పౌల్ట్రీ పరిశ్రమకు అండ | CM Revanth Reddy at the 18th Poultry India Expo | Sakshi
Sakshi News home page

పౌల్ట్రీ పరిశ్రమకు అండ

Nov 26 2026 3:58 AM | Updated on Nov 26 2026 3:58 AM

CM Revanth Reddy at the 18th Poultry India Expo

సీఎం రేవంత్‌రెడ్డికి జ్ఞాపికను బహూకరిస్తున్న పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్‌సింగ్‌ బయాస్‌. చిత్రంలో మంత్రి వాకిటి శ్రీహరి, తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్‌ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాందీ

ప్రాధాన్యత రంగంగా గుర్తించి శాశ్వత పరిష్కారానికి విధానాలు 

ఫామ్‌ల నిర్మాణానికి సింగిల్‌ విండో అనుమతులు 

మొక్కజొన్న కొరత నివారణకు చర్యలు 

కరువు ఏర్పడినా రెండేళ్లకు సరిపడా సన్నబియ్యం నిల్వలు  

18వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పోలో సీఎం రేవంత్‌రెడ్డి  

తల్లిపాలు, గుడ్డును కల్తీ చేయలేరు: మంత్రి వాకిటి శ్రీహరి

సాక్షి, హైదరాబాద్‌: పౌల్ట్రీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. పౌల్ట్రీ రంగాన్ని ప్రాధాన్య పరిశ్రమగా గుర్తించి, ఈ రంగం ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా విధానాలను రూపొందిస్తామని తెలిపారు. పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామన్నారు. 

హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించిన 18వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో–2026ను రేవంత్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పౌల్ట్రీ పరిశ్రమ కేవలం కోళ్లు, గుడ్ల ఉత్పత్తికే పరిమితం కాకుండా రైతుల ఆర్థిక శక్తిని బలోపేతం చేస్తోందన్నారు. వ్యవసాయ కూలీలు, రైతులకు ఉపాధి కల్పిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తోందన్నారు. 

పల్లెల్లోనూ వేగంగా అనుమతులు 
రోజుకు 5.30 కోట్ల గుడ్ల ఉత్పత్తితో విద్యార్థులు, యువతకు పౌష్టికాహారం అందించడంలో పౌల్ట్రీ రంగం కీలక పాత్ర పోషిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. అలాగే, వేలాది మంది జీవనోపాధికి ఈ పరిశ్రమ ఆధారంగా నిలుస్తోందన్నారు. పౌల్ట్రీ పరిశ్రమ ఏర్పాటు చేసుకునేందుకు ఎదురవుతున్న సమస్యలను పరిశ్రమ ప్రతినిధులు తన దృష్టికి తెచ్చారని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో పౌల్ట్రీ ఫారాల ఏర్పాటుకు అనుమతులు, ల్యాండ్‌ కన్వర్షన్‌ విషయంలో జాప్యం జరుగుతోందన్న అంశం తన దృష్టికి వచ్చిందన్నారు. 

పట్టణాల్లో ’బిల్డ్‌ నౌ’యాప్‌ ద్వారా సింగిల్‌ విండో విధానంలో అనుమతులు ఇస్తున్న తరహాలోనే, త్వరలోనే సమగ్ర పాలసీ తెచ్చి గ్రామీణ ప్రాంతాలకూ ఈ విధానాన్ని విస్తరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, డిసెంబర్‌ 7 నుంచి 9 వరకు జరిగే ’ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌–2026’నాటికి ప్రతిపాదనలతో వస్తే, భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో పౌల్ట్రీ కన్వెన్షన్‌ సెంటర్‌ ఏర్పాటుకు అవసరమైన భూమిని కేటాయిస్తామని ప్రకటించారు.  

మొక్కజొన్న కొరతపై ప్రత్యేక దృష్టి 
వర్షాభావంతో కరువు ఏర్పడినా రెండేళ్లకు సరిపడా సన్నబియ్యం నిల్వలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పౌల్ట్రీ రంగానికి అవసరమైన ముడిసరుకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తక్షణమే మంత్రి వాకిటి శ్రీహరి పౌల్ట్రీ ప్రతినిధులతో సమావేశంఏర్పాటు చేయాలని సూచించారు. గత ప్రభుత్వాలు రూపొందించిన మంచి విధానాలను కొనసాగిస్తూనే, అవసరాలకు అనుగుణంగా కొత్త పాలసీలను తీసుకొస్తున్నామని తెలిపారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.  

త్వరలోనే పరిశ్రమకు శుభవార్త: మంత్రి వాకిటి  
తల్లిపాలు, గుడ్డును కల్తీచేయలేరని మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గుల కారణంగా పౌల్ట్రీ రైతులు ఆర్థికంగా నష్టపోకుండా తగిన విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. త్వరలోనే పౌల్ట్రీ పరిశ్రమకు శుభవార్త అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

పౌల్ట్రీ పరిశ్రమలకూ అనుమతుల ప్రక్రియను సరళతరం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు వేం నరేందర్‌రెడ్డి, రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాం«దీ, మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి, పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్‌సింగ్‌ బయాస్, తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్‌ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్‌ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, కార్పొరేషన్‌ చైర్మన్లు మల్‌రెడ్డి రాంరెడ్డి, శివసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement