అభిప్రాయం
భారత బ్యాంకింగ్ వ్యవస్థలో రుణాల పెరుగుదలతో పోలిస్తే డిపాజిట్ల వృద్ధి మందగిస్తోంది. 2022–23లో షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల డిపాజిట్లు 10.1% పెరగ్గా, రుణాల వృద్ధి 15.6%గా నమో దైంది. అదే ఒరవడి కొనసాగుతూ 2025–26లో డిపాజిట్లు 11.2%, రుణాలు 14.4% పెరిగాయి. దానికి అనుగుణంగా, రుణ–డిపాజిట్ నిష్పత్తి 2022–23లో 75.79% ఉండగా, 2025–26లో 81.44%కు పెరిగింది. అంటే బ్యాంకులు ప్రస్తుతం తమ వద్దనున్న ప్రతి రూ. 100 డిపాజిట్లకు రూ. 81.44 మేర రుణాలు ఇస్తున్నాయి. 2026 అక్టోబర్ 15 నాటికి డిపాజిట్ల వార్షిక వృద్ధి 16.7% ఉంటే, బ్యాంకు రుణాలు 18.2% పెరి గాయి. ఈ పరిణామం బ్యాంకుల నిధుల సమీకరణ వ్యూహాలకు మరింత పదును పెట్టుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తోంది.
పొదుపుల కేటాయింపులో మార్పు
డిపాజిట్ల కొరత ఏర్పడితే బ్యాంకులు అధిక వడ్డీతో డిపాజిట్లు, మార్కెట్ రుణాలు వంటి ప్రత్యామ్నాయాలను ఆశ్రయిస్తాయి. రిజర్వు బ్యాంకు గణాంకాల ప్రకారం, వాణిజ్య బ్యాంకుల డిపాజిట్ల వ్యయం 2022–23లో 3.8% ఉండగా, 2024–25లో 5%కు పెరిగింది. ఇదే సమయంలో నికర వడ్డీ మార్జిన్ 2022–23లో 3.2%ఉండగా, 2024–25లో 3.1%కు తగ్గింది. రుణాలు, పెట్టుబడులపై వచ్చే వడ్డీ ఆదాయం నుంచి డిపాజిట్లు, ఇతర రుణాలపై చెల్లించే వడ్డీ వ్యయాన్ని తీసివేస్తే వచ్చే నికర వడ్డీ ఆదాయాన్ని సగటు ఆస్తులతో పోల్చి నికర వడ్డీ మార్జిన్‌ను లెక్కిస్తారు.
ఏటా వచ్చే లాభాలు డివిడెండ్ల చెల్లింపు, మూలధన పెంపు, విస్తరణ ప్రణాళి కలకు తోడ్పడతాయి. ఈ మార్జిన్ ను కాపాడుకోవడానికి రుణాలపై వడ్డీ రేట్లు పెంచితే వ్యవసాయ, గృహ, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ రుణగ్రహీ తలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. డిపాజిట్ల కోసం పోటీ పడాల్సి వస్తే వడ్డీ రేట్ల పెంపు ద్వారా కాకుండా, మెరుగైన సేవలు, ఖాతాదారులతో సంబంధాల పటిష్ఠత వంటి వడ్డీయేతర అంశాలకు ప్రాధాన్యత ఇస్తామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ సీఎస్ శెట్టి పేర్కొనడం గమనార్హం.డిపాజిట్ల సమీకరణలో ఎదురవుతున్న సవాలుకు కుటుంబాల ఆర్థిక పొదుపుల కేటాయింపులో వస్తున్న మార్పు ఒక ప్రధాన కారణం. కేంద్ర ఆర్థిక సర్వే 2025–26లోని ఎన్‌ఎస్‌ఈ ఈపీఆర్ గణాంకాల ప్రకారం, గృహరంగం వార్షిక ఆర్థిక పొదుపుల్లో బ్యాంకు డిపాజిట్ల వాటా 2012లో 57.9% ఉండగా, 2025 నాటికి 35.2%కి తగ్గింది.
అదే సమయంలో, షేర్లు, మ్యూచువల్ ఫండ్ల వాటా 1.8% నుంచి 15.2%కి గణనీయంగా పెరిగింది. ఉదాహరణకు, ఐసీఐసీఐ బ్యాంకు వారి ‘ఐవిష్’ పథకం నిర్దిష్ట పొదుపు లక్ష్యాన్ని నిర్ణయించుకుని, స్థిరమైన నెలవారీ వాయిదాల నిబంధన లేకుండా, తమ సౌలభ్యం మేరకు వివిధ మొత్తాల్లో పొదుపు చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. మారుతున్న ఆదాయ, పొదుపు ధోరణులకు అనుగు ణంగా ఖాతాదారుల పెట్టుబడి అవసరాలు, భద్రతపై అభిరుచులు, ద్రవ్యత అవసరాలను పరిగణనలోకి తీసుకుని బ్యాంకులు వినూత్న డిపాజిట్ ఉత్పత్తులను సృజనాత్మకంగా రూపొందించాలి.
చిన్న పొదుపులు... పెద్ద అవకాశాలు
చిన్న పొదుపుదారులను బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానించడంలో కీలక పాత్ర పోషించే బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాల (బీఎస్‌బీడీఏ) సంఖ్య 2022–23లో 68.56 కోట్ల నుంచి 2025 డిసెంబర్ నాటికి 73.04 కోట్లకు పెరిగింది. అయితే, మొత్తం డిపాజిట్లలో బ్యాంకులు నిర్వహించే ఈ ఖాతాల నిల్వల వాటా 2022–23లో సుమారు 1.38% ఉండగా, 2024–25 నాటికి 1.36%కు స్వల్పంగా తగ్గింది. మరోవైపు, మొత్తం బీఎస్‌బీడీఏ నిల్వల్లో బిజినెస్ కరస్పాండెంట్ల (బీసీల) ద్వారా సమీకరించిన నిల్వల వాటా 2022–23లో 49.2% ఉండగా, 2024–25లో 53.1%కి పెరిగింది.
ఈ పరిణామాన్ని దృష్టిలో ఉంచుకుని, చిన్న పొదుపుదారులను బీసీలకే పరిమితం చేయకుండా, బ్యాంకులు కూడా వారితో నిరంతర సంబంధాలు కొనసాగిస్తూ చిన్న మొత్తాల పొదుపు పథకాలను ప్రోత్సహించాలి. మరోవైపు, ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ, మైక్రో–ఏటీఎంలు, యూపీఐ వంటి సాంకేతిక పరిష్కారాలను విస్తృతంగా వినియోగించడం ద్వారా బీసీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి. సిప్ (ఎస్‌ఐపీ)లు విస్తృతంగా ప్రాచు ర్యంలోకి రాకముందు చిన్న మదుపరుల విశేషాదరణ పొందిన రికరింగ్ డిపాజిట్లను (ఆర్‌డీ) బ్యాంకులు తిరిగి చురుగ్గా ప్రోత్సహించాలి.
థర్డ్ పార్టీ విక్రయాల్లో సమతుల్యత
బీమా, మ్యూచువల్ ఫండ్లు, ఇతర ఆర్థిక ఉత్పత్తుల విక్రయం ద్వారా 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు పొందిన కమీషన్/ఫీజు ఆదాయం 2020–21లో రూ. 3,728 కోట్లుగా ఉండగా, 2024–25 నాటికి రూ. 7,714 కోట్లకు చేరింది. ఈ ఆదాయం బ్యాంకుల లాభ దాయకతకు తోడ్పడుతుందనడంలో సందేహం లేదు. అయితే, థర్డ్ పార్టీ ఉత్పత్తుల విక్రయ లక్ష్యాలు, వాటి కోసం సిబ్బంది వెచ్చిస్తున్న సమయం డిపాజిట్ సమీకరణకు కేటాయిస్తున్న సమయంతో సమతుల్యంగా ఉన్నాయా అన్నది బ్యాంకులు సమీక్షించుకోవాలి. ముఖ్యంగా, ఇటీవల సామాజిక మాధ్యమాల్లో... ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడానికి వచ్చిన ఖాతాదారుకు జీవిత బీమా వంటి బ్యాంకింగేతర ఉత్పత్తులు అమ్మిన వ్యంగ్యకథనాలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ విషయంపై బ్యాంకు యాజమాన్యాలు దృష్టి సారించాలి. సిబ్బంది పనితీరు అంచనాల్లో డిపాజిట్ సమీకరణకు కూడా తగినంత సంస్థాగత ప్రాధాన్యత ఇవ్వాలి.
ఖాతాదారులకు వేగవంతమైన సేవలను అందిస్తున్న డిజిటల్ సౌకర్యాలు, వారితో వ్యక్తిగత సంబంధాలకు ప్రత్యామ్నాయంగా మారకూడదు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, చిన్న వ్యాపారులు, గ్రామీణ ఖాతాదారుల విషయంలో మరింత శ్రద్ధ అవసరం. వ్యవసాయం, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు, గృహ నిర్మాణం, మౌలిక సదుపాయాలు వంటి దేశ నిర్మాణానికి అవసరమైన రంగాలకు రుణాలు అందుబాటులో ఉండాలంటే... తక్కువ వడ్డీ వ్యయంతో డిపాజిట్లను సమీకరించగలగడం కీలకం. ఇందుకోసం మారుతున్న పొదుపుల ధోరణులకు అనుగుణంగా డిపాజిట్ ఉత్పత్తులను రూపొందించడం, చిన్న పొదుపుదారులను ఆకర్షించడం, డిపాజిట్ సమీకరణకు సిబ్బంది పనితీరులో తగిన ప్రాధాన్యం కల్పించడం వంటి చర్యలు అవసరం.

-వ్యాసకర్త బ్యాంకింగ్ రంగ విశ్లేషకులు
-కృష్ణ బాలాజీ పల్లపోతు


