ప్రపంచ యుద్ధాన్ని దాటేసి..1,569 రోజులుగా ఆగని మారణహోమం | Russia Ukraine War Outlasts World War I as Peace Remains Elusive | Sakshi
Sakshi News home page

ప్రపంచ యుద్ధాన్ని దాటేసి..1,569 రోజులుగా ఆగని మారణహోమం

Jun 13 2026 11:06 AM | Updated on Jun 13 2026 11:38 AM

Russia Ukraine War Outlasts World War I as Peace Remains Elusive

న్యూఢిల్లీ: రష్యా, ఉక్రెయిన్ మధ్య సాగుతున్న సుదీర్ఘ యుద్ధం సరికొత్త రికార్డులకు దారితీసింది. 2022  ఫిబ్రవరిలో రష్యా దళాలు ఉక్రెయిన్‌పైకి దూసుకెళ్లినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ ఘర్షణ 1,569 రోజులకు చేరుకుంది. ఇది 1914 నుండి 1918 వరకు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన మొదటి ప్రపంచ యుద్ధం (ది గ్రేట్ వార్) కాల వ్యవధిని కూడా దాటేసింది. కొద్ది  రోజుల్లోనే ఉక్రెయిన్‌ను లొంగదీసుకోవచ్చన్న క్రెమ్లిన్ ఆశలు అడియాసలయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా ఖండంలో అత్యంత సుదీర్ఘమైన, అత్యంత ఘోరమైన రక్తపాతంగా ఈ యుద్ధం చరిత్రకెక్కింది.

ఆధునిక సాంకేతికత.. సరికొత్త వ్యూహాలు
మొదటి ప్రపంచ యుద్ధంలో అనేక ప్రపంచ అగ్రరాజ్యాలు నేరుగా పాల్గొనగా, ప్రస్తుత యుద్ధం ప్రధానంగా రెండు దేశాల మధ్యే సాగుతోంది. అయినప్పటికీ డ్రోన్లు, లక్ష్యాలను ఛేదించే క్షిపణులు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ వ్యవస్థల వంటి అత్యాధునిక సైనిక సాంకేతికత వాడకం ఈ యుద్ధాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లింది. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలాస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు రెడ్ కార్పెట్ పరిచి, దశాబ్ద కాలంలో మొదటిసారి అమెరికా గడ్డపై ద్వైపాక్షిక చర్చలు జరిపినప్పటికీ, శాంతి ప్రయత్నాలు ఒకపట్టాన ఫలించలేదు. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పాశ్చాత్య దేశాల నుంచి నిధులు, ఆయుధాల కోసం నిరంతరం పర్యటనలు చేస్తూనే ఉన్నారు.

మొదటి ప్రపంచ యుద్ధ ఛాయలు
ప్రస్తుత ఉక్రెయిన్ యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధాన్ని తలపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. నాటి ట్రెంచ్ వార్‌ఫేర్ (బంకర్ల యుద్ధం), భారీ ప్రాణనష్టం, భూభాగాల కోసం సాగుతున్న హోరాహోరీ పోరు ఇందుకు నిదర్శనం. నాడు మెషిన్ గన్లు, ట్యాంకులు రణరంగాన్ని శాసిస్తే.. నేడు డిజిటల్ నిఘా, డ్రోన్ దాడులు వ్యూహాలను మారుస్తున్నాయి. ఉక్రెయిన్ ప్రజల దృష్టిలో ఈ యుద్ధం 2014లో రష్యా క్రిమియాను ఆక్రమించినప్పటి నుంచే మొదలై, ఒక దశాబ్ద కాలంగా సాగుతోంది. నాటోలో సభ్యత్వం లేకపోయినా, అణ్వాయుధాలు లేకపోయినా ఉక్రెయిన్ ఇంతకాలం రష్యాను ప్రతిఘటించడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది.

వర్సాలీస్ పాఠాలు.. అస్పష్టంగానే శాంతి ప్రక్రియ
ప్రస్తుతం ఉక్రెయిన్ డ్రోన్లు రష్యా భూభాగంలోకి చొచ్చుకుపోతూ తమ బలాన్ని నిరూపించుకుంటున్నాయి. అయినప్పటికీ పుతిన్ చర్చలకు సిద్ధంగా లేరని ‘ది ఎకనామిస్ట్’ పేర్కొంది. మొదటి ప్రపంచ యుద్ధాన్ని ముగించిన 1919 నాటి ‘వర్సాలీస్ సంధి’ సృష్టించిన అసంతృప్తులే రెండో ప్రపంచ యుద్ధానికి దారితీశాయి. ఇప్పుడు కూడా కేవలం తాత్కాలికంగా యుద్ధాన్ని నిలిపివేయడం కాకుండా, భవిష్యత్తులో శాంతి భద్రతలకు గ్యారెంటీ ఇచ్చేలా ఒప్పందాలు జరగాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దశాబ్దాల సైనిక అంచనాలను తలకిందులు చేస్తూ, యుద్ధాలు ఎప్పుడూ వాటి గడువుల ప్రకారం ముగియవని ఈ సుదీర్ఘ పోరు నిరూపిస్తోంది.

ఇది కూడా చదవండి: ‘ఇండియాలో నరకం’.. అమెరికా రిటర్న్ టెక్కీ రచ్చ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement