గ్రామాల ఖజానాలకు నిధుల గ్రహణం.. మూడేళ్లలో కుదేలైన పంచాయతీల ఆర్థిక పరిస్థితి
కేంద్ర, రాష్ట్ర గ్రాంట్లు తగ్గడం, సొంత ఆదాయం పెరగకపోవడమే కారణం
ఒక్కో పంచాయతీ రాబడి రూ. 16.72 లక్షల నుంచి ఏకంగా రూ. 4.42 లక్షలకు పడిపోయిన వైనం
మూడేళ్లలో ప్రభుత్వ గ్రాంట్లలో గణనీయంగా 80.4% క్షీణత
స్థానిక ఎన్నికల జాప్యంతో తగ్గిన కేంద్ర గ్రాంట్లు.. అభివృద్ధి పనులు వాయిదా.. మౌలిక వసతుల నిర్వహణ అంతంతే
మొత్తం 12,994 పంచాయతీలకు గాను 11,025 పంచాయతీల రికార్డులు విశ్లేషించిన ఆర్‌బీఐ
ఎన్నికల నిర్వహణ, పాలకవర్గాలకు అధికారాల కల్పన, నిధుల విడుదలలో పారదర్శకత అత్యవసరమన్న నివేదిక
పన్నుల వసూళ్ల సామర్థ్యం, ఆస్తుల నిర్వహణ, స్థానిక ఆదాయ వనరుల గుర్తింపు, పన్నేతర ఆదాయ మార్గాల పెంపుపై దృష్టి పెట్టాలని సూచన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంచాయతీల ఖజానాలు వెలవెలబోతున్నాయి. పల్లెల్లో అభివృద్ధి కుంటుపడుతోంది. ‘గ్రామ స్వరాజ్యమే లక్ష్యం..గ్రామాల అభివృద్ధే ధ్యేయం..’ నినాదాలుగానే మిగిలిపోతున్నాయి. ప్రజలకు కనీస మౌలిక వసతులూ కష్టసాధ్యంగా మారుతున్నాయి. గ్రామాల అభివృద్ధి నిధులు గణనీయంగా తగ్గిపోయాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో జాప్యం కారణంగా కేంద్ర గ్రాంట్లు, నిధుల కొరత నేపథ్యంలో రాష్ట్ర గ్రాంట్లు తగ్గడంతో పాటు పంచాయతీల సొంత ఆదాయ వనరులు ఆశించిన స్థాయిలో పెరగకపోవడం గ్రామీణ స్థానిక సంస్థలను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఒకప్పుడు మిగులుతో ఉన్న గ్రామాలు లోటులో పడిపోయాయి.
గతంలో ఆదాయం, వ్యయాల మధ్య సానుకూల సమతుల్యత ఉన్న స్థానిక సంస్థలు ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఆదాయం, వ్యయం రెండూ తగ్గిపోవడం గమనార్హం. మిగులు నిధులు ఉంటే గ్రామాల్లో కొత్త పనులు చేపట్టడానికి, అత్యవసర అవసరాలను తీర్చడానికి అవకాశం ఉంటుంది. లోటు ఏర్పడితే ఇప్పటికే ఉన్న పనుల నిర్వహణకే నిధులు సరిపోని పరిస్థితి వస్తుంది. గ్రామ పంచాయతీల ఆర్థిక స్థితి ఇలాగే కొనసాగితే స్థానిక అభివృద్ధి కార్యక్రమాలపై దీర్ఘకాలిక ప్రభావం పడే ప్రమాదం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక స్పష్టం చేసింది.
దేశంలోని గ్రామ పంచాయతీల ఆర్థిక స్థితిగతులపై ఆర్‌బీఐ రెండో ద్వైవార్షిక (నవంబర్ 2026 ) నివేదిక (ఫైనాన్సెస్ ఆఫ్ పంచాయతీరాజ్ ఇన్‌స్టిట్యూషన్స్: లోకల్ ఫైనాన్సెస్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ ఇన్ రూరల్ ఇండియా) పలు కీలక విషయాలను బయటపెట్టింది. 2022–23 నుంచి 2024–25 వరకు దేశంలోని 25 రాష్ట్రాలకు చెందిన 2.25 లక్షల గ్రామ పంచాయతీల లెక్కలను ఆర్‌బీఐ విశ్లేషించగా..తెలంగాణకు సంబంధించిన గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
గ్రాంట్లే ఆధారం
రాష్ట్రంలోని 12,994 గ్రామ పంచాయతీలకు గాను 11,025 పంచాయతీల (84.8%) రికార్డులను పరిశీలించగా గత మూడేళ్లలో నిధుల ప్రవాహం భారీగా పడిపోయినట్లు తేలింది. 2022–23, 2024–25 మధ్య మూడేళ్లలో ప్రభుత్వ గ్రాంట్లలో ఏకంగా 80.4% క్షీణత చోటు చేసుకోవడం గమనార్హం. ఆర్‌బీఐ, పంచాయతీ రాజ్ సంస్థల ఆర్థిక నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా గ్రామ పంచాయతీలు 90 శాతం ప్రభుత్వ గ్రాంట్లపైనే ఆధారపడుతున్నాయని వెల్లడైంది. సొంత వనరుల (వోన్ సోర్స్ రెవెన్యూ–ఓఎస్‌ఆర్) ద్వారా సమకూరే ఆదాయం కేవలం 10 శాతం మాత్రమే కాగా.. గ్రాంట్లు తగ్గిపోవడంతో గ్రామీణ పాలన ఆర్థికంగా బలహీనపడుతోంది.
మొత్తం ఆదాయంలో గ్రాంట్ల వాటా అధికంగా ఉన్నప్పుడు వాటి విడుదలలో జాప్యం జరిగినా, కేటాయింపులు తగ్గినా స్థానిక సంస్థలపై నేరుగా ప్రభావం పడుతుంది. దీంతో గ్రామాల్లో చేపట్టాల్సిన పనులు వాయిదా పడటం, ఇప్పటికే ఉన్న వసతుల నిర్వహణ కష్టమవడం వంటి పరిణామాలు ఎదురవుతున్నాయి. స్థానిక పన్నుల వసూళ్లలో కొంత బలం ఉన్నప్పటికీ, మొత్తం ఆదాయాన్ని పెంచే స్థాయిలో అవి లేవని గణాంకాలు సూచిస్తున్నాయి. రాష్ట్రంలో ఈ దుస్థితికి పలు కారణాలను నివేదిక వెల్లడించింది.
ఎన్నికల్లో జాప్యంతో ఇక్కట్లు
తెలంగాణలో పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగిసిన తర్వాత ఎన్నికలు నిర్వహించడంలో జరిగిన జాప్యమే ఆర్థిక దుస్థితికి ప్రధాన కారణమని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. (రాష్ట్రంలో తాజా ఎన్నికలు వివిధ కారణాలతో సుమారు రెండేళ్లు ఆలస్యంగా 2025 చివర్లో జరిగాయి, ఇక గత పాలకవర్గాల పదవీకాలం ముగిసి రెండున్నరేళ్లు అవుతున్నా మండల, జిల్లా పరిషత్‌లు ఇప్పటివరకు జరగలేదు) ప్రజాప్రతినిధులు లేకపోవడంతో కేంద్ర ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయి. 2022–25 మధ్య కాలంలో జాతీయ స్థాయిలో ఒక పంచాయతీ సగటు రాబడి రూ.21.3 లక్షలు, వ్యయం రూ. 21.5 లక్షలుగా ఉండగా.. తెలంగాణ ఈ మూడేళ్లలోనూ జాతీయ సగటు కంటే చాలా వెనుకబడింది.
గతంలో మిగులు బడ్జెట్‌లో ఉన్న తెలంగాణ పంచాయతీలు, 2024–25 నాటికి సగటున 1.7 శాతం ఆర్థిక లోటులోకి జారుకున్నాయి. రాబడి రూ.4.42 లక్షలకు పడిపోగా, కనీస నిర్వహణ కోసం రూ. 6.24 లక్షలు ఖర్చు చేయాల్సి రావడంతో పంచాయతీలపై అప్పుల భారం పడుతోంది. అయితే 2023–24లో రెండు ప్రభుత్వాల పాలనా కాలాలు ఉండటం, 2024–25 గణాంకాల్లో తాత్కాలిక సమాచారం ఉండే అవకాశం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని నివేదిక పేర్కొంది.
కీలక సూచనలు
పంచాయతీల మొత్తం వ్యయంలో దాదాపు 40 శాతం (2024–25లో 44.5 శాతం) తాగునీటి సరఫరా, పారిశుధ్య పనులకే ఖర్చవుతోంది. దీనివల్ల స్థానిక అవసరాలకు అనుగుణంగా నిధులు ఖర్చు చేసే స్వేచ్ఛ పంచాయతీలకు తగ్గుతోంది. 2026–31 కాలానికి గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.4.35 లక్షల కోట్ల గ్రాంట్లను 16వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. అయితే 2028–29 నుంచి పంచాయతీలు సొంతంగా సమకూర్చుకునే ఆదాయం ఆధారంగానే నిధుల విడుదల ఉంటుందని స్పష్టం చేసింది.
కాగా ఎన్నికల నిర్వహణ, పాలకవర్గాలకు అధికారాల కల్పన, నిధుల విడుదలలో పారదర్శకత పాటించడం వంటి చర్యలు అత్యవసరంగా మారాయని, పన్నుల వసూళ్ల సామర్థ్యం, ఆస్తుల నిర్వహణ, స్థానిక ఆదాయ వనరుల గుర్తింపు, పన్నేతర ఆదాయ మార్గాల అభివృద్ధిపై పంచాయతీలు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నివేదిక స్పష్టం చేసింది.
కేవలం నిబంధనల అమలుకే పరిమితం కాకుండా, స్థానిక సంస్థల ఆర్థిక, పరిపాలనా సామర్థ్యాన్ని (కెపబిలిటీ–బేస్డ్ అప్రోచ్) పెంచాలని పేర్కొంది. పన్నులు, యూజర్ చార్జీల వసూళ్లు మెరుగుపరిచేందుకు గ్రామాల్లోని ఆస్తుల రిజిస్టర్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని సూచించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ఐ ప్రకారం ప్రతి ఐదేళ్లకు ఒకసారి రాష్ట్ర ఆర్థిక సంఘాలను క్రమం తప్పకుండా ఏర్పాటు చేసి, రాష్ట్ర పన్నుల్లో పంచాయతీలకు వాటా కల్పించాలని తెలిపింది. 




