ఇరాన్‌లో 'పరువు హత్య' (honour killing)గా భావిస్తున్న 19 ఏళ్ల గర్భిణి హత్యోందంతం వెలుగులోకి వచ్చింది. బాధితురాలిని హెలియా ఫత్తాహిగా గుర్తించారు. ఒక యువకుడితో ఉన్న సంబంధం కారణంగా తాను రెండు నెలల గర్భిణి అయిన కుమార్తెను స్వయంగా ఆమె తల్లిదండ్రులే అత్యంత కిరాతకంగా హత్య చేశారు. పశ్చిమ ఇరాన్‌లోని సనందాజ్ నగరంలో ఈ ఘటన జరిగింది.
'ఇరాన్ ఇంటర్నేషనల్' నివేదిక ప్రకారం నిందితులైన తల్లిదండ్రులు వోరియా ఫత్తాహి, లైలా వీస్‌లను అధికారులు అరెస్టు చేశారు. విచారణలో తల్లిదండ్రులిద్దరూ తామే హత్య చేసినట్లు అంగీకరించారు. కేవలం గర్భవతి అన్న కారణంగానే తల్లిదండ్రులు ఆమెను హతమార్చారు. తొలుత (శనివారం,నవంబర్ 21) ఫత్తాహిపై ఫిర్యాదు చేయడానికి కోర్టుకు వెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత, కుమార్తెతో బలవంతంగా సుమారు 30 మూర్ఛ వ్యాధి నిరోధక మాత్రలు (anticonvulsant pills) మింగించారు. ఆమె ఇంకా బతికే ఉందని గమనించి, తీవ్రంగా కొట్టి, ఆపై దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేశారని ఆరోపణలు నమోదైనాయి. 'హెంగావ్ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్' తెలిపింది. హనా అనే మరో మానవ హక్కుల సంఘం ఈ హత్యను 'పరువు హత్య'గా పేర్కొన్నాయి.
గృహ హింస నుండి మహిళలు, పిల్లలను రక్షించడానికి ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ సమర్థవంతమైన చట్టాలను రూపొందించడంలో విఫలమవడం, చట్టపరమైన లొసుగులు, 'పరువు హత్యలకు' పాల్పడే వారికి తక్కువ శిక్షలు విధించడం వంటివి వ్యవస్థీకృత హింసకు ప్రేరేపిస్తున్నాయని, నేరస్తులకు శిక్ష పడదనే ధీమాను పెంచుతున్నాయని హెంగావ్ పేర్కొంది.
ఇదీ చదవండి: రూ. 32 కోట్ల జాక్‌పాట్.. ఎవరీ స్నేహ జాయ్?
ఈ ఘటన ఇరాన్‌లో మహిళలపై జరుగుతున్న అణచివేతపై మరోసారి చర్చకు దారితీసింది. వారం రోజుల వ్యవధిలో ఇరాన్‌లో ఒక యువతి హత్యకు గురికావడం ఇది మూడవసారి. గత బుధవారం (నవంబర్ 18), గిలాన్ ప్రావిన్స్‌లో 23 ఏళ్ల సదాఫ్ హగ్బిన్ తన పుట్టినరోజు వేడుకలో మాజీ ప్రియుడిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించినందుకు హత్యకు గురైంది. అంతకుముందు, కెర్మాన్‌షాలో 16 ఏళ్ల పాఠశాల విద్యార్థిని సోగాండ్ సయాదీ ఒక భవనం ఐదవ అంతస్తు నుండి పడి మరణించింది. తనను తండ్రితో ఇంటికి పంపితే ఆయన చంపేస్తాడని ఆమె పాఠశాల సిబ్బందిని ముందే హెచ్చరించినట్లు ఉపాధ్యాయ సంఘాల జాతీయ నెట్‌వర్క్ తెలిపింది.
హిజాబ్ లేకుండా పాట పాడిన 29 ఏళ్ల అహ్మదీతో పాటు సంగీత బృందానికి చెందిన సోహైల్ ఫఘీహ్ నసిరి, అమీన్ తహేరి, అమీర్ అలీ పిర్నియా, మొహ్సెన్ లష్కరీలకు కూడా 74 చొప్పున కొరడా దెబ్బలు విధించిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: 70 ఏళ్ల సమస్యకు నీనా గుప్తా సమాధానం!


