మాధవ్ శింగరాజు
ఈ ఉదయం, టాగోర్ నన్ను పద్మా నదీ తీరం నుండి వీస్తున్న ఒక ప్రశాంత సమీరంలా వెంబడిస్తున్నారు! ఆయన ‘గీతాంజలి’లోని ‘వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్...’ ఇంతక్రితమే ఢిల్లీ నుండి నాతో పాటుగా వారణాసి చేరుకుంది. ఈ సాయంత్రం కేదార్‌నాథ్‌లో కూడా టాగోర్ నా వెంటే ఉంటారనుకుంటా! టాగోర్‌తో కొండలు, గుట్టల ప్రయాణం... ఒక ‘మన్ కీ బాత్’! మధ్యాహ్నం ‘నమో ఘాట్’ ఎయిర్ షోలో నా పక్కనే ఉండబోయే యోగి ఆదిత్యనాథ్... నా వెంబడి ఉన్న టాగోర్‌ని దర్శించే అవకాశమే లేదు. యోగి భయం లేని మనిషి. భయం లేని మనిషి తలపుల్లో ‘వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్...’ అనే భావయుక్తమైన టాగోర్ కవిత్వం మాత్రం ఎందుకుంటుంది?
వారణాసి సేవాపురిలో ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం అవగానే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్; కేదార్‌నాథ్‌లో కారిడార్ ప్రాజెక్ట్ పనుల పరిశీలన పూర్తవగానే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ వెళ్లిపోతారు. నేను, టాగోర్ మిగులుతాం. ఉదయం 11 గం. అవుతోంది. ‘మన్ కీ బాత్’ ప్రసారం మొదలయ్యే సమయం! దేశం మొత్తం వింటుంది. ముందే రికార్డ్ చేసి ఉంచిన నా మన్ కీ బాత్ వినేందుకు వారణాసిలో నేను కూడా వేచి ఉన్నాను. టాగోర్ ‘గీతాంజలి’కి, ‘మన్ కీ బాత్’కి దగ్గరి పోలికలు కనిపిస్తాయి నాకు! గీతాంజలి దేవుడికి అర్పణ అయితే, మన్ కీ బాత్ దేశ ప్రజలకు సమర్పణ.
టాగోర్ ‘వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్...’ని పద్మానది ఒడ్డున 1910లో రాసి, ‘గీతాంజలి’లో చేర్చారు. మన్ కీ బాత్ 2014 విజయదశమి రోజు మొదలైంది. ఈరోజు ప్రసారం అవుతున్నది 139వ ఎపిసోడ్. ఈ పన్నెండేళ్లలో రెండుసార్లు మాత్రమే మన్ కీ బాత్‌కు విరామం వచ్చింది. మొదటిసారి 2019 లోక్‌సభ ఎన్నికలప్పుడు మార్చి, ఏప్రిల్ నెలల్లో; రెండోసారి 2024 లోక్‌సభ ఎన్నికలప్పుడు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో. అదీ ఎన్నికల కోడ్ వల్ల. నిజానికి అప్పుడు కూడా మన్ కీ బాత్ ఆగినట్లేమీ కాదు. ప్రజలు ఆ రెండు విరామాలను తమ మన్ కీ బాత్‌తో భర్తీ చేశారు. తమ మనసులో ఉన్న ప్రభుత్వం ఎవరిదో తమ ఓటు ద్వారా తెలియజేశారు.
గీతాంజలిలా, గంగానదిలా... ఎక్కడా ఆగని ప్రవాహం మన్ కీ బాత్! ‘‘భయం లేని చోట, తల ఎత్తుకొని నిలిచే చోట; జ్ఞానం అందరికీ ఉదారంగా లభించే చోట; సంకుచితమైన గోడల కట్టుబడితో ఈ ప్రపంచం ముక్కలుగా విడిపోని చోట; సత్యమైన మాటలు వెలువడే చోట; అంతులేని శ్రమ వైపు పరిపూర్ణత చేతులు చాచే చోట; ఎల్లప్పుడూ విస్తరించే ఆలోచనలు, చేతల వైపు మనస్సు ముందుకు నడిచే చోట... నా దేశం ఉండేలా, అటువంటి ఆ సుందర లోకంలోకి జాగృతం చెయ్యి...’’ అని అడుగుతారు టాగోర్, ఆ భగవంతుడిని. నేటి మన్ కీ బాత్‌లో నా నివేదన కూడా సరిగ్గా ఇదే. కానీ ఆ నివేదన దైవానికి కాదు. భారతీయ యువతరానికి.
ఈ మధ్యాహ్నం ఎయిర్ షో జరిగే నమో ఘాట్‌లోనే, నా దేశ యువతతో నేను ముఖాముఖి సంభాషించబోతున్నాను. తొలిసారి ఓటు వేసినవారు సహా 30 వేల మంది యువతీ యువకులు, విద్యార్థులతో బహిరంగ మన్ కీ బాత్! జెన్–జీ మన్ కీ బాత్ ! ఈ దేశ ప్రధాని గురించి వారు తమ మనసులోని భావాలను నిర్భయంగా వెల్లడించే ‘దేశ్ కి బాత్’! కొద్ది నిమిషాల్లో నా ఎదురుగా యువ భారత్ ఉంటుంది. నా పక్కన అదృశ్యంగా టాగోర్ ఉంటారు. ‘వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్...’ అనే టాగోర్ స్ఫూర్తి, యువతకు స్వేచ్ఛను ఇస్తుంది. యువత ఈ దేశ ప్రధానిని నిర్భయంగా ప్రశ్నిస్తుంది. టాగోర్ ఈ దేశ యువత అభీష్టం మేరకు ప్రధానిని నడిపిస్తారు.


