదు; కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన అసెంబ్లీ జాబితానే వార్డుల వారీగా విభజించి వాడుకుంటారు. ప్రస్తుతం ఒక విచిత్రమైన పరి స్థితి నెలకొంది. ఎస్‌ఐఆర్‌ సవరణలు ఇంకా కొలిక్కి రాకముందే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్లు వచ్చాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పాత జాబితాతోనే ఎన్నికలు నడుస్తున్నాయా, లేక లక్షలాది పేర్లు గల్లంతైన కొత్త జాబితాతోనా అనే స్పష్టతను ఎస్‌ఈసీ ప్రజలకు ఇవ్వాలి. అలాగే నామినేషన్ల ఘట్టంలో చోటుచేసుకున్న పరిణామాలు ఆందోళనకరం. అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, కార్యాలయాల ఎదుటే పత్రాలు లాక్కొని చించి వేయడం వంటి దృశ్యాలు ప్రజాస్వామ్యాన్ని సిగ్గు పడేలా చేశాయి. డీజీపీ నివేదికల ప్రకారమే అనేక జిల్లాల్లో హింసా త్మక ఘటనలు, నామినేషన్‌ పత్రాల దహనాలు నమోదయ్యాయి. అర్బన్‌ స్థానిక సంస్థల్లో సుప్రీంకోర్టు జోక్యంతో 72 వార్డుల్లో గడువు పొడిగించిన ఎస్‌ఈసీ, అంతకంటే సున్నితమైన గ్రామీణ ప్రాంత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కేవలం కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసి చేతులు దులుపుకోవడం భావ్యం కాదు. ‘కిషన్‌ సింగ్‌ తోమర్‌ (2006)’ కేసు ప్రకారం ఈసీఐకి ఉన్నట్టే ఎస్‌ఈసీకి కూడా సమగ్ర అధికారాలు ఉంటాయి.

అక్టోబర్‌ 27న నామినేషన్ల ఉపసంహరణ ముగిశాక వచ్చే ‘ఏకగ్రీవాల’ లెక్కలే ఎన్నికల నిష్పాక్షికతకు నిజమైన పరీక్ష. ప్రజల ఆమోదంతో ఏకగ్రీవమైతే అది ప్రజాస్వామ్యం; నామినేషన్లు చించివేసి సాధించే ఏకగ్రీవం రాజ్యాంగంపై జరిగే దాడి. అందుకే పార్టీలతో నిమిత్తం లేకుండా దేశంలో, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి పౌరుడికి మూడు మౌలిక హామీలు దక్కాలి: అర్హులైన ప్రతి ఒక్కరి పేరు నమోదై ఉండే పారదర్శక ఓటర్ల జాబితా; ఎటువంటి భయభ్రాంతులు లేకుండా స్వేచ్ఛగా వెళ్లి నామినేషన్‌ దాఖలు చేయగల కేంద్రం; ప్రతి చర్యకూ చట్టబద్ధమైన కారణాలు వివరిస్తూ పారదర్శకంగా వ్యవహరించే నిష్పాక్షిక ఎన్నికల ‘అంపైర్‌’. అంపైర్‌ పాత్రే అనుమానాస్పదంగా మారితే వ్యవస్థల విశ్వసనీయత కూలి పోయి, ప్రజాస్వామ్య మనుగడే ప్రశ్నార్థకమౌతుంది.

ప్రొ‘‘ మాడభూషి శ్రీధర్‌
వ్యాసకర్త నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయ పూర్వ రిజిస్ట్రార్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement