మృత్యువును కళ్లలోకి చూస్తూ నిటారుగా నిలబడింది! | Time Machine: Mata Hari real name and interesting facts | Sakshi
Sakshi News home page

ఓ స్త్రీగా బతకడం కోసం...

Oct 14 2026 7:39 PM | Updated on Oct 14 2026 7:53 PM

Time Machine: Mata Hari real name and interesting facts

మాతా హరి

టైమ్‌ మిషన్‌

తన అందచందాలు, డ్యాన్స్‌ విన్యాసాలతో ఐరోపా సమాజాన్ని ఉర్రూతలూగించిన ఒక నర్తకి... మొదటి ప్రపంచ యుద్ధ సంక్షోభంలో అంతర్జాతీయ గూఢచారిగా ముద్రపడి, తుపాకీ తూటాలకు బలైంది. ప్రపంచవ్యాప్తంగా ‘మాతా హరి’గా ప్రసిద్ధి చెందిన ఆమె అసలు పేరు మార్గరీథా గీర్‌ట్రూయిడా జెల్లె. నెదర్లాండ్స్‌లోని లీవర్డెన్‌ నగరంలో 1876 ఆగస్టు 7న జన్మించిన ఈ డచ్‌మహిళ.

మార్గరీథా జీవితం వెనుక అంతులేని విషాదం దాగి ఉంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమె తల్లిదండ్రులు చిన్నపుడే విడిపోయారు. 14వ ఏట తల్లి క్షయవ్యాధికి గురై మరణించింది. పద్దెనిమిదేళ్ల వయసులో ఆమ్‌స్టర్‌డ్యామ్‌లోని కెప్టెన్‌ రుడాల్ఫ్‌ మెక్‌లియోడ్‌ అనే కరుడుగట్టిన సైనికుడిని 1895 జూలై 11న వివాహం చేసుకుకుంది. తరువాత ఇండోనేషియాలోని జావా, సుమత్రా దీవులకు భర్తతోపాటు వెళ్లింది. రుడాల్ఫ్‌ విపరీతమైన తాగుబోతు, తిరుగుబోతు, క్రూరుడు కూడా. అటువంటి అతడు ఆమెకు సిఫిలిస్‌ వ్యాధిని కూడా తగిలించాడు. ఫలితంగా ఆమె ఇద్దరు పిల్లలూ సిఫిలిస్‌ వ్యాధితోనే పుట్టారు. 1899 వేసవిలో విషపూరితమైన పాదరస చికిత్స కారణంగా రెండున్నరేళ్ల కుమారుడు నార్మన్‌ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ విషాదంతో దాంపత్య బంధం పూర్తిగా విచ్ఛిన్నమైంది. అప్పటికే అప్పులపాలైన భర్త భరణాన్ని ఇవ్వడానికి నిరాకరించాడు. తీవ్రమైన పేదరికంలో కూరుకుపోయిన మార్గరీథా చివరకు బిడ్డను భర్త వద్దే వదిలేయాల్సి వచ్చింది.

మాతా హరి అవతరణ 
కుమార్తెను తిరిగి దక్కించుకోవడానికి తగినంత డబ్బు సంపాదించాలనే ఆశతో మార్గరీథా పారిస్‌ చేరుకుంది. ఈ దుర్భర పరిస్థితుల్లో ఆమె తన పాత గుర్తింపును సమాధి చేసి, సరికొత్త అవతారం ఎత్తాలని నిశ్చయించుకుంది. అలా పుట్టిందే ‘మాతా హరి’.  మలయ్‌ భాషలో మాతా హరి అంటే ‘సూర్యుడు’ లేదా ‘పగటి కన్ను’ అని అర్థం. తాను ఒక పవిత్ర భారతీయ ఆలయంలో జన్మించానని, అక్కడి పూజారిణుల వద్ద ప్రాచీన ఆలయ నృత్యాలు నేర్చు కున్నానని ఒక వింతైన కల్పిత గాథను సమాజంలో ప్రచారం చేసింది. 1905 మార్చి 13న పారిస్‌లోని మ్యూసీ గుయిమెట్‌లో ఆమె తొలిసారిగా బహిరంగ ప్రదర్శన ఇచ్చింది. జావా, సుమత్రాలలో గమనించిన సంప్రదాయ నృత్యాల ఆధారంగా ఒంటిపై దుస్తులను నెమ్మదిగా తొలగిస్తూ చేసిన ప్రదర్శనలు పారిస్‌ సమాజంలో పెను ప్రకంపనలు సృష్టించాయి. పదేళ్లపాటు ఐరోపా విలాస సమాజంలో తిరుగులేని తారగా వెలిగింది.

కాలం గడిచేకొద్దీ నృత్యాలకు ఆదరణ తగ్గింది. సరిగ్గా అదే సమయంలో మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది. 1915 చివరలో ది హేగ్‌లో ఉన్నప్పుడు, ఒక జర్మన్‌  కాన్సుల్‌ ఆమె ఫ్రాన్స్‌ పర్యటనలో సమాచారం సేకరించి ఇస్తే భారీగా డబ్బు ఇస్తానని ఆశ చూపించాడు. ప్రమాదకరం కాని పాతబడిన సమాచారం అందించి ఆమె జర్మన్స్‌ నుంచి డబ్బు తీసుకుంది. మరోవైపు, ఫ్రెంచ్‌ ఇంటెలిజెన్స్‌ కోసం గూఢచారిగా పనిచేయడానికి కూడా ఆమె సిద్ధపడింది. ఆమె ద్వంద్వ వైఖరిపై అనుమానం పెంచుకున్న ఫ్రెంచ్‌ నిఘా వర్గాలు ఆమెను వెంబడించాయి.

ఇదీ చ‌ద‌వండి: చరిత్రలో.. 'ఓ రవాణా అద్భుతం!'

1917 ఫిబ్రవరి 13న పారిస్‌నగరంలో ఫ్రెంచ్‌నిఘా వర్గాలు మాతా హరిని బంధించి, సెయింట్‌ లాజారే జైలులో నిర్బంధించాయి. అదే ఏడాది జూలై 24–25 తేదీల్లో సైనిక న్యాయస్థానంలో రహస్య విచారణ సాగింది. సొంత అసమర్థతను, వ్యూహాత్మక లోపాలను కప్పిపుచ్చుకోవడానికి ఫ్రెంచ్‌సైనిక నాయకత్వానికి ప్రజల దృష్టిని మళ్లించే ఒక ఆకర్షణీయమైన బలిపశువు అవసరమైంది. అందుకే సైనిక న్యాయస్థానం ఆమెకు మరణశిక్ష ఖరారు చేసింది. 1917 అక్టోబర్‌ 15 తెల్లవారుజామున మాతా హరిని విన్సెన్స్‌ సైనిక స్థావరానికి తరలించారు. చట్ట ప్రకారం కళ్లకు గంతలు కట్టుకోవాలని అధికారులు కోరినప్పుడు, ఆమె నిరాకరించింది. మృత్యువును కళ్లలోకి చూస్తూ నిటారుగా నిలబడింది. సైనికులు పేల్చిన తూటాలు ఆమె ఛాతీని చీల్చివేశాయి.

కాలం గడిచేకొద్దీ అసలు నిజాలు బయటపడ్డాయి. 1930 లోనే జర్మన్‌ ప్రభుత్వం మాతా హరి తమ గూఢచారి కాదని స్పష్టంగా ప్రకటించింది. 2017లో ఫ్రాన్స్‌ స్వయంగా విడుదల చేసిన డాక్యుమెంట్లు ఆమె ఫ్రెంచ్‌ వైఫల్యాలకు బలైన అమాయకురాలని రూఢీ చేశాయి. దీంతో ఆమె కేవలం యుద్ధోన్మాద సైనిక వ్యవస్థ తన వైఫల్యాలను దాచుకోవడానికి బలిపీఠం ఎక్కించిన ఒక దయనీయమైన బలిపశువు మాత్రమే అని తేలింది.

- ఎడిటోరియల్ టీమ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement