అభిప్రాయం
తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయా లనే ప్రతిపాదన నేపథ్యంలో, ఈ విద్యా విధానం ఎలా ఆవిర్భవించిందో, దాని వెనుక ఉన్న ఆలోచనలు ఏమిటో తెలుసు కోవడం అవసరం. ఇంటర్మీడియట్ విద్య అనేది కేవలం పదో తరగతి తర్వాత మరో రెండేళ్ల చదువు కాదు. పాఠశాల విద్యకు, ఉన్నత విద్యకు మధ్య ఒక ప్రత్యేక విద్యా దశను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఇది రూపుదిద్దుకుంది.
1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆంధ్ర,తెలంగాణ ప్రాంతాల్లో సెకండరీ విద్యా విధానాలు భిన్నంగాఉండేవి. ఆంధ్ర ప్రాంతంలో నాన్ –ఎలెక్టివ్ విధానం అమలులోఉండగా, తెలంగాణ ప్రాంతంలో ఎలెక్టివ్ విధానం ఉండేది. పాఠ శాల విద్యా నిర్మాణంలోనే కాకుండా, విశ్వవిద్యాలయాల పరిధిలో అమలవుతున్న ప్రీ–యూనివర్సిటీ కోర్సుల విషయంలోనూ తేడాలు ఉండేవి. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో 1956–57 నుంచి, ఆంధ్ర విశ్వవిద్యాలయం, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయాల పరిధిలో 1957–58 నుంచి రెండేళ్ల పి.యు.సి. కోర్సు అమలులోకి వచ్చింది. అదే సమయంలో కొన్ని పాఠశాలల్లో హయ్యర్ సెకండరీ, మల్టీపర్పస్ విధానాలు కూడా కొనసాగేవి.
5+2+3+2+3
1964లో కోఠారి విద్యా కమిషన్ తన పని ప్రారంభించిన సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర విద్యా వ్యవస్థపునర్వ్యవస్థీకరణపై ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించింది. అప్పటి ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విశ్వవిద్యాల యాల ఉపకులపతులు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, విద్యావేత్తలు, రాష్ట్ర శాసనసభ ప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశం రాష్ట్రానికి పదిహేనేళ్ల విద్యా నిర్మా ణాన్ని ప్రతిపాదించింది. దాని ప్రకారం ఐదేళ్ల ప్రాథమిక విద్య,రెండేళ్ల ప్రాథమి కోన్నత విద్య, మూడేళ్ల ఉన్నత పాఠశాల విద్య,రెండేళ్ల హయ్యర్ సెకండరీ విద్య, మూడేళ్ల డిగ్రీ విద్య ఉండాలి. దీనినే 5+2+3+2+3 నిర్మాణంగా పేర్కొన్నారు. పది, పన్నెండు తరగతుల చివర రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు.
రెండేళ్ల హయ్యర్ సెకండరీ విద్యను అవసరాన్ని బట్టి డిగ్రీ కళాశాలల్లోనూ, ఎంపిక చేసిన ఉన్నత పాఠశాలల్లోనూ నిర్వహించవచ్చని సమావేశం సిఫారసు చేసింది. అయితే రెండు రకాలసంస్థల్లోనూ ఒకే పాఠ్యప్రణాళిక, ఒకే పరీక్షా విధానం ఉండాలని ప్రతిపాదించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సిఫారసులను అంగీకరించి కొత్త విద్యా నిర్మాణాన్ని ఆమోదించింది.ఈ నిర్ణయానికి సంబంధించిన వివరాలు 1973లో ప్రచురించిన పి.డి. శుక్లా కమిటీ నివేదికలోని ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థపై అనుబంధంలో నమోదయ్యాయి. ఈ నివేదిక ప్రకారం, రాష్ట్రంలో 1964లోనే విద్యా పునర్వ్యవస్థీకరణపై విధానపరమైన నిర్ణయాలు ప్రారంభమయ్యాయి.
ఇంటర్మీడియట్ కోర్సు ప్రారంభం
1964లో తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం దశలవారీగా అమలు చేసింది. పునర్వ్యవస్థీకరించిన విద్యా విధానాన్ని 1968–69 నాటికి పదో తరగతికి విస్తరించారు. కొత్త విధానంలో పదో తరగతి మొదటి పబ్లిక్ పరీక్షను ఏప్రిల్ 1969లో నిర్వహించారు. ఈ పరీక్ష అనంతరం కొత్త విద్యా నిర్మాణంలోని రెండేళ్ల హయ్యర్ సెకండరీ కోర్సుకు ‘ఇంటర్మీడియట్ కోర్సు’ అనే పేరు పెట్టి, 1969–70విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి ప్రభుత్వం 1968 అక్టోబర్ 25న జీఓఎమ్‌ఎస్ నం.1920 జారీచేసింది. 1969 జూన్ 28న జారీ చేసిన జీఓఎమ్‌ఎస్ నం. 1458 ద్వారా ఎంపిక చేసిన విద్యాసంస్థలను జూనియర్ కళాశాలలుగా గుర్తించారు. అదే ఏడాది ఆగస్టు 25న జీఓఎమ్‌ఎస్ నం. 2063 ద్వారా జూనియర్ కళాశాలల సిబ్బంది నిర్మాణం, వేతనాలను నిర్ణయించారు. సెప్టెంబర్ 17న జారీ చేసిన జీఓఎమ్‌ఎస్ నం. 2186 ద్వారా పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులను జూనియర్ లెక్చరర్లుగా సర్దుబాటు చేయడానికి సూచనలు ఇచ్చారు.
అప్పటికే ఉన్న డిగ్రీ కళాశాలల్లోనూ, ఎంపిక చేసిన హయ్యర్ సెకండరీ, మల్టీపర్పస్ పాఠశాలల్లోనూ ఈ కోర్సును ప్రారంభించారు. కొన్ని పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అభివృద్ధి చేశారు. 1970–71 రాష్ట్ర బడ్జెట్ ప్రసంగం ప్రకారం... ఆంధ్రప్రాంతంలో 70 ప్రభుత్వ, 15 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ప్రారంభమయ్యాయి. పరీక్షల షెడ్యూల్ కారణంగా తెలంగాణ ప్రాంతంలో కళాశాలలు అదే సమయంలో ప్రారంభం కాలేక,1970 ఫిబ్రవరిలో ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. ఇక్కడ ఒక చారిత్రక విషయాన్ని స్పష్టంగా గుర్తించాలి. ఉస్మానియా, ఆంధ్ర, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయాల పరిధిలో అంతకుముందే పి.యు.సి. కోర్సులు ఉన్నప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా ఒకే విద్యా నిర్మాణంలో భాగంగా రెండేళ్ల ఇంటర్మీడియట్ కోర్సు ప్రారంభమైంది మాత్రం 1969–70లోనే.
అసలు లక్ష్యం
ఇంటర్మీడియట్ విద్యను ప్రవేశపెట్టడం వెనుక పాఠశాల విద్యకు, ఉన్నత విద్యకు మధ్య ఒక ప్రత్యేకమైన విద్యా దశను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది. విద్యార్థులు డిగ్రీ స్థాయిలో ప్రత్యేకమైన విషయాలను ఎంచుకునే ముందు వాటిపై లోతైన అవగాహన పొందడం, తమ ఆసక్తి, సామర్థ్యాలకు అనుగుణంగా విద్యా విభాగాలను ఎంచుకోవడం, ఉన్నత విద్యకు అవసరమైన పునాదిని ఏర్పరచుకోవడం దీని ముఖ్య ఉద్దేశాలు.అంతేకాకుండా, అందరూ డిగ్రీ విద్య వైపు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటర్మీడియట్ స్థాయిలోనే ఉద్యోగాలకు లేదా స్వయం ఉపాధికి ఉపయోగపడే వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టాలనే ఆలోచన కూడా ఉంది.
శుక్లా కమిటీ నివేదికలోనూ హయ్యర్‌సెకండరీ దశను విద్యార్థుల ఆసక్తి, సామర్థ్యాలకు అనుగుణంగా ఉన్నత విద్యకు సిద్ధం చేసే దశగానూ, వృత్తి విద్య ద్వారా ఉపాధికి మార్గం చూపే దశగానూ పేర్కొన్నారు. కేవలం విద్యా నిర్మాణాన్ని మార్చడం కాకుండా, పాఠ్యప్రణాళికను ఆధునీకరించి అన్నిదశల్లో విద్యా ప్రమాణాలను పెంచడమే అసలు లక్ష్యమని నివేదిక స్పష్టం చేసింది. కాలక్రమంలో జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షల కోచింగ్‌కు అధిక ప్రాధాన్యం పెరగడం, మార్కులు, ర్యాంకులే విద్యా విజయానికి కొలమానాలుగా మారడం, భాషలు, మానవీయ శాస్త్రాలు, కళలు, క్రీడలకు ప్రాధాన్యం తగ్గడం వంటి పరిణామాలు ఇంటర్మీడియట్ విద్య అసలు లక్ష్యాలను బలహీనపరిచాయి.
ఈ పరిస్థితుల్లో ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయాలా వద్దా అన్నది మాత్రమే చర్చనీయాంశం కాకూడదు. విలీనం చేసినా, చేయకపోయినా ఈ విద్యా దశలక్ష్యాలు ఏమిటి? విద్యార్థుల సమగ్ర వికాసానికి అవసరమైన బోధన, పాఠ్యప్రణాళిక, ఉపాధ్యాయులు, ప్రయోగశాలలు, గ్రంథా లయాలు, వృత్తి విద్య, విషయాల ఎంపిక స్వేచ్ఛ వంటి అంశాలను ఎలా బలోపేతం చేయాలి? ఇంటర్మీడియట్ విద్య ఏ పరిపాలనా వ్యవస్థలో ఉండాలన్న చర్చ కంటే... ఆ విద్య ద్వారా ఎలాంటి విద్యార్థులను, ఎలాంటి సమాజాన్ని నిర్మించాలన్నదే చాలా ముఖ్యం.

- వ్యాసకర్త అధ్యాపకులు,కాకతీయ ప్రభుత్వ కళాశాల, హన్మకొండ
- ఎడమశ్రీనివాస రెడ్డి


