క్రీడల అభివృద్ధికి ఖేలో ఇండియా పునాది | Khelo India Youth Games 2026 to be held in the state from December 11th to 22nd | Sakshi
Sakshi News home page

క్రీడల అభివృద్ధికి ఖేలో ఇండియా పునాది

Nov 26 2026 4:03 AM | Updated on Nov 26 2026 4:03 AM

Khelo India Youth Games 2026 to be held in the state from December 11th to 22nd

ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ బ్రోచర్‌ ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో అడ్లూరి లక్ష్మణ్, జితేందర్‌రెడ్డి, సంజయ్‌జాజు, వేంనరేందర్‌రెడ్డి, రామకృష్ణారావు తదితరులు

అధికారులకుసీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం 

క్రీడా స్ఫూర్తి ఉట్టిపడేలా ఏర్పాట్లు ఉండాలి

స్టేడియాల పునరుద్ధరణ, క్రీడా వేదికల నాణ్యతలో రాజీ పడొద్దు 

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులకు మెరుగైన శిక్షణ అందించాలి 

మట్టిలో మాణిక్యాలను వెలికితీయాలి 

డిసెంబర్‌ 11న ఎల్బీస్టేడియంలో అట్టహాసంగా ప్రారంభోత్సవ వేడుకలు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణను అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌–2026 రాష్ట్ర క్రీడాభివృద్ధికి బలమైన పునాదిగా నిలవనున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. వచ్చే నెల 11న ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంబోత్సవం నిర్వహించాలని, గచ్చిబౌలి స్టేడియంలో ముగింపు వేడుకలకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

నగరమంతా క్రీడా స్ఫూర్తి ఉట్టిపడేలా ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు. డిసెంబర్‌ 11 నుంచి 22 వరకు రాష్ట్రంలో జరగనున్న ఈ పోటీలకు సంబంధించిన ఏర్పాట్ల పురోగతిపై మంత్రి వాకిటి శ్రీహరి, ఉన్నతాధికారులతో కలిసి సీఎం సమీక్ష నిర్వహించారు. క్రీడా వేదికల అభివృద్ధి, పోటీల నిర్వహణ, క్రీడాకారులకు కల్పించాల్సిన సదుపాయాలపై పలు సూచనలు చేశారు. 

ఏర్పాట్లలో నాణ్యతే ముఖ్యం 
‘స్టేడియాల పునరుద్ధరణ, క్రీడా వేదికల అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దు. పనుల పురోగతిపై నోడల్‌ అధికారుల నుంచి ప్రతిరోజూ నివేదికలు తెప్పించుకోవాలి. ఎక్కడికక్కడ విజిలెన్స్‌ నిఘా ఉండాలి. పోటీల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలి. అన్ని క్రీడా వేదికల్లో టాయిలెట్లతో సహా నిర్వహణ అవసరాలకు ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన నీటిని వినియోగించాలి. ఒక్కో విభాగానికి ప్రత్యేక ఇన్‌చార్జులను నియమించి బాధ్యతలు అప్పగించాలి. 

పోలీస్, మున్సిపల్‌ అధికారులు సమన్వయంతో పనిచేయాలి. పోటీల ఏర్పాట్ల పర్యవేక్షణకు జిల్లాల వారీగా మంత్రులను ఇన్‌చార్జులుగా నియమించాలి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబులతో సమన్వయం చేసుకుంటూ మంత్రి వాకిటి శ్రీహరి ఏర్పాట్లను పర్యవేక్షించాలి. మహబూబ్‌నగర్‌ పరిధిలో జూపల్లి కృష్ణారావు, వరంగల్‌లో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కరీంనగర్‌లో అడ్లూరి లక్ష్మణ్, ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు, నిజామాబాద్‌లో సుదర్శన్‌రెడ్డికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలి. 

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులను గుర్తించి వారికి మెరుగైన శిక్షణ అందించాలి. దేశంలోనే అత్యుత్తమ కోచ్‌లను నియమించి మట్టిలో మాణిక్యాలను వెలికితీయాలి. తెలంగాణ సంప్రదాయ యుద్ధకళ కర్రసాము ఈసారి ఖేలో ఇండియా పోటీల్లో ప్రదర్శన క్రీడగా తొలిసారి చోటు దక్కించుకోనుండటంతో దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ప్రారంభ, ముగింపు వేడుకలకు సంబంధించి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బాధ్యతలు కేటాయించాలి..’అని ముఖ్యమంత్రి ఆదేశించారు. 

ఒలింపిక్స్‌ పతకాలే లక్ష్యం 
‘తెలంగాణను అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం క్రీడారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. స్టేడియాల ఆధునీకరణతో పాటు రాష్ట్రవ్యాప్తంగా క్రీడా అకాడమీలు, మినీ స్టేడియాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నాం. నూతన క్రీడా విధానం, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, గ్రామీణ స్థాయి నుంచి ప్రతిభావంతులను ప్రోత్సహించే కార్యక్రమాలతో క్రీడలకు కొత్త ఊపిరి పోస్తున్నాం. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే స్థాయికి రాష్ట్ర క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రత్యేక స్పోర్ట్స్‌ పాలసీని అమలు చేస్తున్నాం..’అని సీఎం తెలిపారు.

ప్రపంచ స్థాయిలో స్టేడియంల అభివృద్ధి
ఖేలో ఇండియా పోటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.203 కోట్లు ఖర్చు చేస్తుండగా, కేంద్ర ప్రభుత్వం రూ.21 కోట్లు కేటాయించిందని అధికారులు వివరించారు. ఇందులో రూ.120 కోట్ల రాష్ట్ర బడ్జెట్‌తో స్టేడియాల్లో ప్రపంచస్థాయి అభివృద్ధి పనులు, అత్యాధునిక క్రీడా పరికరాల ఏర్పాటు చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 20 క్రీడా వేదికల్లో అభివృద్ధి పనులు చేపట్టగా, ఇప్పటికే 14 స్టేడియాల్లో పనులు పూర్తయ్యాయని చెప్పారు.

మిగిలిన ఆరు చోట్ల ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేస్తామన్నారు. 27 క్రీడలకు సంబంధించి తెలంగాణకు చెందిన 1,334 మంది క్రీడాకారులకు శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. రాష్ట్రం తరఫున పోటీల్లో పాల్గొనే 861 మంది క్రీడాకారులు, కోచ్‌లకు స్పోర్ట్స్‌ కిట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈసారి క్రీడల్లో దేశవ్యాప్తంగా 9 వేల మందికి పైగా పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement