కలిసి పనిచేయడమే అసలైన ప్రతిభ | Sakshi Guest columns on Comments by Feng Donglai at ShanghaiTech University | Sakshi
Sakshi News home page

కలిసి పనిచేయడమే అసలైన ప్రతిభ

Nov 30 2026 12:07 AM | Updated on Nov 30 2026 12:07 AM

Sakshi Guest columns on Comments by Feng Donglai at ShanghaiTech University

షాంఘై (చైనా)లోని షాంఘై టెక్‌ యూనివర్సిటీ 2026 బ్యాచ్‌ పట్టభద్రులను ఉద్దేశించి విశ్వ విద్యాలయం అధ్యక్షుడు ఫెంగ్‌ డోంగ్‌లై చేసిన స్నాతకోత్సవ ప్రసంగ సంక్షిప్త పాఠం:

విశ్వ గురు

ప్రియమైన విద్యార్థులారా, అధ్యాపకులారా, గౌరవనీయులైన అతిథులారా, పూర్వ విద్యార్థులారా, కుటుంబ సభ్యులారా... ఈ రోజు మనమందరం 2026 బ్యాచ్‌ విద్యార్థుల చదువు పూర్తయిన సందర్భంగా, వారి జీవితాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమవుతున్న ఈ శుభసమయాన్ని జరుపుకోవడానికి ఇక్కడ సమావేశ మయ్యాము. షాంఘై టెక్‌ యూనివర్సిటీ తరఫున మీ అందరికీనా హృదయపూర్వక అభినందనలు. 

ఫీడ్‌బ్యాక్‌ ఏమిటి?
గ్రాడ్యుయేషన్‌ పట్టా పొందడమంటే... మీ విద్యార్థి జీవితానికి ముగింపు మాత్రమే కాదు. మీరు భవిష్యత్తులో ఎలాంటి వ్యక్తులుగా మారబోతున్నారో తెలుసుకునే జీవితకాల ప్రయాణానికి ఇది ప్రారంభం కూడా. గత కొన్ని సంవత్సరాలుగా, మన విద్యార్థులు... అలాగే వారికి ఉద్యోగాలు ఇచ్చే సంస్థల నుంచి మాకు విలువైన ఫీడ్‌బ్యాక్‌ అందింది. అందులో రెండు ముఖ్యమైన అభిప్రాయాలు నా దృష్టిని అమితంగా ఆకర్షించాయి.

మొదటిది: షాంఘైటెక్‌ యూనివర్సిటీ విద్యార్థులకు విస్తృత మైన ఆలోచనా దృక్పథం, స్వతంత్రంగా ఆలోచించే సామర్థ్యం, ఆత్మవిశ్వాసం, తెలుసుకోవాలనే ఆసక్తి, సంప్రదాయ పద్ధతులను ప్రశ్నించే ధైర్యం ఉన్నాయని అందరూ గుర్తిస్తున్నారు. అంటే, మీరు ప్రశ్నలు అడగడానికి భయపడరు. కొత్త ఆవిష్కరణల కోసం ధైర్యంగా ముందడుగు వేస్తారు.

రెండవది: నాయకత్వం, బృందంగా పనిచేయడం, పనులను సమర్థవంతంగా పూర్తి చేయడం, కష్టాలను తట్టుకుని నిలిచే విష యంలో ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ఈ రెండు అభి ప్రాయాలు ఒకదానికొకటి విరుద్ధమైనవి కావు. వాస్తవానికి ఇవి మన ముందు ఒక కీలక ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. మన వ్యక్తిగత సామ ర్థ్యాలను పెంచుకుంటూనే, గొప్ప లక్ష్యాన్ని సాధించే సమూహంలో భాగంగా మారడం ఎలా?

నేను– మనం
ఈ రోజు నేను విజయం ఎలా సాధించాలి అనే విషయం గురించి  మాట్లాడదలచుకోలేదు. దానికి బదులుగా ‘నేను’ మరియు ‘మనం’ మధ్య ఉన్న సంబంధాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అనే అంశంపై చర్చించాలనుకుంటున్నాను. 

జీవితంలో కేవలం ‘నేను’ మాత్రమే ఉండి, ‘మనం’ అనే భావన లేకపోతే మన ప్రయాణం క్రమంగా కుంచించుకుపోతుంది. చివరికి మన అభివృద్ధికి మనమే పరిమితులు విధించుకున్నట్లు అవుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నేటి మన ప్రపంచం ఎన్నో క్లిష్టమైన సమస్యలు ఎదుర్కొంటోంది. అందుకే వివిధ విభా గాల మధ్య సమన్వయంతోనే శాస్త్రీయ పరిశోధనలు జరగాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. విభిన్న నేపథ్యాలు కలిగిన వ్యక్తులు ఒక చోట చేరి ఉమ్మడి లక్ష్యం కోసం తమ పూర్తి శక్తి సామర్థ్యాలతో కలిసి పనిచేసినప్పుడే, ఒంటరిగా పరిష్కరించలేని ఎన్నో సమస్యలకు సమాధానం లభిస్తుంది.

కృత్రిమ మేధస్సు(ఏఐ) మన వ్యక్తిగత సామర్థ్యాలను పెంచ గలదు. కానీ అది పరస్పర నమ్మకాన్ని, ఉమ్మడి బాధ్యతను లేదా ఇతరులతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని మాత్రం భర్తీ చేయలేదు. సహకారం లేకపోతే క్లిష్టత మనకు గందరగోళంగా కనిపిస్తుంది. కానీ అందరం కలిసి పనిచేస్తే... అదే క్లిష్టత కొత్త ఆలోచనలకు, సృజనా త్మకతకు దారితీస్తుంది. వివిధ రంగాలకు చెందిన వారితో కలిసి పనిచేయడం, ఒకరి నుంచి మరొకరు నేర్చుకోవడం, అందరూ కలిసి విజయాన్ని సాధించడమే అసలైన బలం.

మూడు ముఖ్యమైన ఆలోచనలు
షాంఘైటెక్‌ నుంచి బయటకు వెళ్తున్న ఈ సమయంలో, మీతో మూడు ముఖ్యమైన ఆలోచనలను పంచుకోవాలనుకుంటున్నాను.
1. మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోండి, కానీ ఇతరుల నుంచి దూరంగా ఉండకండి: స్వతంత్రంగా ఆలోచించడం, ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండటం, విమర్శనాత్మక పరిశీలనను కలిగి ఉండటం చాలా విలువైన లక్షణాలు. కానీ మన గురించి మనం ఎక్కువగా ఊహించుకుంటే, ఆ అతి స్వతంత్రత మొండిత నంగా మారవచ్చు, ప్రత్యేకమైన వ్యక్తిత్వం అహంకారంగా మారవచ్చు, ఆత్మవిశ్వాసం ఇతరుల మాటలు వినడానికి ఇష్టపడని స్వభావంగా మారవచ్చు.

వాస్తవానికి పరిపక్వత అంటే... మనపై మనకు నమ్మకం ఉండటం మాత్రమే కాదు, ఇతరుల అభిప్రాయాలను అర్థం చేసుకోవడం కూడా! మనం మాత్రమే విజయం సాధించడం కాదు, ఇతరులు కూడా సక్సెస్‌ సాధించేలా అవకాశాలను కల్పించడం. ఎవరూ ఒంటరిగా అన్నీ సాధించలేరు. ప్రతి వ్యక్తి విజయం వెనుక అందుకు సహకరించిన సమాజం పాత్ర కూడా ఎంతో ఉంటుంది.

2. వ్యక్తిగతంగా విజయం సాధించండి, బృందం కూడా సక్సెస్‌ సాధించేలా సహకరించండి: మీ జీవితంలో తదుపరి దశలోకి అడుగుపెట్టినప్పుడు, బాగా వెలిగేవారే అందరి విశ్వాసాన్ని పొందే వారు కాదని తెలుసుకుంటారు. బాధ్యతలను స్వీకరించడానికి ఇష్టపడేవారు, ఇతరులతో మనస్ఫూర్తిగా కలిసి పనిచేసేవారు, తమ చుట్టూ ఉన్నవారు మరింత మెరుగ్గా రాణించడానికి సహాయం చేసేవారే అందరి నమ్మకాన్ని పొందుతారు.

నిజమైన నాయకత్వం అంటే, ‘నేను నీకంటే శక్తిమంతుడిని’ అని నిరూపించుకోవడం కాదు. దానికి బదులుగా, ‘నేను ఇక్కడ ఉండటం వల్ల మనమందరం కలిసి మరింత బలంగా ఉన్నాం’ అని చెప్పగలిగే పరిస్థితిని సృష్టించడం. మీరు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు, పైకి రావడా నికి ప్రయత్నిస్తున్న వారికి సహాయం చేయడానికి మీ చేతిని అందించడానికి వెనుకాడకండి.

3. మీ జీవితాన్ని గొప్ప లక్ష్యంతో అనుసంధానం చేసుకోండి:
మీలో ప్రతి ఒక్కరికీ సొంత కలలు ఉంటాయి. ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన మార్గం ఉంటుంది. కానీ మన జీవితానికి నిజమైన విలువ కేవలం మనం మన కోసం సాధించిన విజయాల్లోనే ఉండదు. మన సమాజానికి, మన దేశానికి, మనం నివసిస్తున్న ప్రపంచానికి మనం అందించే సేవలో కూడా ఉంటుంది.
మీ వ్యక్తిగత అభివృద్ధిని గొప్ప లక్ష్యంలో భాగంగా చూడండి. మన వ్యక్తిగత ఆశయాలు గొప్ప లక్ష్యంతో అనుసంధానమైనప్పుడు, అవి మరింత అర్థవంతంగా మారతాయి. ఎన్నో చిన్న చిన్న వెలు గులు ఒక్కటైనప్పుడు... అవి భవిష్యత్తును ప్రకాశింపజేయగల గొప్ప వెలుగుగా రూపొందుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement