బ్లాక్ థర్స్‌డే: న్యూయార్క్ స్టాక్ ఎక్స్‌చేంజ్ ముందు ఆందోళనలో జనం
టైమ్ మెషీన్
1920వ దశకంలో అమెరికా వీధుల్లో కొత్త వెలుగులు విరబూశాయి. పరిశ్రమలు వేగంగా వృద్ధి చెందాయి, రోడ్లపై కొత్త కార్లు పరుగులు తీశాయి, రేడియోలు ఇళ్లలోకి చేరాయి. ఈ కాలాన్ని చరిత్రలో ‘రోరింగ్ ట్వెంటీస్‘ అని పిలుస్తారు. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అమెరికా... ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన కేంద్రంగా మారింది. ఆ రోజుల్లో ప్రతి ఒక్కరూ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావచ్చు అని బలంగా నమ్మారు. బడా వ్యాపారవేత్తల నుండి పారిశుద్ధ్య కార్మికుల వరకు తమ పొదుపు మొత్తాలను వాల్ స్ట్రీట్ షేర్ మార్కెట్లోకి గుమ్మరించారు. కంపెనీల నిజమైన విలువ ఎంత; వాటి ఉత్పత్తి, లాభాలు ఎంత అనే ప్రాథమిక సూత్రాలను పెట్టుబడిదారులు పూర్తిగా పక్కన పెట్టేశారు. కేవలం ధర పెరుగు తోందనే ఏకైక కారణంతో షేర్లను కొనడం ప్రారంభించారు. ఈ విధంగా మార్కెట్లో ఒక భారీ ఊహాజనిత బుడగ (స్పెక్యులేటివ్ బబుల్) రూపుదిద్దుకుంది.
ఆ కాలంలో మార్కెట్‌ను ముంచెత్తిన అతిపెద్ద ముప్పు ‘అప్పు (మార్జిన్ మనీ)తో షేర్లు కొనడం’. పెట్టుబడిదారుడు తన సొంత డబ్బు కేవలం 10 శాతం నుండి 20 శాతం మాత్రమే చెల్లించి, మిగిలిన 80 శాతం కంటే ఎక్కువ మొత్తాన్ని బ్రోకర్ల నుండి అప్పు తీసుకునేవాడు. మార్కెట్ పెరుగుతున్నంత కాలం ఈ విధానం అద్భుతమైన లాభాలను తెచ్చిపెట్టినట్లు కనిపించింది. అయితే షేర్ ధరలు కొద్దిగా తగ్గినా, బ్రోకర్లు అదనపు మార్జిన్ డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తెచ్చేవారు. అదనపు నగదు చెల్లించలేని పరిస్థితుల్లో, బ్రోకర్లు ఆ షేర్లను బలవంతంగా మార్కెట్లో అమ్మకానికి పెట్టేవారు. ఇది మార్కెట్ పతనాన్ని మరింత వేగవంతం చేసే విధ్వంసకర చక్రంగా మారింది. అదే సమయంలో అమెరికా పరిశ్రమల్లో అవసరానికి మించి ఉత్పత్తులు పేరుకుపోయాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడం క్రెడిట్ లభ్యతను మరింత తగ్గించింది.
బ్లాక్ థర్స్‌డేతో విధ్వంసం ప్రారంభం
1929 అక్టోబర్ 24, గురువారం న్యూయార్క్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో కొద్ది నిమిషాల్లోనే వాల్ స్ట్రీట్ వాతావరణం భయాందోళనలతో అల్లకల్లోలంగా మారింది. పెట్టుబడిదారులు తమ వద్ద ఉన్న షేర్లను వదిలించుకోవడానికి పోటీపడ్డారు. ఆ ఒక్క రోజే దాదాపు 1.29 కోట్ల షేర్లు అమ్ముడయ్యాయి. బ్యాంకర్ల బృందం రంగంలోకి దిగి, మార్కెట్‌ను ఆదుకోవడానికి భారీగా షేర్లను కొనుగోలు చేయడంతో పతనం తాత్కాలికంగా ఆగింది. కానీ అక్టోబర్ 28 సోమవారం (బ్లాక్ మండే) డౌ జోన్స్ సూచీ 12.8 శాతం కూలిపోయింది. మరుసటి రోజు అక్టోబర్ 29న ‘బ్లాక్ ట్యూస్డే’ నాడు 1.6 కోట్లకు పైగా షేర్లు చేతులు మారాయి. దిగ్గజ కంపెనీల షేర్ల విలువలు పాతాళానికి పడిపోయాయి. సెప్టెంబర్ 3న 381 పాయింట్ల వద్ద ఉన్న డౌ జోన్స్ సూచీ 1932 జూలై నాటికి 41 పాయింట్లకు పడిపోయింది. ఏకంగా 89 శాతం ఆస్తి తుడిచి పెట్టుకుపోయింది.
స్టాక్ మార్కెట్ సంక్షోభం క్రమంగా సామాన్యుడి జీవితాన్నీ తీవ్రంగా కుదిపివేసింది. కంపెనీల విలువ తగ్గిపోవడంతో పరిశ్ర మలు మూతపడ్డాయి, ఉద్యోగుల తొలగింపు మొదలైంది. 1933 నాటికి అమెరికాలోని ప్రతి ఐదు బ్యాంకుల్లో ఒకటి దివాళా తీసింది. 1932 నాటికి దేశంలో ప్రతి నలుగురు కార్మికులలో ఒకరు నిరుద్యోగిగా మారారు. కాగితాలు, రేకులతో వెలసిన అసంఖ్యాక తాత్కాలిక నివాసాలు నాటి మహా మాంద్యానికి సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి. ఈ ఆర్థిక పతనం ‘గ్రేట్ డిప్రెషన్’గా రూపాంతరం చెంది ప్రపంచ దేశాలను చుట్టుముట్టింది. ‘గోల్డ్ స్టాండర్డ్’ ద్వారా సంక్షోభం ఇతర ఖండాలకు విస్తరించింది. జర్మనీలో ఏర్పడిన తీవ్ర నిరుద్యోగం అడాల్ఫ్ హిట్లర్ నాజీ పార్టీ అధికారంలోకి రావడానికి అనుకూల వాతావరణాన్ని కల్పించింది.
ఇదీ చదవండి: ఓ స్త్రీగా బతకడం కోసం...
నాటి బ్లాక్ థర్స్‌డే ఘటన నేటి ఆర్థిక ప్రపంచానికి విలువైన పాఠాలను అందిస్తోంది. కేవలం ధర పెరుగుతోందనే ఒక్క కారణంతో ఆస్తికి విపరీతమైన విలువ ఉందనుకోవడం పెద్ద భ్రమ. మార్జిన్‌తో పెట్టుబడి పెట్టడం లాభాలను పెంచినట్లే, నష్టాల సమయాల్లో సర్వస్వం ఊడ్చేస్తుంది. జ్ఞానం కంటే భయం, అత్యాశ మాత్రమే మార్కెట్లను నడిపేటట్లయితే తీవ్రమైన విపత్తులు తప్పవు.
ఎడిటోరియల్ టీమ్


